నవతెలంగాణ – ఆత్మకూరు
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని మినీ మేడారంగా పేరు గాంచిన అగ్రంపహాడు సమ్మక్క-సారలమ్మ జాతర హుండీ ఆదాయం లెక్కింపు మంగళవారం వరంగల్ రామన్నపేట బట్టల బజార్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చేపట్టారు. 64 హుండీల ద్వారా 40.74 లక్షలు, 17 గ్రాముల బంగారం, 770 గ్రాముల వెండి, ప్రత్యేక దర్శనాలు, తలనీలాలు, ఇతర రుసుముల ద్వారా మొత్తం 64.48 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో నాగేశ్వరరావు తెలిపారు.
గత సంవత్సర జాతర కంటే ఈసారి 3.56 లక్షల ఆదాయం అదనంగా వచ్చిందన్నారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఆర్డిఓ కే.నారాయణ, సిఎఫ్ఓ గౌరీ శంకర్, జాతర చైర్మన్ వంచ రంగారెడ్డి, అగ్రంపహాడు గ్రామ సర్పంచ్ గంగుల మహేందర్, పూజారులు సారంగపాణి, వెంకన్న, సాంబయ్య , సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.



