సోనియా ద్వారా కర్నాటక సర్కార్‌ను ఒప్పించాలి
మహారాష్ట్ర అభ్యంతరం తెలిపినప్పుడు తెలంగాణ ఎందుకు తెలపదు?
రేవంత్‌రెడ్డి సర్కారు సుప్రీంకోర్టుకెళ్లకపోతే మేమెళ్తాం
సీక్రెట్, సోషల్ మీడియాలతో హరీశ్‌రావు, సంతోశ్‌రావు దాడి : తెలంగాణ జాగృతి అధ్యక్షులు కె.కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడాన్ని రాష్ట్ర సర్కారు అడ్డుకోవాలనీ, ఈ విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ద్వారా సిద్ధరామయ్యను ఒప్పించి ఎత్తు పెంపును ఆపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడారు. కృష్ణానది సగం తెలంగాణకు ప్రాణదాయని అని చెప్పారు. ఉమ్మడి ఏపీలోనే కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా కోసం న్యాయ పోరాటం చేశామని గుర్తుచేశారు. ఇప్పుడు కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచడంలో భాగంగా లక్షా 30వేల ఎకరాల సేకరణకు సిద్ధమైందని చెప్పారు. ఐదు మీటర్ల ఎత్తు పెంచి 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. అదే జరిగితే కృష్ణానదిలో తెలంగాణ వాళ్లు క్రికెట్ ఆడుకోవడం తప్ప చేసేదేమీ ఉండదన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచితే తమ రాష్ట్రంలోని రెండు జిల్లాలు మునుగుతాయని మహారాష్ట్ర సర్కారు అభ్యంతరం తెలిపిందనీ, తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా మన సీఎం ఎందుకు చప్పుడు చేయడంలేదని ప్రశ్నించారు.
త్వరలో హైదరాబాద్‌లో జరిగే కృష్ణా బోర్డు మీటింగ్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ఆల్మట్టికి వ్యతిరేకంగా బలమైన వాదనలు వినిపించాలని డిమాండ్ చేశారు. ఆల్మట్టిపై తెలంగాణ సర్కారు సుప్రీం కోర్టుకు వెళ్లకపోతే జాగృతి తరఫున తాము వెళ్తామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు, కృష్టా నది ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. గోదావరి నీళ్లను చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి అప్పగించారని ఆరోపించారు. ఏపీ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్‌ను తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా పెట్టుకోవడంతోనే ఇబ్బందులు వస్తున్నాయనీ, ఆయన్ను తొలగిం చాలని డిమాండ్ చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపు నిర్ణయం కాలేదని రేవంత్‌రెడ్డి చెప్పడం పచ్చి అబద్ధమనీ, కర్నాటక ప్రభుత్వం భూసేకరణకు రూ.70 వేల కోట్లను దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయం చేసిందని చెప్పారు.
బీసీల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం
బీసీల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కవిత విమర్శించారు. ఆ అంశంపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని ఎత్తిచూపారు. బీసీ రిజర్వేషన్ల విషయాన్ని పట్టించుకోకపోతే జాగృతి ఆధ్వర్యంలో మంత్రులు, సీఎం నివాసాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ పదవి నుంచి వచ్చిన పదవి వద్దనే రాజీనామా చేశాననీ, మండలి చైర్మెన్ కావాలని తాత్సార్యం చేస్తున్నారని చెప్పారు. మళ్లీ రాజీనామా ఇవ్వమంటే ఇస్తానని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చుననీ, ఎంత ఎక్కువ మంది బీసీ వాదం ఎత్తుకుంటే అంత త్వరగా బీసీలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
సీక్రెట్, బీఆర్‌ఎస్ సోషల్‌మీడియా ద్వారా దాడి
బీఆర్‌ఎస్ పార్టీలో తనకు జరిగిన అవమానాలు, ఎదుర్కొన్న ఇబ్బందులు రాష్ట్ర ప్రజలకు తెలుసునని కవిత చెప్పారు. హరీశ్‌రావు మీడియా, సంతోశ్‌రావు సీక్రెట్ మీడియా, బీఆర్‌ఎస్ సోషల్‌మీడియా ద్వారా తనపై దాడి జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కారణాలతో గతేడాది బతుకమ్మ సంబురాలు జరుపుకోలేదన్నారు. ఈ ఏడాది ప్రజల ఆహ్వానం మేరకు సొంతూరైన చింతమడకలో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నామని ప్రకటించారు.
బతుకమ్మ పేరుతోనే చీరలివ్వాలి
గత ప్రభుత్వం దసరాకు బతుకమ్మ పేరుతో చీరలు ఇచ్చేదని కవిత గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ పేరు పెట్టవద్దని కోరారు. ఆ పేరు కొనసాగించకపోతే తెలంగాణ ఆడబిడ్డ పేరు పెట్టాలని సూచించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారనీ, దశలవారీగా పేర్లు మారుస్తూ…తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు.