ధరలు తగ్గించకపోతే దశల వారి పోరాటాలు..
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్
నవతెలంగాణ – మల్హర్ రావు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సామాన్యుడి నడ్డి పిరుస్తూ గృహ వినియోగ వంటగ్యాస్ సిలిండర్ ధరలను రూ.60, కమర్షియల్ సిలిండర్ ధరను రూ.115 పెంచడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ కార్యదర్శి బందు సాయిలు సోమవారం ఓక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతర్జాతీయంగా మహిళలు అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్న ఈ సందర్భంగా వంట గ్యాస్ ధరలను పెంచి మహిళలకు కేంద్ర బిజెపి సర్కారు కానుకగా ఇచ్చిందా అని దుయ్యబట్టారు.
ప్రజలపై వేస్తున్న ఈ భారానికి నిరసనగా రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కేంద్ర బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంట గ్యాస్ ధరలు తగ్గించాలని జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని సీపీఐ(ఎం) శ్రేణులకు పిలుపునిస్తున్నాను. ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అందుతుంటే, ఇప్పుడు గ్యాస్ ధర పెంచడం పేద, మధ్యతరగతి కుటుంబాలకు అదనపు వారం అవుతుంది. దేశ సంపదను అంబానీ, ఆదాని వంటి కార్పోరేట్లకు ధారా దత్తం చేస్తూ, పేద ప్రజలపై అదనపు భారాలు విధించే కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలను ప్రజలకు తీవ్ర నష్టాలు కలిగిస్తున్నాయి.
కార్పొరేట్ శక్తులకు రాయితీలు ప్రజలపై ధరల భారాలు ఏమిటని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ప్రశ్నిస్తోందన్నారు. కేంద్ర బీజేపీ సర్కార్ తక్షణమే పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయాలని సీపీఐ(ఎం) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోందన్నారు. పెంచిన ధరలకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా సీపీఐ(ఎం) శ్రేణులు తో పాటు సామాన్య ప్రజలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టి, ప్రభుత్వ విధానాలు వెనక్కి పోయే వరకు ఆందోళన పోరాటాలలో కలిసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.



