ఈ నెలలోనే సంతకాలు
న్యూఢిల్లీ : అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో పెట్టుబడులు, ఎగుమతుల అవకాశాలు దెబ్బతింటున్నాయి. దీంతో యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు మన దేశం సంప్రదింపులు కొనసాగిస్తోంది. వీటిలో కొంత పురోగతి కన్పిస్తోంది కూడా. వాణిజ్య ఒప్పందంలో మొత్తం 24 అధ్యాయాలు ఉండగా వాటిలో 20 అధ్యాయాలపై భారత్, ఈయూ సంతకాలు చేశాయని వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ చెప్పారు. ఈ నెలాఖరులో ఈయూ నేతలు భారత్‌లో పర్యటిస్తారు. దానికి ముందే ఒప్పందాన్ని ఖరారు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు అంటోనియో లూయిస్ శాంటోస్ డ కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డర్ లెయాన్‌లు ఈ నెల 26న జరిగే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. 27న జరిగే 16వ భారత్-ఈయూ సదస్సుకు వారు సహ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఈయూతో గత మూడు నెలలుగా జరుగుతున్న చర్చలు చివరి దశకు చేరుకున్నాయని, కొన్ని అంశాలపై సంప్రదింపులు కొనసాగుతున్నాయని అగర్వాల్ తెలిపారు.
రోజువారీ ప్రాతిపదికన చర్చలు జరుగుతు న్నాయని, నేతల మధ్య సమావేశం జరగడానికి ముందే ఒప్పందం ఖరారు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అమెరికా చర్యల నేపథ్యంలో వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయాలని ఇరు పక్షాలు తొందరపడుతున్నాయి. గత సంవత్సరం భారత్ మూడు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోగా దక్షిణ అమెరికాలోని మర్కోసర్‌తో ఒప్పందంపై ఈయూ సంతకం చేసింది. ఈయూతో ఒప్పందంపై సంతకాలు జరిగి, దానిని అమలు చేస్తే భారత్ కుదుర్చుకున్న అతి పెద్ద వాణిజ్య ఒప్పందం అదే అవుతుంది. అమెరికా సుంకాల కారణంగా పడుతున్న ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయూకు ఎగుమతి అవకాశాలు పెంచుకునేందుకు మన దేశం ప్రయత్నిస్తోంది. వ్యవసాయాన్ని మినహాయించి భారత్‌తో ఈ నెలలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుం టామని యూరోపియన్ పార్లమెంటేరియన్లతో జరిగిన సమావేశంలో ఉర్సులా చెప్పినట్లు యూరోపియన్ న్యూస్ వెబ్‌సైట్ ఒకటి తెలియజేసింది. మన దేశానికి సంబంధించినంత వరకూ వ్యవసాయం చాలా కీలకమైన, సున్నితమైన అంశంగా మారింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి ఇదే అడ్డంకిగా ఉంది. ఈయూకి కూడా వ్యవసాయమే ప్రధానాంశం అవుతోంది. ఈయూ-మర్కోసర్ వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఫ్రాన్స్ రైతులు పారిస్‌లోకి ట్రాక్టర్లను నడిపారు.



