Monday, July 28, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుభారత రాజ్యాంగం జోలికొస్తే భూ స్థాపితమే

భారత రాజ్యాంగం జోలికొస్తే భూ స్థాపితమే

- Advertisement -

– ఆర్‌ఎస్‌ఎస్‌, అదానీ, అంబానీ చేతుల్లోనే మోడీ పాలన
– బూతుల పార్టీలొద్దు, భవిష్యత్తు చూపే పార్టీలు అవసరం
– బీసీ రిజర్వేషన్లకు కేంద్రం మోకాలడ్డు
– మస్కు నర్సింహ ఉద్యమ స్ఫూర్తితో భవిష్యత్తు ఉద్యమాలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
– ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ 5వ వర్ధంతి సభ
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం

భారత రాజ్యాంగం జోలికొస్తే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భూస్థాపితం కాక తప్పదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మస్కు నర్సింహ 5వ వర్ధంతిని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పాషా, నరహరి స్మారక కేంద్రంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సామెల్‌ అధ్యక్షతన నిర్వహించిన సభలో జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. ముందుగా నర్సింహ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జూలకంటి మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్‌, అదానీ, అంబానీ చేతుల్లోనే మోడీ ప్రభుత్వ పాలన నడుస్తోందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 11ఏండ్లులో అనేకసార్లు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరిగిందని తెలిపారు. కేరళ, తమిళనాడు, వెస్ట్‌ బెంగాల్‌, పంజాబ్‌, తెలంగాణ రాష్ట్రాలకు పైసా కేటాయించకుండా బీజేపీ వివక్ష చూపుతోందని అన్నారు. 42 శాతం బీసీ బిల్లుకు ఆమోదం తెలపకుండా మోడీ ప్రభుత్వం మోకాలడ్డుతుందని తెలిపారు. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తోందని, రైతు చట్టాలపై వెనక్కి తగ్గినట్టే తగ్గి మరో మార్గంలో వాటిని అమలు చేసేందుకు పూనుకుంటున్నదన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ విద్య, వైద్య రంగాలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఓట్లు, సీట్లను సంతలో సరుకులాగా మార్చేసిందని మండిపడ్డారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాన్యులు పోటీ చేసే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజా సమస్యలను విస్మరించి, బూతులను వల్లే వేస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీలను ఎండగట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాలక పక్షాలపై సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అసమానతలు లేని సమాజ నిర్మాణం ఎర్రజెండాకు మాత్రమే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమించాలన్నారు. నాటి నుంచి నేటి వరకు హత్యలు, నిర్బంధాలు, కేసులకు ఎదురొడ్డి కమ్యూనిస్టులు మాత్రమే ప్రాణ త్యాగాలు చేశారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి శ్రమించిన మస్కు నర్సింహ ఉద్యమ స్ఫూర్తితో భవిష్యత్తు ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.భాస్కర్‌, సామెల్‌, రాంచందర్‌, కె.జగన్‌, ఏర్పుల నర్సింహ, కవిత, చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -