– హర్యానా ఎలక్షన్స్‌ను రిగ్గింగ్ చేశారు
– మహారాష్ట్ర ఎన్నికలు నిష్పాక్షికంగా జరగలేదు
– రాజ్యాంగ సంస్థలతో ప్రత్యర్థులపై బీజేపీ దాడి చేయిస్తోంది : బెర్లిన్‌లో రాహుల్
బెర్లిన్ : దేశంలోని వివిధ రాజ్యాంగ సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై దాడి చేసేందుకు బీజేపీ ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి ఈడీ, సీబీఐలను బీజేపీ వాడుకుంటోందని, అదే సమయంలో తనతో కలిసి ఉన్న పార్టీల జోలికి వెళ్లడం లేదని మండిపడ్డారు. జర్మనీలో ఐదు రోజుల పర్యటనలో ఉన్న రాహుల్ బెర్లిన్‌లోని ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ‘మా రాజ్యాంగ సంస్థలన్నింటినీ గంపగుత్తగా స్వాధీనం చేసుకున్నారు. ఇది మా రాజ్యాంగ వ్యవస్థపై పూర్తి స్థాయిలో జరిగిన దాడి’ అని అన్నారు. ఈడీ, సీబీఐ సంస్థలు బీజేపీపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని, ఆ పార్టీని వ్యతిరేకించే వారి పైనే ఎక్కువగా రాజకీయ కేసులు పెడుతున్నాయని ఆరోపించారు.
కాంగ్రెస్‌కు ఎవరైనా వ్యాపారవేత్త మద్దతు ఇస్తే బెదిరిస్తున్నారని రాహుల్ చెప్పారు. భారత్‌లోని రాజ్యాంగ సంస్థలు ఎలా పనిచేయాలో ఇకపై అలా పనిచేయబోవని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ వాటిని సొంత సంస్థలుగా చూడలేదని, వాటిని దేశానికి చెందినవిగానే పరిగణించిందని తెలిపారు. కానీ బీజేపీ అలా చూడడం లేదని, అవి తమ జేబు సంస్థలేనని భావిస్తోందని, రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి వాటిని ఓ సాధనంగా వాడుకుంటోందని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, దానిని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదని రాహుల్ అభిప్రాయపడ్డారు. ‘ఒక ప్రతిఘటన వ్యవస్థను నిర్మిస్తాం. అది విజయం సాధిస్తుంది. మేము బీజేపీతో పోరాడడం లేదు. వారు భారత రాజ్యాంగ సంస్థలను స్వాధీనం చేసుకోవడాన్నే వ్యతిరేకిస్తున్నాం’ అని చెప్పారు.
రాహుల్ తన ప్రసంగంలో ఓట్ల చోరీని మరోసారి ప్రస్తావించారు. గత సంవత్సరం హర్యానా శాసనసభకు జరిగిన ఎన్నికలను బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. ‘మేము తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో గెలుపొందాం. ఎన్నికలలో నిస్పాక్షికత అంశాన్ని మేము లేవనెత్తుతూనే ఉంటాం. హర్యానా ఎన్నికలలో మేమే గెలిచామన్న విషయాన్ని విలేకరుల సమావేశాలలో ఎలాంటి అనుమానాలకూ ఆస్కారం లేకుండా స్పష్టంగా చెప్పాం. మహారాష్ట్ర ఎన్నికలు నిస్పాక్షికంగా జరిగాయని మేము భావించడం లేదు’ అని చెప్పారు. హర్యానా ఎన్నికలలో జరిగిన అవకతవకలపై ఎన్నికల సంఘాన్ని వివరణ కోరినా సమాధానం రాలేదని అన్నారు. భారత ఎన్నికల యంత్రాంగంలోనే సమస్య ఉన్నదని అనుకుంటున్నామని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ ఆర్థిక దృక్పథం చివరి దశకు చేరుకున్నదని, అది ఇంక ఎంతమాత్రం ఫలితాన్ని ఇవ్వదని స్పష్టం చేశారు. దేశంలో అనేక మంది ప్రజలు మోడీని సమర్ధిస్తున్నారని, అయితే వారిలో చాలా మంది ఆయన సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్నారని రాహుల్ చెప్పారు.
భారత ఎన్నికల యంత్రాంగం లోపభూయిష్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



