సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
పటాన్‌చెరులో ‘నూతన లేబర్ పాలసీ – కార్మిక వర్గంపై దాడి’పై సెమినార్
నవతెలంగాణ-పటాన్‌చెరు
ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ (ఐఎల్‌సీ)ను వెంటనే సమావేశపరచాలని, కార్మిక వర్గానికి వ్యతిరేకమైన ‘శ్రమశక్తి నీతి 2025’ నూతన లేబర్ పాలసీని ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఐలా భవన్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో ‘నూతన లేబర్ పాలసీ (శ్రమశక్తి నీతి – 2025) – కార్మిక వర్గంపై దాడి’ అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దొడ్డిదారిన లేబర్ కోడ్స్‌ను అమలు చేసేందుకే నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి – 2025ను తెస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా కార్మిక వ్యతిరేకమైందని అన్నారు. కార్మిక చట్టాలు ఉన్నప్పుడే వాటి అమలు కాకుండా ఉల్లంఘన జరుగుతున్నాయన్నారు.
ఇక శ్రమశక్తి నీతి – 2025 పేరుతో కార్మికులకు హక్కులు లేకుండా చేసి వారిని కట్టు బానిసలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని విమర్శించారు. 26 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్‌గా మార్చిందని తెలిపారు. లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా సీఐటీయూ జాతీయ కార్మిక సంఘాలన్నింటినీ ఏకం చేసి దేశవ్యాప్త సమ్మె చేయడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి లేబర్ కోడ్స్ అమలు చేయకుండా వెనకడుగు వేసిందని గుర్తు చేశారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం తప్ప అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు 8 గంటల పని దినాన్ని 10 గంటలకు పెంచుతున్నాయన్నారు. కార్మికులకు వ్యతిరేకమైన లేబర్ కోడ్స్‌ను కేరళలో అమలు చేయబోమని అక్కడి వామపక్ష ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. శ్రమశక్తి నీతి లేబర్ పాలసీని మనుస్మృతి పద్ధతిలో అమలు చేయాలంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టడమేనని అన్నారు.
నూతన లేబర్ పాలసీ.. సామాజిక న్యాయానికి, ప్రజాస్వామానికి విరుద్దమని, వివక్ష, అసమానతలను పెంచి పోషిస్తున్నదని తెలిపారు. ప్రమాదకరమైన కార్మిక వ్యతిరేక నూతన లేబర్ పాలసీ శ్రమ శక్తి నీతి 2025ను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు వ్యతిరేకమైన నూతన లేబర్ పాలసీని కార్మిక వర్గం ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ సెమినార్‌లో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు కె.రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్, కిర్భి యూనియన్ జనరల్ సెక్రెటరీ వీఎస్ రాజు, యూనియన్ నాయకులు మల్లేష్, లఖన్, తలారి శ్రీనివాస్, శ్యాంబాబు, రాజిరెడ్డి బిలాల్, జైపాల్, మహేశ్వర్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్‌ను సమావేశపరచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



