Wednesday, January 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఉత్సాహాన్ని నింపిన 'బీమా'మహాసభలు

ఉత్సాహాన్ని నింపిన ‘బీమా’మహాసభలు

- Advertisement -

అఖిల భారత బీమా ఉద్యోగుల అసోసియేషన్‌ (ఎఐఐఇఎ) 27వ మహాసభలు 2025 డిసెంబర్‌ 28 నుంచి 2026 జనవరి ఒకటి వరకు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఉత్సాహ భరితంగా జరిగాయి. దేశం నలుమూల నుంచి మొత్తం 1524 మంది సభ్యులు పాల్గొ న్నారు. దశాబ్దాల పాటు యూనియన్‌కు సేవలందించిన సీనియర్లు ఈ ప్లాటినం జూబ్లీ మహాసభల్లో పాల్గ్గొని వన్నె తెచ్చారు. కొత్తగా రిక్రూట్‌ అయిన యువతరం అధిక సంఖ్యలో పాల్గొన్నది. 368 మంది మహిళా కామ్రేడ్స్‌ హాజరయ్యారు. పాల్గొన్నవారి సంఖ్య, వ్యక్తమైన ఉద్వేగాలు, అర్థవంతమైన చర్చలు, మహాసభ ఇచ్చిన భరోసా, నమ్మకం ఇలా ఏ రకంగా చూసినా గత మహాసభలకంటే ఈ ప్లాటినం జూబ్లీ సంవత్సర మహాసభ అద్భుతమనే చెప్పవచ్చు. 27 మంది మహిళా ఉద్యోగులు ఏఐఐఈఎ అరుణ పతాకాలను చేతబూని ముందు నడవగా, మూడు వేల మందితో మహాసభ ర్యాలీ సాగింది. విభిన్నవర్ణాల దుస్తుల్లో, వివిధ భాషల్లో, నినాదాలతో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ర్యాలీ సాగింది. కళింగ యూనివర్సిటీ ప్రాంగణంలోనే బహిరంగసభ నిర్వహించబడింది.

28న ఉదయం హాజరైన సభ్యుల విప్లవ నినాదాల మధ్య, భువనేశ్వర్‌ కామ్రేడ్స్‌ విప్లవ గీతాలాపనతో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యులు తపన్‌ సేన్‌, ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ మాట్లాడారు. పాలకుల ప్రజా, కార్మిక ప్రతికూల విధానాలను వివరించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అసమానతలు పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్ని చైతన్యపరిచి, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి, వారిని ఉద్యమాలకు సమీకరించాలని, ఇదే మన కర్తవ్యమని ఆయన ఉద్బోధించారు. బీమారంగంలో ప్రతిపాదిస్తున్న వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశం కోసం కాదన్నారు. లేబర్‌కోడ్‌లను కూడా కార్పొరేట్‌ సంస్థల కోసమే కేంద్రం తీసుకొచ్చిందని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థల వల్లనే దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని, అందువల్ల, వాటిని కాపాడుకోవడానికి దీర్ఘకాలిక పోరాటాలు అవసరమని, ఫిబ్రవరి పన్నెండున కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ప్రతినిధుల సభలో మొత్తం 74 మంది డెలిగేట్లు నివేదికపై చర్చలో పాల్గొన్నారు. ఇందులో పది మంది మహిళా కామ్రేడ్స్‌ మాట్లాడారు. చర్చలో పాల్గొన్న కామ్రేడ్స్‌ మనల్ని, మన జీవితాలను ప్రభావితం చేస్తున్న అంతర్జాతీయ సమస్యలను, యుద్ధాల్ని, పాలకుల విధానాలను ప్రస్తావించారు. ప్రతినిధుల సభలో చంద్రశేఖర్‌ బోస్‌, అమానుల్లా ఖాన్‌, వేణుగోపాల్‌ల ప్రసంగాలు చర్చలను మరింత సుసంపన్నం చేశాయి.మహాసభలలో రెండు సెమినార్లు నిర్వహించబడ్డాయి. ”భారతదేశ సమ్మిళిత సాంస్కృతిక వైవిధ్యం ఐక్యత” అంశంపై కువెంపు యూనివర్సిటీ ప్రొఫెసర్‌ రాజేంద్ర చెని, రెండవ సెమినార్‌లో ‘దిగజారుతున్న ప్రజాస్వామ్య విలువలు, మీడియా బాధ్యత’అనే అంశంపై ఫ్రంట్‌ లైన్‌ పత్రిక మాజీ అసోసియేట్‌ ఎడిటర్‌ వి.శ్రీధర్‌ పాల్గొన్నారు. ప్లాటినం జూబిలీ సంవత్సరం సందర్భంగా, ఏఐఐఈఎ నాయకులను మహాసభ ఘనంగా సత్కరించింది.

ఈ కాన్ఫరెన్స్‌లో మొత్తం ఇరవై నాలుగు తీర్మానా లను ఆమోదించారు. ఎఫ్‌డిఐ, ప్రయివేటీ కరణకు వ్యతిరేకంగా ప్రచార ఉద్యమం కొనసాగాలి. ఎల్‌ఐసి తక్షణ రిక్రూట్మెంట్‌ చేపట్టాలి. జనరల్‌ ఇన్సూరెన్స్‌ వేతనసవరణ, 30శాతం ఫ్యామిలీ పెన్షన్‌ అమలు చేయాలి. నాలుగు లేబర్‌-కోడ్స్‌ రద్దు చేయాలి. మహళల, దళితుల, ఆదివాసీలపట్ల రక్షణ చర్యలు చేపట్టాలి. గాజాలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా తీర్మానం, అలాగే యువ నాయకత్వ అభివృద్ధికి ఆల్‌ ఇండియా వర్క్‌షాప్‌ హైదరాబాదులో నిర్వహించడం వంటివి ఉన్నాయి. ఇంకా జూలై ఒకటిన ప్లాటినం జూబ్లి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించాలి. ఏఐఐఈఎ కోసం ఒక గీతం, ఒక ప్రతిజ్ఞ, ఒక వెబ్‌సైట్‌, ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ ఏర్పాటు చేయాలి. ఇలా అనేక అంశాలపై తీర్మా నాలను సభ్యులు ఆమోదించారు. ఐక్యత, పోరాటం, ప్రజలపక్షాన నిలబడడం ఏఐఐఈఎ నిజమైన బలం. భువనేశ్వర్‌లో జరిగిన ఈ మహాసభలు బీమా కార్మిక ఉద్యమానికి దిశానిర్దేశం. ప్రభుత్వ రంగ బీమా సంస్థలరక్షణకు, దేశ ఆర్థిక వ్యవ స్థను కాపాడుకు నేందుకు తీసుకున్న ఒక దృఢ సంకల్పం. దోపిడీ, అసమానత, వివక్షలేని ఒక సమాజం కోసం మనం కంటున్న ఓ కలని సాకారం చేసుకునే దిశగా సాగే ప్రయాణంలో ఓ భాగం. మహాసభ ఇచ్చిన స్ఫూర్తితో, ధైర్యంతో, ఐక్యతతో రాబోయే సవాళ్లను గట్టిగా ఎదుర్కొంటామన్న నమ్మకంతో, జనరల్‌ ఇన్సూరెన్స్‌ ప్రభుత్వరంగ సంస్థల రక్షణ కోసం ప్రచార ఉద్యమాన్ని కొనసాగించాలి. అందుకు ఎఐఐఇఎ సైన్యం ముందుకు సాగాలి.

చిలకలపూడి కళాధర్‌
7382099838

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -