నేటి నుంచి ఐపీఎల్ 19 సీజన్
తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో ఆర్సీబీ ఢీ
క్రికెట్ ప్రియులకు వేసవి వినోదం అందించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చేసింది. నేటి నుంచి ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. ఐపీఎల్ 19 లీగ్ దశలో 70 మ్యాచ్‌లు, ప్లే ఆఫ్స్‌లో 4 మ్యాచ్‌లు ఉంటాయి. మే 31న టైటిల్ పోరు జరుగుతుంది.
నవతెలంగాణ-బెంగళూరు
భారతీయులకు క్రికెట్ ఓ భావోద్వేగం. ఇటీవల విరామం లేకుండా టోర్నమెంట్లు సాగుతున్నా… ఐపీఎల్ కోసం ఎదురుచూసే అభిమాన గణం ప్రత్యేకం. జాతీయ జట్టు తరఫున కనిపించని అభిమాన స్టార్స్‌ను ఐపీఎల్లో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా చూస్తారు. ఐసీసీ టైటిల్ తరహాలోనే ఐపీఎల్ ట్రోఫీకి ఎనలేని క్రేజ్ ఉండటంతో రసవత్తర పోటీతత్వం ఉత్కంఠను రెట్టింపు చేస్తోంది. ప్రాంఛైజీలు, ఆటగాళ్లు సైతం ఐపీఎల్‌ను సవాల్‌గా తీసుకుంటున్నారు. ఐపీఎల్ 2026 నేటి నుంచి ఆరంభం కానుంది. ఆరంభ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగనుండగా.. రాయల్ చాలెంజర్స్, సన్‌రైజర్స్ సమరానికి సై అంటున్నాయి. తొలి మ్యాచ్‌కు స్టేడియం నిండిపోనుండగా.. ఆరంభ వేడుకలకు చిన్నస్వామి ఊగిపోనుంది.
కొత్త చాంపియన్‌ను చూస్తామా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18 సీజన్లు పూర్తి చేసుకున్నా.. ఇంకా తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న ప్రాంఛైజీలు ఉన్నాయి. గత ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చాంపియన్స్ జాబితాలోకి అడుగుపెట్టగా.. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇంకా టైటిల్‌ను ముద్దాడలేదు. చెన్నై సూపర్‌కింగ్స్, ముంబయి ఇండియన్స్‌లు అత్యధికంగా ఐదు సార్లు విజేతలుగా నిలిచాయి. ఈ రెండు జట్లు రికార్డు ఆరో టైటిల్‌పై కన్నేసి బరిలోకి దిగుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరోసారి టైటిల్‌ను అందుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి.
ఆరంభం అదిరేనా?
సీజన్ ఆరంభ మ్యాచ్‌లో అగ్ర జట్లు రాయల్ చాలెంజర్స్, సన్‌రైజర్స్ తలపడనున్నాయి. ఐపీఎల్లో ఈ రెండు జట్ల ‘ఢీ’కి ఓ క్రేజ్ ఉంది. సన్‌రైజర్స్ బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉంది. చిన్నస్వామిలో బౌండరీలు చిన్నవి. దీంతో తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హిట్టర్లు ఆకాశమే హద్దుగా చెలరేగేందుకు చూస్తున్నారు. అభిషేక్ శర్మ, ట్రావిశ్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్‌లకు తోడు ఈ సీజన్లో లివింగ్‌స్టోన్ జత కలిశాడు. దీంతో హైదరాబాద్ బ్యాటింగ్ విధ్వంసం నిలువరించటం ప్రత్యర్థులకు పెను సవాల్‌గా మారనుంది. సన్‌రైజర్స్, రాయల్ చాలెంజర్స్ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుండగా.. ఆరంభ వేడుకలు సాయంత్రం 6 గంటల నుంచి ఉంటాయి.



