దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం చాలా బలహీనపడింది. ప్రజల ప్రాతినిధ్యం అంతకంతకూ నామ మాత్రంగా మారి పోయింది. అధ్యక్ష తరహా పాలనను బీజేపీ కోరుతున్నదంటే అది నియంతృత్వం నెల కొల్పటానికే. దాని రాజకీయ దృక్పథం సమానత్వానికి, సమాన అవకాశాలకు, సామాజిక న్యాయానికి వ్యతిరేకం. అధి కారాన్ని అడ్డం పెట్టుకుని గత పదకొండేం డ్లుగా రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ వస్తున్నది. అందులో భాగమే ఇటీవల కాలంలో దేశ అత్యున్నత న్యాయవ్యవస్థపై మోడీ- ఆయన పరివారం దాడి.
తమిళనాడు శాసనసభ ఆమోదం పొందిన పది బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆమోదించకుండా తన వద్ద ఉంచుకోవటం సరికాదని, మూడునెల్లలోపు ఏ విషయమైనా తేల్చిచెప్పాలని ఏప్రిల్ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది, ఆ బిల్లులను ఆమో దించింది. 415 పేజీల తీర్పులో సమైక్య స్వభావం గల రాజ్యాంగ వ్యవస్థలో రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్లు గరిష్టంగా మూడు నెలల్లోపు ఆమోదించ టమో లేదా తిప్పి పంపిచడమో చేయాలని, అయితే వెనక్కి పంపితే తగిన కారణాలు కూడా చెప్పాలని పేర్కొంది. అంతే కాక గవర్నర్ల వ్యవహార శైలిపై రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించ వచ్చని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. వాస్తవానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగం సమైక్య స్వభావాన్ని , రాష్ట్రాల హక్కులను పరిరక్షిస్తూ తీర్పు ఇచ్చింది. గవర్నర్ చేసిన తప్పులను సరిచేసింది. గవర్నర్లు రాజ్యాంగ సహకార సమైక్య వ్యవస్థను పరిరక్షిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేయాలి అలాకాకుండా మొదటి నుండి కేంద్రం చేతుల్లో కీలుబొమ్మగా మారి రాష్ట్రాల్లో వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయకుండా అడుగడుగునా అడ్డుకోవడం చేస్తున్నారు.1967 తర్వాత అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు అధికారంలోకి రావడంతో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలు, వనరుల మధ్య తరచూ వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా 1983 తర్వాత అనేక రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడడంతో వివాదాలు మరింత ముదిరాయి. దీంతో కేంద్ర రాష్ట్ర సంబంధాలు పరిశీలించి, మంచి సలహాలు, సమ న్వయం కోసం 1970లో తమిళనాడు ప్రభుత్వం రాజమన్నార్ కమిషన్ వేసింది.1973లో పంజాబ్‌లో అకాళీదళ్ ప్రభుత్వం 1973లో ఆనందపుర సాహెబ్ తీర్మానం చేసింది. ఇందిరాగాంధీ 1983లో సర్కారియా కమిషన్, తర్వాత వాజ్‌పేయి ఫూంచ్ కమిషన్లు వేశారు. ఈ కమిషన్లు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలు, ఆదాయ వనరుల పంపిణీపై మంచి సలహాలు, సూచనలిచ్చాయి. కానీ ఇవన్నీ బుట్ట దాఖలయ్యాయి. రాష్ట్రాల్లో గవర్నర్ల మితిమీరిన జోక్యం ఎక్కువైంది. రాష్ట్రపతి పాలన విధించే నిబంధన 356 దుర్విని యోగమైంది. ఉమ్మడి ఏపీలో అప్పటి గవర్నర్ రామ్‌లాల్ ప్రజాస్వామికంగా ఎన్నికైన ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని రద్దుచేసి, నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా నియ మించారు. అలాగే 1994లో కర్నాటకలో బొమ్మరు ప్రభు త్వాన్ని గవర్నర్ సిఫార్సులతో రాష్ట్రపతి పాలన విధించారు.ఈ పరిణామాలను న్యాయస్థానాలు ఆక్షేపించాయి. గవర్నర్లు రాజ్యాంగబద్ధ అధికారాలను అపహస్యం చేయరాదని ,రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా రాజ్యాంగ ప్రజాస్వామిక విలువలు కాపా డాలని హితవు పలికాయి.
ఇక ప్రస్తుత విషయానికొస్తే తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి బిల్లులు అట్టిపెట్టుకోవడంపై కోర్టు తీర్పు వెలువడగానే ఉప రాష్ట్రపతి ధన్కర్ ”న్యాయవ్యవస్థ కంటే చట్టసభలే ఎక్కువ అని, రాష్ట్రపతి నిర్ణయాలను కోర్టులు అక్షేపించటం సరికాదని” సుప్రీం కోర్టు తీర్పుపై ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మునిబంధన 142 ప్రకారం పద్నాలుగు అంశాలతో సర్వోన్నత న్యాయస్థానాన్ని ప్రశ్నింంచారు. ఇదంతా కేంద్రంలోని బీజేపీ సర్కార్ కనుసన్నల్లోనే జరిగిందనేది వాస్తవం! మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజాస్వామ్య మూలస్తంభాలైన చట్టసభలు, కార్యనిర్వాహకవర్గం, చివరకు న్యాయ వ్యవస్థను కూడా తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టుకే సవాల్ విసరటం, సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయాలను ప్రశ్నించడం ముమ్మాటికి సరైనది కాదు. రాష్ట్రపతి ప్రశ్నలపై పరోక్షంగనైనా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవారు స్పందించారు. ”మన ప్రజాస్వామ్య దేశంలో ఏ వ్యవస్థ గొప్పది కాదని… భారత రాజ్యాంగం మాత్రమే సర్వోన్నతమైనదని, ప్రజాస్వామ్యంలో కీలక స్తంభాలైన శాసన, కార్యనిర్వాహక ,న్యాయ వ్యవస్థలు మూడు సమానమే”నని అన్నారు. ఈమూడు పరస్పరం గౌరవించు కోవాలని స్పష్టం చేశారు. చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందని అయితే అవి రాజ్యాంగ పరిధిలో ఉండాలని, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని, రాజ్యాంగమే అత్యున్నతమైనదని తేల్చిచెప్పారు. ఈ విషయం 1973లో కేశవనంద భారతి కేసులో పదమూడు మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం కూడా ఇదే స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా కూడా పలు వేది కలపై ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ న్యాయమూర్తుల మాటలు ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం సడలకుండా చేశాయనడంలో సందేహం లేదు.
ఇక రాష్ట్రపతి లేవనెత్తిన ప్రశ్నలకు న్యాయమూర్తులు తీర్పులోనే సమాధానమిచ్చారు. 2016లో రాష్ట్రపతికి బిల్లుల ఆమోదంపై మూడు నెలల కాల పరిమితి విధిస్తూ హోం వ్యవ హారాల శాఖ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ( మెమోరాండం) అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి మూడు నెలల్లోగా ఆమోదించాలనే గడువు ప్రకారం తీర్పు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే ఈ తీర్పు భారత రాజ్యాంగాన్ని, సమైక్య స్ఫూర్తిని , రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాపాడిందని, ఇది ఎంతో ఆదర్శవంతమైన తీర్పు అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తిరుపతిలో ఇటీవల పాల్గొన్న ఓ కార్యక్రమంలో ప్రశంసించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాదని న్యాయవ్యవస్థ పైనే రాష్ట్రపతి ప్రశ్నలు సంధిస్తున్న పరిస్థితులు నేడు దేశంలో ఉన్నాయని ఆయన బాధపడ్డారు. రూపంలో ఆది నుండి భారతదేశం ప్రజాస్వామికం కానీ, సారంలో నియంతృత్వంగా ఉంది. మరి ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి రాజ్యాంగంపైనే దాడి మొదలు పట్టింది. ఈ పార్టీ మాతృ సంస్థ ఆరెస్సెస్ రాజ్యాంగాన్ని అంగీకరించదు. సనాతన ధర్మం, మనస్మృతి వీరికి శిరోధార్యం. రాజ్యాంగ ఆశయాలు, విలు వలకు కాషాయ నేతలు కట్టుబడరు. మన రాజ్యాంగ ఆశయాలు, విలువలు ప్రజలకు అందకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే ప్రకటించారు.”1950 జనవరి 26 మనం వైరుధ్యాల్లోకి ప్రవేశిస్తున్నాం.రాజకీయాల్లో సమానత్వం కానీ సామాజిక, ఆర్థిక రంగాల్లో అసమానత్వం ఉన్నాయి. ఈ వైరుధ్యాన్ని మనం పరిష్కరించకపోతే అసమానత్వంతో బాధ పడుతున్న ప్రజలు ఈవ్యవస్థలను బద్దలు కొడతారు” అని అన్నారు. ఏమైనా బలమైన సామాజిక ఉద్యమాల ద్వారానే రాజ్యాంగ ఆశయాలు, విలువలు, హక్కులు రక్షించబడతాయి.
షేక్ కరిముల్లా
9705450705
ప్రమాదంలో న్యాయవ్యవస్థ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES