హెచ్‌సీఏతో కలిసి విశాఖ ఇండిస్టీస్ నిర్వహణ
జెర్సీలు ఆవిష్కరించి, షెడ్యూల్ ప్రకటించిన మంత్రి వివేక్
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి జనవరి 17 వరకు కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్ నిర్వహిస్తున్నట్టు విశాక ఇండిస్టీస్ చైర్మన్, రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖల మంత్రి జి. వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. రెండు దశల్లో జరిగే ఈ లీగ్ ద్వారా మండల, టౌన్, జిల్లా స్థాయిల్లో ఔత్సాహిక క్రికెటర్లు తమ టాలెంట్ నిరూపించుకోనున్నారు. మొదటి దశలో పాల్గొనే ఎనిమిది జోన్స్ (ఉమ్మడి జిల్లాల) జట్ల జెర్సీలను మంత్రి వివేక్ ఆవిష్కరించారు. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్లు, జిల్లా సంఘాల సెక్రటరీలతో కలిసి టోర్నీ షెడ్యూల్, వివరాలను వెల్లడించారు.
తొలి దశలో 29 జట్లను (కొత్త జిల్లాల) 8 జోన్లుగా (ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్) విభజించి రౌండ్ రాబిన్, ఫైనల్ ఫార్మాట్‌లో పోటీలు నిర్వహిస్తారు. జోనల్ చాంపియన్‌గా (ఉమ్మడి జిల్లా) నిలిచిన ఎనిమిది జట్లు రెండో దశకు అర్హత సాధిస్తాయి. ఈనెల 29 నుంచి జనవరి 17 వరకు జరిగే రెండో దశలో ఉమ్మడి 8 జిల్లాల జట్లకు తోడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో 10 టీమ్స్‌తో 49 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. టోర్నీలో ఓవరాల్ విన్నర్‌గా నిలిచే జట్టుకు రూ. 5 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వనుంది. రన్నరప్ టీమ్ రూ. 3 లక్షలు దక్కించుకోనుండగా.. మూడో స్థానానికి రూ. 2 లక్షలు, నాలుగో స్థానికి రూ. 1 లక్ష నగదు లభిస్తుంది.



