Each tribe like a continent. But we never tried to know, never tried to respect them – Mahaswetha Devi.
ఉప సమూహాలు మాట్లాడతాయా? అన్న ప్రశ్న వేసుకొని, వాళ్ళకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తే మాట్లాడతారని గాయత్రి చక్రవర్తి స్పివక్ అంటారు. శిష్ట వర్గంలో వలస పాలకులు, దేశీయ భూస్వాములు, పారిశ్రామిక వేత్తలు, పెద్ద వ్యాపారస్తులు, ఉన్నత అధికారులు ఉంటారు. ఈ వర్గానికి చెందనివారంతా ఉపశ్రేణులేనని, ప్రముఖ చరిత్రకారుడు రంజిత్ గుహ నిర్వచించినాడు. సమాజంలో అట్టడుగున ఉన్నవారు తమ ఆశలు, ఆకాంక్షలు, గుర్తింపు గురించిన సంవాదాన్ని నిర్మించుకోలేరు. ఒకవేళ నిర్మించుకున్న, అధి అధికారిక భావజాలంలో భాగం కాదు. సంస్థాగత ఆమోదం పొందిన జ్ఞానమే అధికారిక జ్ఞానంగా గుర్తింపు పొందుతుంది. శిష్టులు కింది వాళ్ళ జ్ఞానాన్ని జ్ఞానంగా అంగీకరించరు. తరతరాలుగా జ్ఞాన ఉత్పత్తి, ప్రసరణ, ఆమోదనీయతను ఉన్నత వర్గం తమ గుత్తాధిపత్యంగా చేసుకుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ముందుకు వచ్చిన ఆదివాసి (కోయ) బిడ్డ కుంజ కళ్యాణి. చిన్ననాడే తండ్రి చదువు మాన్పించే ప్రయత్నం చేసినా, ఆమె మానుకోలేదు.
”ఇప్ప పూలు ఏరుకున్నట్టు, అక్షరాలను ఏరుకొని సంక సంచిలో వేసుకుంది”. ఉన్నత విద్యావంతురాలు అయింది. 2008లో జరిగిన ఆదివాసి ‘సింగిడి’ వేదిక మీద తన స్వీయకవిత ‘కొత్త తోగు’ చదివింది. ఇప్పుడు ‘కంకపొద’ కవితా సంపుటితో మన ముందుకు వచ్చింది. ఈ సంపుటిలో 65 కవితలు ఉన్నాయి. రచనా కాలం 2008-2019. పెట్టుబడిదారి పూర్వథలోని కోయగూడెం పరిస్థితిని ఈ కవిత్వంలో చిత్రీకరించింది కవయిత్రి. పారిశ్రామిక ఉత్పత్తులు గ్రామాలు, గూడాలు చేరని కాలం. హైబ్రిడ్ విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగు మందులు గూడెంలో చేరి, వ్యవసాయ యంత్రీకరణ జరగని కాలం. ఉప్పు, బెల్లం లాంటి కొన్ని వస్తువులు తప్ప మార్కెట్ మీద ఆధారపడని కాలం. ఒక రకంగా కవయిత్రి బాల్య జీవితం. అది ఆమె అనుభవించిన జీవితం. ఆమె స్మతిపథంలో భాగమైన జీవితం. ఆ గూడెం జీవితం ‘కంకపొద’లో కవిత్వంగా రూపుదిద్దుకుంది. అడవులను కాల్చి ఆ భూమిలో వ్యవసాయం చేస్తారు. ఆ భూమి నిస్సారం అయినంక వేరే చోటికి మారుతారు. అక్కడ అడవిని కాల్చి వ్యవసాయం చేస్తారు. ఈ విధంగా నిరంతరం స్థల మార్పిడి జరిగేది పోడు వ్యవసాయం. ఈ అంశాన్ని ‘సాగు’ కవిత వివరిస్తుంది.
”అడవి పక్కన ఆరెకరపు భూమిల/ బతుకు పోడు సాగు చేస్తున్న/ …./ ఒర్రె పొంటి ఒదిగొచ్చే నీళ్ళని/ అడ్డ కట్టేసి తడులు తడులుగా/ పావురంగా తాపిచ్చిన/ పచ్చగా నవ్విన/ ప్రకతిల పసిడి పండిత్తాన్న” ఇది పూర్తిగా వర్షాధార పంట. ఆదివాసీలు సంవత్సరంలో ఒక్క పంటనే తీస్తరు. ఆరు తడి పంటలు మాత్రమే పండిస్తరు. అడవిలో దొరికిన వస్తువులను మాత్రమే ఉపయోగించి వ్యవసాయ పనిముట్లను తయారు చేస్తారు. కంక బద్దలు, గోగు నారతోని గూడను చేస్తారు. అది పంటలకు నీళ్ళు ఎత్తిపోసే ఒక సాధనం. ‘గూడ’ కవిత అదే విషయాన్ని వివరిస్తుంది. ”చిక్కగా అల్లిన కంక గూడ దెచ్చి/ గోగు నార పురితాడ్లు గోడగా గట్టి/ ఇటు రెండు అటు రెండు సిల్లలు తగిలిచ్చి/ చేతులు మండంగ చేండ్లకి నీల్లిచ్చి” అని అభివ్యక్తీకరించారు. అడవికి వసంతం వచ్చినపుడు, చెట్లు పాత ఆకులను రాల్చి, కొత్త చిగురులను తొడుగుతాయి.
”పాత చీరలొదిలిన ప్రకతోలె/ ఆకులు సాలిచ్చిన ఇప్ప/ కొత్త చీరలు కట్టుకున్నట్లు/ చిరునగవుల చిగురు తొడిగి/ కోలాహలంగా కోలేసి/ నవ్వుతుంటది నన్ను చూసి” ఇప్పపువ్వు రసగుల్ల మాదిరిగా లేత పసుపు పచ్చ రంగులో కండ కలిగి ఉంటుంది. అది తెల్లవారే జామున రాలుతుంది. కమ్మటి వాసన వెదజల్లుతుంది. ఆ పువ్వు రాలే సమయం ఆదివాసులకు తెలుసు. ఆ సమయంలోనే వాళ్ళు గంపలు పట్టుకుని పువ్వు ఏరడానికి పోతరు. ”చందమామ కిందికొంగి పోతాంటే/ కాళ్ళు లేచి నడుస్తరు తన వంక” ఇప్పపూల కోసం వచ్చిన ఎలుగుబంట్లతోని పువ్వు లేరేవారికి కొట్లాట జరుగుతుంది. వాటి దాడిలో చనిపోయే వారుంటారు. చెట్టు కింద రాలిన ఆకులో తేళ్ళు ఉంటాయి. ”తీపి రుసి జూడవచ్చి తేళ్ళు మా మునివేళ్ళని,/ ముద్దాడిన సమయాలెన్నో”.
”కంక పాల తెలుపు కపటం లేని నవ్వు/ పసిపాప రోగాలు పాయదీయు/ కంక బియ్యమొచ్చి కరువు దీర్చినట్టు/ ఆదుకొనగ అడవి ఆప్తురాలు” వెదురు బియ్యాన్ని అన్నం వండుకుని తింటారు.
కంక పొద ఆదివాసుల సామూహిక జీవితానికి చిహ్నం. కరువు వచ్చినపుడు అడవిలో దొరికిన విషపు గడ్డలనైనా వాటి విషాన్ని పోగొట్టి తింటరు. ఆదివాసి జీవితంలో సామూహికత ఉంటుంది. కష్టమైనా సుఖమైనా కలిసి పంచుకుంటరు. ఈ వాస్తవాన్ని ‘అడవి మొలక’ కవిత చాటుతుంది. ”చావో రేవో ఆడాడనే/ రేవో తావో జట్టుగానే/ గడ్డ కాయలు తిన్నా గటక తిన్నా/ కలో గంజో కలిసే బతుకు/ …/ ఒక్కరు చేసిన ఊరంతటికీ పలారమే” ఆదివాసి గూడాలు ఆధునిక అభివద్ధిలో ఏవిధంగా విస్థాపనకు గురి అవుతున్నాయో కవయిత్రి చక్కగా కవిత్వీకరించింది. ‘ఆదివాసి’ కవితలో… ”కంక పిడాల్ని మాయం చేసినంత సులువుగా/ ప్రాజెక్టుల పేర నా జాతినంతా/ మాయం జేయ జూస్తున్నరు” అంటుంది. పోలవరం ప్రాజెక్టులో అనేక గిరిజన గ్రామాలు మునుగుతున్నయి. పరిహారం ఇచ్చి పంపినా వాళ్ళకు కొత్త ప్రాంతంలో ఉపాధి దొరకదు. భూమి దొరకదు, పనులు దొరకవు. సకలం కోల్పోయిన గ్రామాలను ‘బతుకు బీడు” కవిత చిత్రించింది.
ఖనిజాల కోసం అడవులను ఖాళీ చేయించి, వాటిని వెలికి తీయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. చెంచు పెంటల్లో యురేనియం తవ్వకం కోసం వారిని అడవుల నుండి ఖాళీ చేయిస్తున్నారు. ”గింజ మొలవని విత్తనాలు/ దిగులు మబ్బులు మొలిపిస్తుంటే/ కాయ పగలని పత్తి చేండ్లో/ తలలు పగిలి రక్తపు పూలు పూస్తాయి” ఈ సంపుటిలో స్త్రీవాదిగా కవయిత్రి రాసిన కవితలు ఉన్నాయి. స్త్రీ గర్భం ధరించి బిడ్డకు జన్మ ఇచ్చేవరకు తన శరీరంలో జరిగే మార్పులను ‘పచ్చిపుండు సలుపు’ కవిత ప్రతిభావంతంగా చిత్రీకరించింది. మగవాన్ని సంబోధిస్తూ నడిచే ఈ కవితలో… ”పొత్తిలి పొదలో పొదిగి/ తిత్తిలో పానం పోసుకుంటుంది/ నీతో సహా ప్రతి ప్రాణి” స్త్రీ పురుష సంబంధాల్లోని యాంత్రికతను ‘సజీవ దహనం’ కవిత వివరిస్తుంది.
”నీకు మొహం పుట్టినపుడు/ నేనొక భోగ వస్తువునై ప్రతీపూట/ నిర్జీవమైన శవాన్నై నీ పడక చేరుతూ” అంటుంది. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారి, మానవ విలువలు పూర్తిగా లుప్తమైపోయిన వైనాన్ని ‘మసక బారిన అద్దం’ కవిత వివరిస్తుంది. ”నిన్నటిదాకా నాతో నా అంత స్వచ్ఛంగా/ కలివిడిగా కలిసి తిరిగిన అడుగులు/ స్వార్థపు పంచన మంచమేసుకునీ/ కాపు కాస్తున్న వైనం” ఈ విధంగా వస్తు వైవిధ్యం, భావుకత, అభివ్యక్తి, భాష అన్నీ కవయిత్రికి పరిచయమున్న ఆదివాసీ జీవితం నుండి తీసుకుని మంచి కావ్యాన్ని రాసింది. ముందు ముందు ఆదివాసీ జీవితాలను చిత్రించే ఇంకా ఎన్నో సంపుటులు ఈ కవయిత్రి నుండి ఆశించవచ్చు.
- కందుకూరి అంజయ్య, 9490222201



