Monday, March 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమేడిగడ్డ వినాశనానికి కేసీఆర్‌ సర్కార్‌దే బాధ్యత

మేడిగడ్డ వినాశనానికి కేసీఆర్‌ సర్కార్‌దే బాధ్యత

- Advertisement -

– రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టాలి
– వర్షాకాలం పంటలకు నీరందించాలి!
– దోషులైన అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి : రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ప్రతినిధుల బృందం
నవతెలంగాణ-మహదేవపూర్‌

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ విధ్వంసంపై రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ప్రతినిధుల బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మేడిగడ్డ వినాశనానికి గత కేసీఆర్‌ సర్కార్‌దే బాధ్యత అని, సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి, వర్షాకాలం పంటలకు నీరందించాలని, దోషులైన అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఆదివారం జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ(లక్ష్మి), అన్నారం(సరస్వతి), పార్వతి (సుందిళ్ళ) బ్యారేజీతో పాటు నందిమేడారం పంపింగ్‌ హౌస్‌ను సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బంధు సాయిలు ఆధ్వర్యంలో సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌, ఉపాధ్యక్షుడు నున్నా నాగేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు తదితర ప్రతినిధి బృందం క్షేత్రస్థాయిలో సందర్శించింది. అక్కడ కుంగిపోయిన పిల్లర్లు, దెబ్బతిన్న గేట్లను పరిశీలించింది. అనంతరం బృందం నాయకులు మాట్లాడుతూ.. సుమారు రూ.90 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు ప్రజా ధనాన్ని వెచ్చించిన ఈ ప్రాజెక్టులో జరిగిన నష్టం అత్యంత ఆందోళనకరమని వాపోయారు. కేవలం కమీషన్లు, ప్రచారం కోసం శాస్త్రీయత లేకుండా పనులు చేయించడం వల్లే నేడు మేడిగడ్డ బ్యారేజీలో 19 నుంచి 22 వరకు ఉన్న గేట్ల ప్రాంతం కుంగిపోయిందని తెలిపారు. లక్ష కోట్లు పోసి నిర్మించిన ప్రాజెక్టు కేవలం ప్రచారానికే పరిమితమైందా అని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, నాణ్యతా లోపాలపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టు సంస్థలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాధనాన్ని బూడిదలో పోసిన వారి ఆస్తులను జప్తు చేసి, ఆ నిధులతోనే జరిగిన నష్టాన్ని పూడ్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఈ సమస్యను కేవలం గత ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేసేందుకే పరిమితం చేయకూడదని అన్నారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి, నిపుణుల కమిటీ సూచనల మేరకు వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని కోరారు. వచ్చే వర్షాకాలంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, పంటలకు సకాలంలో నీరు అందించేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులతో పాటు దానిపై ఆధారపడ్డ లక్షలాది మంది వ్యవసాయ కూలీలు, కార్మికుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, రైతులకు సాగునీటి భరోసా ఇవ్వకపోతే రైతు, కూలీ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -