Thursday, February 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్వేషాన్ని రగిల్చే 'ది కేరళ స్టోరీ-2'ను అడ్డుకోవాలి

విద్వేషాన్ని రగిల్చే ‘ది కేరళ స్టోరీ-2’ను అడ్డుకోవాలి

- Advertisement -

– సమాజంలో చిచ్చుపెట్టేందుకే ఇలాంటి చిత్రాలు : ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు
– రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
నవతెలంగాణ-సిటీబ్యూరో

కేరళ రాష్ట్రంపై కల్పిత గాథలతో, సమాజంలో విద్వేషాన్ని నింపేలా రూపొందించిన ‘ది కేరళ స్టోరీ-2’ సినిమా ప్రదర్శనను తక్షణమే నిలిపివేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీలు డిమాండ్‌ చేశాయి. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ సినిమాను వ్యతిరేకిస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.రజనీకాంత్‌, టి.నాగరాజు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్‌, ఆనగంటి వెంకటేష్‌ మాట్లాడారు. వాస్తవాలకు దూరంగా, ఒక వర్గాన్ని కించపరిచేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉన్న మన దేశంలో మతపరమైన వైషమ్యాలు పెంచి, యువతలో విషబీజాలు నాటే కుట్రలు జరుగుతు న్నాయని తెలిపారు. కేరళ అంటే అన్ని రంగాలు, అన్ని వర్గాల అభివృద్ధి.. అలాంటి రాష్ట్రంపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలు చేస్తున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఇటువంటి ప్రయత్నాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

రాజ్యాంగ విలువలపై దాడి
కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు మాట్లాడుతూ.. దళితులు, అణగారిన వర్గాల ఐక్యతను దెబ్బతీసేందుకు సాంస్కృతిక దాడులు చేస్తున్నారని, కులమతాల పేరుతో రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తున్నారని విమర్శించారు. గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీరాం నాయక్‌ మాట్లాడుతూ.. అబద్ధపు ప్రచారాలతో గిరిజన ప్రాంతాల్లోనూ గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు.
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.శోభన్‌ మాట్లాడుతూ.. దేశంలో నిరుద్యోగం, ఆకలి వంటి తీవ్రమైన సమస్యల నుంచి, రైతుల పోరాటాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే పాలకుల అండతో ఇలాంటి వివాదాస్పద చిత్రాలు వస్తున్నా యని విమర్శించారు. కేరళ వంటి అభ్యుదయ రాష్ట్రంపై బురద చల్లడాన్ని తీవ్రంగా ఖండించారు.

ఐక్య పోరాటాలకు పిలుపు
ఈ చిత్రాన్ని సెన్సార్‌ బోర్డు తక్షణమే నియంత్రించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విద్వేష, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని, కేరళపై జరుగుతున్న ఈ విషప్రచారాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు మహేష్‌, కార్యదర్శి నాగరాజు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.ధర్మేంద్ర, పీవైఎల్‌ రాష్ట్ర కార్యదర్శి పెద్దింటి రామకృష్ణ, పీడీఎస్‌యూ(విజృంభణ) రాష్ట్ర నాయకులు పవన్‌ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ హైదరాబాద్‌ జిల్లా నేతలు లెనిన్‌ గువేరా, అశోక్‌ రెడ్డి, ఎండీ జావేద్‌, టీపీటీఎల్‌ఎఫ్‌ నేత కొమ్ము విజరు, జునుగరి రమేష్‌, పీవైఎల్‌ హైదరాబాద్‌ జిల్లా నాయకులు రవికుమార్‌, కృష్ణ, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.శ్రీకాంత్‌, ఏఐఎస్‌ఎఫ్‌ హైదరాబాద్‌ జిల్లా నాయకులు వంశీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -