నచ్చిన వారికి ఉద్యోగాలు
రూల్స్‌కు విరుద్ధంగా డిప్యూటేషన్లు
ఫంక్షన్‌హాల్‌గా ఎల్బీ స్టేడియం
తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్)లో అంతా ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఉద్యోగుల నియామకం, నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్లు కొనసాగిస్తున్నాయి. తమ పర్యవేక్షణలోని క్రీడా మైదానాల నిర్వహణను సైతం శాట్జ్ గాలికొదిలేసింది. సీఎం రేవంత్ రెడ్డి క్రీడలకు పెద్దపీట వేస్తూ భారీగా బడ్జెట్ కేటాయింపులు చేయటంతో హంగూ ఆర్బాటంతో కూడిన సమావేశాలకు పరిమితం అవుతున్న శాట్జ్.. క్రీడాభివృద్దిని పూర్తిగా విస్మరించింది.
నవతెలంగాణ-హైదరాబాద్ :
నచ్చినవారికి ఉద్యోగం!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు దాటినా.. క్రీడా ప్రాధికార సంస్థలో ఇప్పటివరకు ఒక్క కోచ్ నియామకం కూడా జరుగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్టు పద్దతిలో ఎంపికైన వారు, పొరుగు సేవల ద్వారా పని చేస్తున్న కోచ్‌లు మాత్రమే శాట్జ్‌లో ఉన్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు జరుగలేదు. శాట్జ్ రూల్స్ ప్రకారం స్థానికేతరులు కోచ్‌లుగా పనిచేసేందుకు అనర్హులు. నిబంధనలను తుంగలో తొక్కుతూ దొడ్డిదారిన తెలంగాణేతరులను కోచ్‌లుగా నియమించినా ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. రూల్స్‌కు విరుద్ధంగా ఎందుకు నియమించారనే అంశంపై వివరణ ఇచ్చేందుకు సైతం అధికారులు సిద్ధంగా లేరు.
తాజాగా ఎల్‌బి స్టేడియంలో కాంట్రాక్టు పద్ధతిలో హ్యాండ్‌బాల్ సహాయ కోచ్‌ను నియమించారు. శాట్జ్‌లో సహాయ కోచ్ పోస్టు లేదని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఓ ప్రశ్నకు అధికారులు సమాధానం ఇచ్చారు. కానీ ఎల్‌బి స్టేడియంలో హ్యాండ్‌బాల్ సహాయ కోచ్‌కు ప్రతి నెలా వేతనం అందిస్తున్నారు. ఓ వైపు అసిస్టెంట్ కోచ్ పోస్టు లేదంటూనే.. మరోవైపు వేతనం చెల్లిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. అర్హులైన క్రీడాకారులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే.. నోటిఫికేషన్, సెలక్షన్ ప్రక్రియను పక్కనపెట్టి నచ్చినవారికి దొడ్డిదారిన కోచ్ ఉద్యోగాలు కట్టబెడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.
డిప్యూటేషన్లు ముగిసినా..
క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్)లో రెగ్యులర్ ఉద్యోగులు లేకపోవటంతో సంస్థ రోజువారీ వ్యవహారాల పర్యవేక్షణకు సైతం ఇతర విభాగాల నుంచి డిప్యూటేషన్లపైనే ఆధారపడాల్సిన దుస్థితి. ఇందులో భాగంగా సహకార శాఖ నుంచి వచ్చిన ఓ అధికారి శాట్జ్‌లో ఐదేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. డిప్యూటేషన్ రూల్స్ ప్రకారం ఐదేండ్లకు మించి పని చేయడానికి లేదు. అయినా, ఇప్పటివరకు ఆ అధికారి శాట్జ్‌లోనే విధులు నిర్వహిస్తున్నారు. ఆ సహకార శాఖ ఉద్యోగి డిప్యూటేషన్‌ను పొడగించాలని ఏకంగా శాట్జ్ నుంచే సిఫారసు దస్త్రం వెళ్లింది. శాట్జ్ కీలక పరిపాలన పోస్టుల్లో ఉన్నవారు ఎక్కువ మంది సహకార శాఖ నుంచి వచ్చినవారే ఉన్నారు.
ఫతే ఫంక్షన్‌హాల్!
క్రీడలకు రూ.465 కోట్ల భారీ బడ్జెట్ కేటాయింపులు జరిగినా.. ఎల్బీ స్టేడియం ఆటలకు కాకుండా విందు, వినోద కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోంది. గతంలో క్రీడలకు అరకొర కేటాయింపులే ఉండేవి. దీంతో మైదానాల నిర్వహణ, సిబ్బంది వేతనాల కోసం మైదానాలను పలు నిబంధనలతో క్రీడేతర కార్యక్రమాలకు అద్దెకు ఇచ్చేందుకు అనుమతి ఇస్తూ జీవో ఇచ్చారు. ఇప్పుడు క్రీడాశాఖకు భారీ బడ్జెట్ ఉంది. అయినా, ఫతే మైదాన్‌ను ఆటల కేంద్రంగా చేసేందుకు శాట్జ్ ఆసక్తి చూపించటం లేదు. జానపద పాటల కచేరికి స్టేడియంను అద్దెకు ఇవ్వగా తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా, శాట్జ్ అధికారుల్లో మార్పు రాలేదు. తాజాగా ఓ సినిమా ఈవెంట్‌కు ఎల్బీ స్టేడియాన్ని అద్దెకు ఇచ్చారు. దీంతో మరోసారి ఎల్బీ స్టేడియం గతుకుల మయంగా మారగా.. క్రికెట్, ఫుట్‌బాల్ సాధన ఇప్పట్లో సాధ్యపడేలా లేదు. క్రీడాశాఖ మంత్రి, శాట్జ్ చైర్మెన్ ఇకనైనా ఎల్బీ స్టేడియాన్ని స్పోర్ట్స్ సెంటర్‌గా మలిచేందుకు దృష్టి సారించాలని క్రీడాకారులు, క్రీడాభిమానులు కోరుతున్నారు.