భారీగా పెరిగిన సిలిండర్ ధరలు
మండల ప్రజలపై 4.80 లక్షల వరకు భారం
నవతెలంగాణ – మల్హర్ రావు
సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. గృహ వినియోగదారులపై ఏకంగా రూ.60, కమర్షియల్ రూ.115 పెంచింది. దీంతో శనివారం నుంచి కొత్త ధరలకే గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నారు. ఇప్పటికే బియ్యం, నూనె, ఉప్పు, పప్పులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా పెరిగిన గ్యాస్ మరింత భారం కానుంది. ప్రతినెలా మండల ప్రజలపై రూ.4.80 లక్షల వరకు భారం పడనుంది.
మండలంలో మొత్తం 8,013 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తాడిచెర్ల శుశ్రుత గ్యాస్ ఏజెన్సీ ద్వారా సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ప్రతినెలా సగటున వెయ్యి వరకు సిలిండర్ల వినియోగం అవుతున్నట్లు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. పాత ధర రూ.928, కొత్త ధర రూ.988.50.పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఆర్థిక భారం కానున్నాయి. ఇప్పటికే చాలామంది లబ్ధిదారులకు మహాలక్ష్మి పథకం కింద రూ.500 కూడా రావడంలేదు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొనడమే ధరలు పెరుగుదలకు కారణమని తెలుస్తోంది.



