Monday, January 19, 2026
E-PAPER
Homeఆటలుకివీస్‌ కొల్లగొట్టింది

కివీస్‌ కొల్లగొట్టింది

- Advertisement -

భారత్‌లో చారిత్రక వన్డే సిరీస్‌ విజయం
ఆఖరు వన్డేలో 41 పరుగులతో గెలుపు
ఛేదనలో కోహ్లి శతక పోరాటం వృథా

కివీస్‌ కొత్త చరిత్ర సృష్టించింది. భారత్‌లో ఇప్పటివరకు 16 సార్లు పర్యటించినా.. ఒక్కసారీ వన్డే సిరీస్‌ విజయం అందుకోని న్యూజిలాండ్‌.. ఇండోర్‌లో చరిత్ర తిరగరాసింది. 2024లో టెస్టు సిరీస్‌ను 3-0 క్వీన్‌స్వీప్‌తో భారత్‌లో చారిత్రక విజయం అందుకున్న కివీస్‌.. తాజాగా వన్డేల్లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేసింది. 2-1తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. క్రికెట్‌ చరిత్రలో భారత్‌లో ఓ వన్డే సిరీస్‌ విజయం సాధించటం కివీస్‌కు ఇదే ప్రథమం.

338 పరుగుల ఛేదనలో విరాట్‌ కోహ్లి (124) శతకంతో చెలరేగినా.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (53), హర్షిత్‌ రానా (52) మెరిసినా ఆతిథ్య భారత్‌కు గర్వభంగం తప్పలేదు. కివీస్‌ పేసర్లు, స్పిన్నర్లు సమిష్టిగా రాణించారు. భారత్‌ను 46 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌట్‌ చేశారు. 41 పరుగుల తేడాతో కివీస్‌ గెలుపొందింది.

నవతెలంగాణ-ఇండోర్‌
సొంతగడ్డపై భారత్‌కు గర్వభంగం. కుర్ర జట్టుతో భారత్‌కు వచ్చిన న్యూజిలాండ్‌.. అత్యంత బలమైన భారత్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. ఇండోర్‌ వన్డేలో 41 పరుగుల తేడాతో గెలుపొంది వన్డే సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. క్రికెట్‌ చరిత్రలో భారత్‌లో 16 సార్లు పర్యటించినా వన్డే సిరీస్‌ విజయం సాధించని న్యూజిలాండ్‌… 17వ ప్రయత్నంలో ద్వితీయ శ్రేణి జట్టుతో చరిత్రను తిరగరాసింది. 338 పరుగుల ఛేదనలో భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ (11), శుభ్‌మన్‌ గిల్‌ (23) సహా శ్రేయస్‌ అయ్యర్‌ (3), కెఎల్‌ రాహుల్‌ (1) విఫలమయ్యారు. టాప్‌-5 బ్యాటర్లలో నలుగురు తేలిపోవటంతో ఛేదన భారం విరాట్‌ కోహ్లి (124, 108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు)పై పడింది.

నితీశ్‌ కుమార్‌ రెడ్డి (53, 57 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్షిత్‌ రానా (52, 43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) జతగా విరాట్‌ కోహ్లి ఆఖరు వరకు పోరాడినా.. టీమ్‌ ఇండియాకు ఓటమి తప్పలేదు. 46 ఓవర్లలో 296 పరుగులకు భారత్‌ ఆలౌట్‌ కాగా.. మరో 24 బంతులు ఉండగానే న్యూజిలాండ్‌ 41 పరుగుల తేడాతో గెలుపొందింది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 337 పరుగులు చేసింది. డార్లీ మిచెల్‌ (137, 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లు), గ్లెన్‌ ఫిలిప్స్‌ (106, 88 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలతో కదం తొక్కారు. కివీస్‌ బ్యాటర్‌ డార్లీ మిచెల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’తో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును దక్కించుకున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్‌ నుంచి వన్డే సిరీస్‌ ట్రోఫీని కివీస్‌ కెప్టెన్‌ బ్రాస్‌వెల్‌ అందుకున్నాడు.

కోహ్లి పోరాడినా..
ఛేదనలో విరాట్‌ కోహ్లి (124) పోరాడినా భారత్‌కు ఓటమి తప్పలేదు. పవర్‌ప్లేలో రోహిత్‌ శర్మ (11), శుభ్‌మన్‌ గిల్‌ (23) అవుటైనా.. భారత్‌ 66 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (3), కెఎల్‌ రాహుల్‌ (1) సైతం నిరాశపరచటంతో భారత్‌ ఒత్తిడిలో కూరుకుంది. కానీ ఓ ఎండ్‌లో విరాట్‌ కోహ్లి ఉండటంతో ఆఖరు వరకు రేసులో నిలిచింది. 51 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన కోహ్లి.. 91 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (53), టెయిలెండర్‌ హర్షిత్‌ రానా (52)లు కోహ్లికి చక్కటి సహకారం అందించారు. దీంతో నితీశ్‌తో కలిసి 88 పరుగులు, రానాతో కలిసి 99 పరుగుల భాగస్వామ్యాలు నిర్మించాడు. నితీశ్‌, రానా నిష్క్రమణతో మరో ఎండ్‌ నుంచి సహకారం కరువైంది. సిరాజ్‌ (0), కుల్‌దీప్‌ (5), అర్ష్‌దీప్‌ (4 నాటౌట్‌) నిరాశపరిచారు. దీంతో 46 ఓవర్లలోనే భారత్‌ కుప్పకూలింది. న్యూజిలాండ్‌ 41 పరుగుల తేడాతో అఖండ విజయం అందుకుంది.

మిచెల్‌, ఫిలిప్స్‌ సెంచరీలు
టాస్‌ నెగ్గిన భారత్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. పేసర్లు మెరవటంతో పవర్‌ప్లేలో భారత్‌ పైచేయి సాధించింది. కివీస్‌ ఓపెనర్లు డెవాన్‌ కాన్వే (5), హెన్రీ నికోల్స్‌ (0) ఇన్నింగ్స్‌ తొలి ఏడు బంతుల్లోనే పెవిలియన్‌ బాట పట్టారు. దీంతో పవర్‌ప్లేలో న్యూజిలాండ్‌ వెనుకంజ వేసింది. విల్‌ యంగ్‌ (30), డార్లీ మిచెల్‌ (137) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త వహించారు. మూడో వికెట్‌కు ఈ జోడీ 53 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. విల్‌ యంగ్‌ను రానా సాగనంపటంతో 58/3తో కివీస్‌ మళ్లీ కష్టాల్లో పడినట్టు అనిపించింది. మిడిల్‌ ఓవర్లలో డార్లీ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ (106) అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. భారత స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ 188 బంతుల్లోనే 219 పరుగులు చేసింది.

ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 56 బంతుల్లో మిచెల్‌ అర్థ సెంచరీ సాధించగా… గ్లెన్‌ ఫిలిప్స్‌ మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 53 బంతుల్లో ఫిఫ్టీ అందుకున్నాడు. స్పిన్‌, పేస్‌ అస్త్రాలు ప్రయోగించినా ఈ జోడీ జోరు తగ్గలేదు. పది ఫోర్లు, రెండు సిక్సర్లతో మిచెల్‌ ఈ సిరీస్‌లో రెండో సెంచరీ అందుకోగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ డెత్‌ ఓవర్లలో దంచికొట్టాడు. ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 83 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఈ ఇద్దరు దంచికొట్టగా న్యూజిలాండ్‌ భారీ స్కోరు సాధించింది. ఆఖర్లో కెప్టెన్‌ మైకల్‌ బ్రాస్‌వెల్‌ (28 నాటౌట్‌) మూడు సిక్స్‌లు,ఓ ఫోర్‌తో అలరించాడు. న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 337 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ (3/63), హర్షిత్‌ రానా (3/84) మూడేసి వికెట్లు పడగొట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -