– ఎంపీ కృష్ణయ్య, జాగృతి అధ్యక్షురాలు కవిత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ చైర్మెన్ విశారదన్ మహరాజ్
– బాధితులతో కలిసి డీజీపీకి వినతిపత్రం
నవతెలంగాణ – ముషీరాబాద్
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనలో చిన్నారి మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఎంపీ కృష్ణయ్య, జాగృతి అధ్యక్షురాలు కవిత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ చైర్మెన్ విశారదన్ మహరాజ్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిన్ ఈశ్వరయ్యతో కలిసి వారు కుమ్మెర బాధితులు మమత, గణేష్ సహా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. మల్లన్న జాతర సందర్భంగా దేవుని దర్శనానికి వచ్చిన బాధిత కుటుంబంపై భూస్వామ్య పెత్తందారులు దాడి చేసి రెండు నెలల పసిపాపను సైతం చంపడం మానవత్వానికి మాయని మచ్చ అని అన్నారు. పసికందును చంపిన వారిని అరెస్టు చేయకపోగా, బాధితులపైనే కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే దాడికి తెగబడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ.. ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించేలా బాధిత కుటుంబం పోరాటం చేస్తోందన్నారు. ఈ ఘటనలో అనేక కోణాలు ఉన్నప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. పోలీసులు, ప్రభుత్వం కలిసి నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తోందన్నారు. ఈ కేసులో నిందితులను శిక్షించే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం పసిపాప తల్లి మమత మాట్లాడుతూ.. దర్శనానికి టికెట్ ఎందుకని ప్రశ్నించడమే తాము చేసిన నేరమని చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి సహా ఎనిమిది మంది తమపై దాడి చేశారని, తమ బిడ్డను చంపిన వారిని శిక్షించే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. అనంతరం బాగ్‌లింగంపల్లి నుంచి డీజీపీ కార్యాలయం వరకు బాధితులతో కలిసి ర్యాలీగా వెళ్లడానికి విశారదన్ మహారాజ్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వాహనాల్లోనే డీజీపీ కార్యాలయానికి వెళ్లాలని, అవసరమైతే పోలీసు వాహనంలో తీసుకువెళతామని అదనపు డీసీపీ నర్సయ్య సూచించడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం వారు డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు.
‘కుమ్మెర’ నిందితులను వెంటనే అరెస్టు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



