– విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు తేవాలి
– 12న సమ్మెలో ఆర్టీసీ కార్మికులందరూ పాల్గొనాలి : ఎస్‌డబ్ల్యూఎఫ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
లేబర్ కోడ్‌లను రద్దు చేయాలనీ, విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు తేవాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రచార కార్యదర్శి పి.రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ నెల 12న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని ముషీరాబాద్ డిపో వద్ద సమ్మె కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ బస్సుల నిర్వహణను ఆర్టీసీకే అప్పగించాలని కోరారు. ఆర్టీసీలో యూనియన్లపై ఆంక్షలను ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లతో ఆర్టీసీ కార్మికులకు వర్తించే పది చట్టాలు రద్దయిపోయాయనీ, దీనివల్ల పని పరిస్థితులు, పనివేళల్లో తీవ్ర మార్పులు రాబోతున్నాయని తెలిపారు. సమ్మె హక్కును కాలరాయడాన్ని తప్పుబట్టారు. నెలకు రూ.4,638 వేతనం చాలని మోడీ సర్కారు చెప్పటం దుర్మార్గమన్నారు. ఆ డబ్బులతో మోడీ బతికి చూపించాలని సవాల్ విసిరారు. మాట్లాడే హక్కు, సంఘటిత బేరసారాల హక్కు, సమాన పనికి సమాన వేతనం, సామాజిక భద్రత, జీవించడానికి అవసరం మేరకు వేతనం, తదితర హక్కులను పరిరక్షించుకొనేందుకు జరిగే పోరాటంలో కార్మికులు కలిసి రావాలని కోరారు. ముషీరాబాద్ డిపో ఎస్‌డబ్ల్యూఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, లింగం, తదితరులు పాల్గొన్నారు.
లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



