చీకటిని చెరిపేస్తూ దుఃఖాన్ని తరుముతూ
సన్నని కాంతిరేఖలతో
ఆనందాలను నింపేందుకు
సన్నద్ధమవుతుంది దీపం
ప్రతినిత్యం వెలిగించి
దీపం జ్యోతి పరం బ్రహ్మ అంటూ
పండుగలు వేదికలపై
వెలిగింప చేసి దీపానికి నమస్కరిస్తాం
భక్తి ప్రపత్తులను చాటుకుంటాం
దీపంతో హారతి దీపంతో దిష్టి
దీపంతో దారి దీపంతో సంపద
ఎన్ని రకాలుగా ఉపయోగిస్తాం కదూ
మట్టితో పింగాణీతో కంచుతో వెండితో
సజనకు పదును పెట్టి రంగులు అద్ది రూపొందిస్తాం
చమురుతో వత్తులతో మైనంతో సిద్ధం చేస్తాం
అందంగా ముస్తాబై వెలిగిస్తాం
నిలబడి కూర్చుని క్లోజప్ లో లాంగ్ షాట్ లో
రకరకాలుగా దీపంతో ఫోటోలు దిగుతాం
ఆ కాంతిని మోముపై చూసుకుని ఆనందపడతాం
వెలుగు రేఖలను చూసి మురిసిపోతాం
ఒక చిన్ని దీపం ఎంత కాంతిని అందిస్తుందో
ఒక చిన్న వెలుగు రేఖ
ఎంతటి దిగులును పారదోలుతుందో
దీపాలు దివిటీలై వెలుగుతాయి
నక్షత్రాల్లా మెరుస్తుంటాయి
అలంకారంలో కాంతిపూలసజ్జలవుతాయి
అవసరార్థం వేలాడదీసిన వేగుచుక్కలవుతారు
ఏది ఏమైనా దీపం దీపమే
దీపంలా వెలుగొందమని దీవెన లిస్తూ
దీపావళి పేరుతో ఇల్లు ప్రకాశింపజేస్తూ
దీపం లాంటి ఇల్లాలని కీర్తిస్తూ
చిదిమి దీపం పెట్టుకోవచ్చని మురిసిపోతూ
దీపం లాంటి పిల్లని పొగుడుతూ ఆనందపడతాం
ఆ దీపం కొండెక్కితే దుఃఖిస్తాం
దీపమారిపోతే ప్రాణం పోయిందని పోలిక చెప్తాం
దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోమని
సామెతలూ పలుకుతాం
అంతటి విశిష్టమైన దీపాలను మనమూ వెలిగిద్దాం
రండి ఈ దీపావళి రోజున దీపాలను వెలిగిద్దాం
మనలోని కల్మషపు చీకటిని తరిమేద్దాం
దీపాలతో జతకట్టి దీపావళి అంటే
దీపాల వరుసగా నిలుద్దాం
అశాంతిని వీడి ప్రశాంతంగా వెలుగును ఆహ్వానిద్దాం
మరికొందరిలో వెలుగును నింపుదాము
మరి కాస్త ఎదిగి మనమే వెలుగై
కొందరికైనా దారి చూపుదాం
మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు
డా. సమ్మెట విజయ