Friday, January 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభూమి ఒకరిది..పరిహారం మరొకరికి..!

భూమి ఒకరిది..పరిహారం మరొకరికి..!

- Advertisement -

తండావాసులు కాకున్నా ‘నిమ్జ్‌’ పరిహారం
తెరవెనుక అధికారుల హస్తం
అసైన్డ్‌ పట్టాలు ఉన్నా పరిహారం పొందని ఎల్గోయి రైతులు

నవతెలంగాణ-ఝరాసంగం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్‌)లో నేటికీ బాధిత రైతులకు పరిహారం అందలేదు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంతంలోని ఝరాసంగం, న్యాల్‌కల్‌ మండలాల పరిధిలో నిమ్జ్‌ ఏర్పాటుకు 2012లో కేంద్రం మంజూరు చేసింది. కాలుష్యరహిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం. అందులో భాగంగా కేంద్రం ఆదేశాల ప్రకారం.. 12635 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్‌, పట్టా భూములు సేకరించడానికి అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు 7500 ఎకరాల పైచిలుకు భూములను రైతుల నుంచి సేకరించి నష్టపరిహారం అందజేశారు. అయితే, కొంత మంది రైతులకు తమ పేరుపై రికార్డుల్లో భూమి ఉన్నా ఇప్పటి వరకు వారికి నష్టపరిహారం అందలేదు. అదేంటని అధికారులను అడిగితే ”ఫైల్‌ పంపాం., త్వరలోనే వస్తాయని సమాధానం ఇస్తున్నారు తప్పితే.. ఫైల్‌ పంపింది లేదు.. నష్టపరిహారం వచ్చింది లేదు” అని రైతులు వాపోతున్నారు.

నిమ్జ్‌ భూసేకరణలో అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఛీలెపల్లి తండా పరిధిలోని సర్వే నెంబర్‌ 151లో 20.33 ఎకరాల భూమి ఉండగా ఇందులో.. 8.10 ఎకరాల భూమి 1997 వరకు పహాణిలో పూల్‌సింగ్‌ పేరుపై ఉన్నది. ఆ తర్వాత అధికారులు రికార్డులలో ప్రభుత్వ భూమిగా నమోదు చేసుకుంటూ వచ్చారు. 2012 నుంచి 20.33 గుంటల భూమి ఆన్‌లైన్‌లో ప్రభుత్వ భూమిగా నమోదైంది. కానీ పూల్‌సింగ్‌ కబ్జాలో ఉంటూ పంటలు పండిస్తున్నాడు. దీనిపై వీరు 2015లో పట్టాపాస్‌ బుక్‌ కావాలని కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నది. భూసేకరణ నోటిఫికేషన్‌లో ఈ సర్వే నెంబర్‌ భూమి ప్రభుత్వానిదిగానే ఉంది. కానీ, నష్టపరిహారం కబ్జాలో ఉన్న రైతుకు కాకుండా వేరేవారికి చెక్కుల ద్వారా కాకుండా అకౌంట్‌ బదిలీ చేశారని బాధిత రైతు వాపోతున్నాడు. ఈ విషయంలో అధికారుల ద్వారా అక్రమాలు జరిగినట్టు రైతు ఆరోపిస్తున్నాడు. నష్టపరిహారం కబ్జాలో ఉన్న వారికి కాకుండా తండాకు సంబంధం లేని, ఇప్పటి వరకు భూమి చూడని వ్యక్తులకు ఎలా చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని నిజమైన అర్హునికి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.

ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలి..
నిమ్జ్‌ భూ సేకరణపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపడితే అక్రమార్కుల భాగోతం బయటపడుతుందని రైతులు అంటున్నారు. నోటిఫికేషన్‌లో అన్‌ అసైన్డ్‌ భూమిగా చూయించిన అధికారులు ఈ భూమికి సంబంధం లేని వ్యక్తులకు నష్టపరిహారం అందించడంలోనే మతలబు దాగి ఉన్నదని అంటున్నారు.

నష్టపరిహారం చెల్లించాలి
నిమ్జ్‌ ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోతున్న మరో గ్రామం ఎల్గోయి. ఈ రైతులది మరో రకమైన సమస్య. గ్రామంలోని సర్వే నెంబర్‌ 54లో 328.10 ఎకరాల భూమికి సంబంధించి 152 మంది అసైన్డ్‌ పట్టాలున్న రైతులకు నష్టపరిహారం అందింది. తమకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని మరికొందరు రైతులు వాపోతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కావడం లేదని, అధికారులు మాత్రం ఈ సర్వే నెంబర్‌ భూమికి రికార్డు ప్రకారం నష్టపరిహారం అందిందని.. మిగులు భూమి ఏమీలేదని చెబుతున్నట్టు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కబ్జాలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్న మా పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారులు గ్రామంలో విచారణ చేసి ప్రభుత్వం అందించిన పట్టాలు ఉన్న రైతుకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -