Sunday, September 14, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుభూమి నీదే..చెట్టు నాది

భూమి నీదే..చెట్టు నాది

- Advertisement -

రెవెన్యూ, అటవీ చట్టాల మధ్య నలుగుతున్న గిరిజనం
గూడేల్లో కనిపించని అభివృద్ధి
పత్తాలేని ప్రభుత్వ పథకాలు
మొత్తుకుంటున్న గిరిజన ఎమ్మెల్యేలు
పట్టించుకోని ప్రభుత్వాధినేతలు

‘భూమి నీదే…ఇల్లు మాత్రం నాది’ ఎవరన్నా మీతో అన్నారనుకోండి…మీకెలా అనిపిస్తుంది? ఇదే మాటను ఆదివాసీ గిరిజన గూడేల్లో రెవెన్యూ, అటవీశాఖల అధికారులు అంటున్నారు. అటవీప్రాంతాల్లో రెవెన్యూ శాఖ భూ యజమానుల పేరుతో ఆదివాసీ, గిరిజనులకు పట్టాలు ఇచ్చింది. హద్దులు గుర్తించలేదు. గిరిజనులు తమ భూముల్లో పంటలు సాగు చేసుకోవడం, లేదా సాగుకు యోగ్యంగా భూమిని చదును చేసే క్రమంలో మధ్యలోని చెట్లను తొలగించడం వంటి పనులు చేస్తే, తక్షణం అటవీశాఖ అధికారులు వాలిపోతున్నారు. భూమి నీదే అయినా, ఆ చెట్టు మాది…దాన్ని కొట్టేయడానికి వీల్లేదంటూ షరతులు విధిస్తున్నారు. సాగుకోసం భూమిలో బోర్‌వెల్‌ వేయించుకోవాలంటే, అటవీచట్టం ఒప్పుకోదంటూ అడ్డుపడుతున్నారు.కాదని వాదిస్తే గిరిజనులపై కేసులు పెడుతున్నారు. ఒక గూడెం నుంచి మరో గూడేనికి రోడ్డు నిర్మాణం చేసుకోవాలన్నా, చట్టాలు ఒప్పుకోవంటూ కొర్రీలు పెడుతున్నారు. కనీసం పక్కా ఇంటిని నిర్మించుకోవాలన్నా, నిబంధనలు ఒప్పుకోవని అనుమతులు తిరస్కరిస్తున్నారు. సాగుకోసం విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకోవాలన్నా, కరెంటు స్తంబాలు ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ అడ్డుపడుతున్నారు. ఫలితంగా ఆదివాసీ, గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు ఏమాత్రం మెరుగుపడట్లేదు. తాతల కాలంలో ఎలా ఉన్నారో, తరాలు మారినా వారి వారసులు కూడా అలాగే బతుకులీడుస్తున్నారు.

ఆమడదూరంలో అభివృద్ధి
రెవెన్యూ, అటవీశాఖల చట్టాలు వేర్వేరుగా ఉండటం, ఆ రెంటి మధ్య సమన్వయం లేకపోవడంతో ఆదివాసీ గిరిజన గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న అనేక పథకాలు కాగితాల్లోనే ఉంటున్నాయి తప్ప, ఆచరణసా ధ్యం కావట్లేదు. ఫలితంగా గూడేల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

గిరిజన ఎమ్మెల్యేల ఆక్రోశం
ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, చట్టాల సవరణ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంపై గిరిజన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయా శాఖల మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా ఉందని వాపోతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో అధికారపార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమనీ హెచ్చరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ అధ్యక్షతన జరిగిన ఏడో గిరిజన సలహామండలి సమావేశంలో అధికార పార్టీకి చెందిన గిరిజన ప్రాంతాల ఎమ్మెల్యేలు ఇవే విషయాల్ని ప్రస్తావించారు. నియోజక వర్గాల్లో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. అన్నీ విన్న మంత్రి అడ్లూరి ‘ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం’ అని చెప్పి సమావేశాన్ని ముగించారు.

చట్టాల్లో మార్పులు అనివార్యం
అటవీ హక్కుల చట్టం-2006 అమల్లో అనేక లోపాలు ఉన్నాయి. చట్టం పగడ్బందీగా ఉన్నా, దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూప ట్లేదు. ఆదివాసీ, గిరిజనులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసి చేతులు దులుపుకుంటున్నాయే తప్ప, వాటి అమలును విస్మరిస్తున్నాయి. ఫలి తంగా ఆదివాసీ, గిరిజనుల నివాస ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగ ట్లేదు. జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోవట్లేదు. ప్రధానంగా భూ హక్కులు, వనరుల వినియోగం, జీవనోపాధి, మౌలిక వసతుల ఏర్పాటులో అడు గడుగునా ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. అటవి భూములపై చట్టబద్ద హక్కు లు లేవంటూ అధికారులు కొర్రీలు పెడుతున్నారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఆటంకంగా ఉన్న అటవీ నిబంధనలను సవరించాలని దశాబ్దాలుగా ఆయా సంఘాలు, గిరిజన ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలను కోరుతూనే ఉన్నారు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం ఉండాలనీ, ప్రతిబంధకాలుగా ఉన్న చట్టాలను సవరించాలని చెప్తున్నారు. గిరిజన గ్రామాలకు సామూహిక హక్కులు ఇవ్వాలని చట్టాలు చెబుతున్నా, ప్రభుత్వాలు వాటిని ఉల్లంఘిస్తున్నాయనే విమర్శ ఉంది. గిరిజనులను అటవీ నిర్వహణలో భాగస్వామ్యం చేయకుండా దాటవేస్తున్నారు.

అడుగడుగునా ఆంక్షలు
ఆదివాసీ, గిరిజనులు వనరుల వినియోగంలోనూ బాధలను అనుభవిస్తున్నారు. వారు జీవనాధారంగా ఆధారపడే చెక్క, తేనె, ఎర్రచెట్టు, ఆకులు, తాటి మొదలైన వనరులపై అటవీ శాఖ ఆంక్షల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నారు. మార్కెట్లోకి తీసుకెళ్లే హక్కులపై పరిమితులు విధించటంతో కష్టానికి తగిన ఫలితం పొందలేక పోతున్నారు. రోడ్లు, విద్యుత్‌, పాఠశాలలు, ఆస్పత్రులు, మంచినీటి బావులు, అంగన్‌వాడీ కేంద్రాల వంటివి అటవీ ప్రాంతంలో నిర్మించాలంటే అటవీశాఖ క్లియరెన్స్‌ తప్పనిసరి. నిబంధనల పేరుతో వాటినీ తిరస్కరిస్తున్నారు. అసలు అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లే ముందుకు రావట్లేదంటే, అక్కడి సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఆదివాసీ, గిరిజనుల బతుకులు ఎలా ఉన్నాయో ‘ప్రజా ప్రభుత్వం’ వచ్చాక కూడా అలాగే ఉన్నాయి. మరోవైపు రెవెన్యూ, అటవీశాఖల అధికారులు స్థానిక గిరిజన సంఘాలను సంప్రదించకుండా, వారే స్వీయ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫలితంగా ఆదివాసీ, గిరిజనులకు స్వయం పాలన అవకాశాలను కోల్పోతున్నారు.

నిధులు ఖర్చు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో గిరిజనుల అభివృద్ధికి కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేయాలి. గత ప్రభుత్వం మాదిరిగా సబ్‌ ప్లాన్‌ నిధులను దారిమళ్లించొద్దని ఆదివాసీలు కోరుతున్నారు. రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఉట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం, మన్ననూరు, మైదాన ప్రాంతాల ఐటీడీఏలు ఉన్నాయి. 1282 షెడ్యూల్డు ఏరియా గ్రామ పంచాయతీలున్నాయి. ఈ ఏడాది నిర్వహించిన కుల గణన ప్రకారం10.04శాతం గిరిజనులున్నారు. వీరి జనాభా దామాషా ప్రకారం గిరిజన సబ్‌ప్లాన్‌కు రూ.22,698కోట్లు కేటాయించాలి. కానీ 2025-26 బడ్జెట్‌లో రూ.17,168 కోట్లు మాత్రమే కేటాయించారు. వీటిని కూడా సక్రమంగా ఖర్చు చేస్తారో లేదో అనే అనుమానాలను గిరిజన సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి బీఆర్‌ఎస్‌ హయాంలోని కేసీఆర్‌ ప్రభుత్వం గిరిజనులకు హక్కుగా రావాల్సిన సబ్‌ ప్లాన్‌ నిధులను దారిమళ్లించి, తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ప్రచారం చేసుకుంది.

ఎస్‌ వెంకన్న

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -