– రాష్ట్రంలో 11.5 లక్షల ఎకరాలు నోటిఫై 4.2 లక్షల ఎకరాలకు పట్టాలిచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం
– 2006 అటవీ హక్కుల చట్టాన్ని ప్రస్తావించని కొత్త చట్టం
– పట్టాల కోసం మరో 7.3 లక్షల ఎకరాల రైతుల ఎదురు చూపు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన
భూ భారతి చట్టం 2024లో పోడు భూములకు సంబంధించి ఎలాంటి విధివిధానాలను ప్రకటించలేదు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో రెండు వేల 845 గ్రామ పంచాయతీల నుంచి 4 లక్షల 14 వేల 353 దరఖాస్తులు పోడు పట్టాల కోసం వచ్చాయి. వీటి విస్తీర్ణం 12 లక్షల 46 వేల 846 ఎకరాలుగా ఉంది. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం రెవెన్యూ, అటవీ, గిరిజన శాఖల ఆధ్వర్యంలో 11.5 లక్షల ఎకరాల అటవీ భూములను నోటిఫై చేసి, 2023లో 4.2 లక్షల ఎకరాలకు మాత్రమే బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టాలిచ్చింది. ఆ తర్వాత అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్ పోడు రైతులందరికి పట్టాలిస్తామని ఎన్నికల ముందిచ్చిన హామీని కొత్త చట్టంలో ప్రస్తావించలేదు. దాంతో మరో 7.3 లక్షల ఎకరాల పట్టాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని 28 జిల్లాల్లో గిరిజనులతో పాటు కొంత మంది గిరిజనేతరులు పోడు వ్యవసాయం చేస్తున్నారు. ప్రభుత్వం నోటిఫై చేసిన 11.5 లక్షల ఎకరాల్లో సింహ భాగం భూములు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు, ఖమ్మం, వరంగల్, నాగర్‌కర్నూల్, మంచిర్యాల జిల్లాల్లో ఉన్నాయి. వీటికి పోడు పట్టాలివ్వాలని వామ పక్షాలతో పాటు పలు పార్టీల సుధీర్ఘ పోరాటం తర్వాత కేంద్రం అటవీ నివాసితుల చట్టం 2006 ద్వారా గిరిజలనులకు కొన్ని ప్రత్యేక హక్కులను కల్పించింది. 2007 డిసెంబర్ 31 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. తరతరాల నుంచి అడవిపై ఆధారపడి జీవనాధారం పొందుతున్న గిరిజన తెగలకు న్యాయం జరగాలని దీన్ని తీసుకొచ్చారు. అయితే రాష్ట్రంలో ఈ చట్టం అమలు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఉమ్మడి ఏపీలో ఎలాంటి ప్రయత్నం చేయక పోవడంతో అడుగు ముందుకు పడలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తర్వాత పదేండ్లు పాలించిన బీఆర్‌ఎస్ పోడు భూముల పట్టాలకు సంబంధించి కొంత కసరత్తు చేసింది. అయితే అది పూర్తి స్థాయిలో జరగక పోవడంతో సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఆ తర్వాత 2023 డిసెంబర్‌లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ సైతం అదే ధోరణిని అవలంబిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
తాము అధికారం చేపడితే రాష్ట్రంలోని పోడు రైతులందరికి పట్టాలిస్తామని ఎన్నికల ముందుకు అనేక బహిరంగ సభల్లో చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. రాష్ట్రంలోని భూ సమస్యలను కొల్కిక్కి తెచ్చేందుకే భూ భారతి చట్టాన్ని తెచ్చామని చెబుతున్న సర్కార్ అందులో పోడు భూములకు సంబంధించి ఎలాంటి విధివిదానాలకు ప్రకటించలేదు.
అర్హులెవరు?….
ఈ చట్టం ప్రకారం.. 2005 డిసెంబర్ నాటికి అటవీ భూమిలో నివాసం ఉండి సాగుచేస్తూ ఆ భూమిపై జీవనాధారం సాగించే గిరిజనులు అర్హులు. ఈ చట్టంలోని సెక్షన్ 4 (6) ప్రకారం.. 4 హెక్టార్లకు (10 ఎకరాలు) మించకుండా భూమి ఉండాలి. గిరిజనేతరులైతే 2005 కంటే ముందు 3 తరాల వారు అంటే, 75 ఏండ్లకు పూర్వం అటవీ భూముల్లో నివాసం ఉండి సాగుచేస్తూ, వాటిపై మాత్రమే జీవనాధారం కలిగి ఉండాలి. అటవీ హక్కుల నిబంధనలు సెక్షన్ 13(1) ప్రకారం.. ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఇంటిపన్ను రశీదులు, నివాస ధ్రువీకరణ పత్రాలు, సంప్రదాయబద్ధంగా అడవుల్లో ప్రజా వినియోగాలైన బావులు, బోర్లు, శ్మశానాలు సాక్ష్యాలుగా పరిగణించి పోడు భూములకు పట్టాల పంపిణీ చేస్తారు.
4లక్షల ఎకరాలకు పట్టాలు పంపిణీ…
తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గిరిజలనుకు పోడు పట్టాలను పంపిణి చేసింది. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం రెవెన్యూ, అటవీ, గిరిజన శాఖల ఆధ్వర్యంలో 11.5 లక్షల ఎకరాల పోడు భూములను ప్రభుత్వం నోటీఫై చేసింది. ఇందులో బీఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్‌లాంటి అటవీ భూములు లేని ఏడు జిల్లాలను మినహాయించి 26 జిల్లాల్లోని 1,51,146 మంది గిరిజనులకు 4,06,369 ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చింది.
భూ భారతి చట్టానికి సవరణలు చేయాలి
భూ భారతి చట్టానికి సవరణలు చేసి పోడు రైతులకు వెంటనే పట్టాలివ్వాలి. గత సర్కార్ హయాంలో పట్టాలిచ్చిన 4.2 లక్షల ఎకరాల్లో మొత్తం భూములను ధరణిలో అప్‌లోడ్ చేయాలి. కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా అటవీ భూములకు పట్టాలిచ్చి సంక్షేమ పథకాలను అమలు చేయాలి. సమగ్ర భూసర్వే నిర్వహించి, 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం మిగులు భూమిని పేదలకు పంచాలి.
టి. సాగర్, తెలంగాణ రైతు సంఘం : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పోడు గోడు పట్టని భూ భారతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES