సుప్రీంకోర్టుకు మరోసారి స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
43 అంశాలతో 56 పేజీల అడిషనల్ అఫిడవిట్ దాఖలు
కార్టో సాట్, గూగుల్ ఎర్త్ ఈమెజేనరీ,
సెంటిసెల్ శాటిలైట్ ఫొటోలు అటాచ్
పర్యావరణ పరిరక్షణకు ఇండిస్టీయల్ పార్క్‌లో మొక్కలు నాటుతున్నట్టు వెల్లడి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కంచ గచ్చిబౌలివి ప్రభుత్వ భూములే అని, అటవీ భూములు కాదని సర్వోన్నత న్యాయస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. అందుకు సంబంధిం చిన రెవెన్యూ డిపార్ట్‌మెంట్ రికార్డులు, ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో అందుకు తగ్గట్టుగా రిలీజ్ చేసిన జీవోలను కోర్టుకు సమర్పించింది. ఈ భూమిని ఫారెస్ట్ ల్యాండ్‌గా ప్రకటించాలని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) పేర్కొన్న అంశాలు సరికాదని తెలిపింది. ఈ మేరకు మంగళవారం సమగ్ర వివరాలతో మొత్తం 43అంశాలతో కూడిన 56 పేజీల అడిషనల్ అఫిడ విట్‌ను రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ రామకృష్ణారావు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఈ అఫిడవిట్‌లో 2001 లో అప్పటి ఉమ్మడి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ పేరుతో జారీ చేసిన జీవో నెంబర్ 538, 2006లో కంచ గచ్చిబౌలి కార్టోసాట్ ఈమేజెనరీ, 2024లో తీసిన గూగుల్ ఎర్త్ ఈమేజేనరీ, 2025 ఏప్రిల్‌లో సేకరించిన సెంటినల్ శాటిలైట్ డేటాను ఈ అఫిడవిట్‌కు జత చేశారు. అలాగే… క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వాస్తవాలు, ఇతర అంశాలతో కూడిన వివరాలను దీనికి పొందుపరిచారు.
అటవీ భూమి కాదు
సీఈసీ పేర్కొన్నట్టు కంచ గచ్చిబౌలి భూమి అటవీ భూమి కాదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. గత అఫిడవిట్ లోనే ఈ అంశాన్ని స్పష్టం చేసినట్టు తెలిపింది. ఈ భూ ములు ‘కంచ పోరంబోకు సర్కారీ’ భూములుగా 1954-55 లోనే రెవెన్యూ రికార్డుల్లో నమోదైందని, ఈ భూముల్ని ప్రభుత్వం అటవీ భూమిగా గుర్తించలేదని తెలిపింది. ‘కంచ’ అంటే వ్యవసాయానికి లేదా పబ్లిక్ పర్పస్‌కు ఉపయోగించని భూమి అని వివరించింది. ఆ తర్వాత ఈ భూముల్ని 2001 అక్టోబర్‌లో ఆనాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో ‘పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ యూజ్’ కింద పేర్కొందని ప్రస్తావించింది. అనంతరం 2007 నుంచి ఈ భూమి వ్యవహారం కోర్టులో నడించిందని, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ప్రభుత్వానికి చెందిందని కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపింది. దీంతో ఈ భూమి దట్టమైన అటవీ ప్రాంతంగా మారినట్టు కార్టో సాట్, గూగుల్ ఎర్త్ ఈమెజేనరీ, సెంటిసెల్ శాటిలైజ్ చిత్రాలు చూపుతున్నాయని తెలిపింది.
హైదరాబాద్ జీసీసీలకు గమ్యస్థానం
నానక్ రాంగూడ, మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాలను ఐటీ జోన్లుగా తీర్చిదిద్దేందుకు ఉమ్మడి ఏపీ, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్లస్టర్లలో దాదాపు రూ. 99, 880 కోట్ల ఇన్వెస్టర్లను ఆకర్షించిందనీ, తద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు దక్కాయని తెలిపింది. ఇది హైదరాబాద్‌ను గ్లోబల్ క్యాపబిలిటి సెంటర్ల (జీసీసీ)ల గమ్యస్థానంగా మార్చిందని పేర్కొంది. 2024లో కొత్తగా70 జీసీసీలను ఆకర్షించినట్టు వివరించింది. తద్వారా రూ.16 వేల కోట్ల పెట్టుబడులు, 84 వేల మందికి జాబ్స్ రానున్నట్టు తెలిపింది. అందువల్ల ఈ 400 ఎకరాల్లో సుస్థిర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది.
ఇండిస్టీయల్ పార్క్‌ల్లో లక్షకుపైగా మొక్కలు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇండిస్టీయల్ పార్క్‌లు, ఇతర చోట్ల 1.23లక్షల మొక్కలు నాటుతున్నట్టు అడిషనల్ అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఇందులో మేడ్చల్ – సిద్దిపేట, శంషాబాద్, పటాన్ చెరు, సైబారాబాద్‌లో 40, 500 మొక్కలు నాటనున్నట్టు తెలిపింది. అలాగే 2.13 కోట్లతో ఎస్‌ఎఫ్ పీజీ వరంగల్, యెంకతల, గోల్కొండ ఆర్టిలరీ సెంటర్, జహీరాబాద్ నిమ్జ్‌లో 82, 500 మొక్కలు నాటుతున్నట్టు పేర్కొంది. వీటితో పాటు ఓఆర్‌ఆర్ ఇన్‌సైడ్, అవుట్‌సైడ్‌లో మొత్తం 135 ఎకరాల్లో మొక్కలు నాటుతున్నట్టు కోర్టుకు నివేదించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా అఫిడవిట్‌కు ప్రభుత్వం జత చేసింది.
కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివే
- Advertisement -
- Advertisement -