Tuesday, January 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకొండాపూర్‌లోని బాలసాయిబాబా ట్రస్ట్‌ భూములు మావే

కొండాపూర్‌లోని బాలసాయిబాబా ట్రస్ట్‌ భూములు మావే

- Advertisement -

తెలంగాణ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం
నవతెలంగాణ-హైదరాబాద్‌

కర్నూలు జిల్లాలోని శ్రీ బాలసాయిబాబా సెంట్రల్‌ ట్రస్ట్‌కు కొండాపూర్‌లోని రూ.4 వేల కోట్లకుపైగా విలువైన 42 ఎకరాలపై తెలంగాణ ప్రభుత్వానికి ఏ విధమైన అధికారం లేదని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వ పరిధిలో బాలసాయిబాబా ట్రస్ట్‌ ఉందని చెప్పింది. ట్రస్ట్‌కు చెందిన భూములను ప్రయివేటు సంస్థ అయిన భూపతి ఎస్టేట్స్‌కు తెలంగాణ ప్రభుత్వం అప్పగించడం చెల్లదని పేర్కొంది. ఈ అధికారం తెలంగాణ రాష్ట్రానికి లేదని తెలిపింది. ట్రస్ట్‌కు చెందిన 42 ఎకరాలను భూపతి ఎస్టేట్స్‌కు అప్పగించడాన్ని సవాలు చేస్తూ 2024లో దాఖలైన పిల్‌లో ఏపీ దేవాదాయశాఖ కమిషనర్‌ కౌంటరు దాఖలు చేశారు. ఈ ప్రజాహిత వ్యాజ్ఞాన్ని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ విచారిస్తోంది.

ఫిబ్రవరి 2న ముగ్గురు ఐఏఎస్‌లు వ్యక్తిగతంగా హాజరై వివరణివ్వాలి : హైకోర్టు ఉత్తర్వులు జారీ
వనపర్తిలో శంకర సముద్రం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ కాలువ నిర్మాణం కోసం 2013లో సేకరించిన భూమికి పరిహారంలో 50 శాతం డిపాజిట్‌ చేయాలన్న గత ఆదేశాలు అమలు చేయకపోవడంపై ముగ్గురు ఐఏఎస్‌ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 2న జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ సుల్తానియా, సీసీఎల్‌ఏ లోకేశ్‌ కుమార్‌లకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. వనపర్తి కోర్టు నిర్ణయించిన పరిహార ఉత్తర్వులను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు గతంలో మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కింది కోర్టు నిర్ణయించిన పరిహారంలో సగభాగం చెల్లించాలన్న ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రావణ కుమార్‌ వీరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జస్టిస్‌ ఘోష్‌ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలొద్దు గత మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కట్టడాల్లో అక్రమాలపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దంటూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సోమవారం మరోసారి పొడిగించింది. మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌, రిటైర్డ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్‌ జోషిలపై చర్యలు తీసుకోవాలన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. విచారణను ఫిబ్రవరి 25కు వాయిదా వేస్తూ చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్‌ ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వం గడువు కోరడంతో విచారణ వాయిదా పడింది.

కొత్తగూడెం కార్పొరేషన్‌పై స్టేకు నిరాకరణ : హైకోర్టు
కొత్తగూడెం, పాల్వంచలను విలీనం చేసి కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు ఉత్తర్వుల అమలును నిలిపేసేందుకు హైకోర్టు నిరాకరించింది. జీవో 103 అమలుపై స్టే ఇవ్వడానికి పిటిషనర్లు తగిన ఆధారాలు చూపలేదని పేర్కొంది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు జీవో 103ను సవాలు చేస్తూ పాల్వంచ మండలం గట్టాయ గూడెంకు చెందిన ప్రవీణ్‌కుమార్‌, ఇతరులు వేసిన పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది. ఏడు గిరిజన గ్రామాలు షెడ్యూల్‌ ఏరియాలో ఉన్నాయని పిటిషనర్లు తగిన ఆధారాలు చూపలేనందున స్టే మంజూరు చేయడం లేదని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -