Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుపెన్షనర్లను విభజించే చట్టాన్ని రద్దు చేయాలి

పెన్షనర్లను విభజించే చట్టాన్ని రద్దు చేయాలి

- Advertisement -

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నష్టపోతాం ఆలిండియా స్టేట్‌ పెన్షనర్ల ఫెడరేషన్‌ సెక్రెటరీ జనరల్‌ సుధాకర్‌
సమస్యల పరిష్కారానికి ఇంకెన్ని రోజులు ఆగాలి?
15 తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం : మారం జగదీశ్వర్‌
పీఎఫ్‌ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలి : మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
మహాధర్నాకు భారీగా తరలొచ్చిన పెన్షనర్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పెన్షనర్లను పాత, కొత్త అంటూ విభజించే చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఆలిండియా స్టేట్‌ పెన్షనర్ల ఫెడరేషన్‌ సెక్రెటరీ జనరల్‌ డి సుధాకర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 2026 జనవరి ఒకటి ముందు, తర్వాత రిటైరైన పెన్షనర్లు అంటూ రెండు గ్రూపులుగా విభజించడం సరైంది కాదన్నారు. పెన్షనర్ల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేసూ తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో మహాధర్నాను చేపట్టారు. ఈ ధర్నాకు పెన్షనర్లు వివిధ జిల్లాల నుంచి వేలాదిగా తరలొచ్చారు. పెన్షనర్లు భారీగా రావడంతో ధర్నాచౌక్‌ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా సుధాకర్‌ మాట్లాడుతూ పార్లమెంటులో ఫైనాన్స్‌ బిల్లుతోపాటు పెన్షనర్లకు సంబంధించిన రూల్స్‌ను 1972 నుంచి మార్పు చేయడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. కేంద్రం చేసిన చట్టాలనే రాష్ట్రాలు కూడా అనుసరించే అవకాశముంటుందని అన్నారు. కేంద్రం చేసే నిర్ణయాలు, చట్టాలు పెన్షనర్లందరికీ మెద మీద కత్తి వేలాడినట్టుగా ఉంటుందన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు కాంగ్రెస్‌ ఎన్నో వాగ్ధానాలు, ఆశలు చూపి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. గద్దెనెక్కిన తర్వాత వారి సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉండడం సరైంది కాదన్నారు. పెన్షనర్ల నాయకులను చర్చలకు పిలిచి సమస్యలపై చర్చించి పరిష్కారానికి పూనుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

లక్ష మందితో ఎల్బీ స్టేడియంలో సభ : మారం జగదీశ్వర్‌
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించా లంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెల 15 వరకు డెడ్‌లైన్‌ విధించామని ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) రామకృష్ణారావుకు నోటీసు ఇచ్చామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఇప్పటికే 21 నెలలు అవుతున్నదనీ, సమస్యల పరిష్కారం కోసం ఇంకెన్ని రోజులు ఆగాలని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 18 లేదా 20న ఉద్యోగ జేఏసీ సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. లక్ష మంది ఉద్యోగులతో ఎల్బీ స్టేడియంలో సభను నిర్వహిస్తామన్నారు. ఈహెచ్‌ఎస్‌ను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరారు. ప్రభుత్వాన్ని గట్టిగా అడిగే జేఏసీ ఉందనీ, ఉద్యోగులు, పెన్షనర్లు బలం ఇవ్వాలని చెప్పారు. ఉద్యోగ జేఏసీ సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్యం వహించిన గత ప్రభుత్వానికి తడాఖా చూపించామనీ, అందుకే ప్రతిపక్షంలో ఉందన్నారు. నెలాఖరులోపు ఈహెచ్‌ఎస్‌ అమలుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వివిధ రకాల పెండింగ్‌ బిల్లులు రూ.13 వేల కోట్లున్నాయనీ, వాటిని వెంటనే డిమాండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పీఆర్సీని 2023, జులై ఒకటి నుంచి అమలు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, ఐఏఎస్‌ అధికారుల బిల్లులు పెండింగ్‌లో లేవని వివరించారు. కేవలం ఉద్యోగులు, పెన్షనర్ల బిల్లులే పెండింగ్‌లో ఉండడం సరైంది కాదన్నారు. ఐక్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు.


ఈ-కుబేర్‌లో పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి : నర్సిరెడ్డి
ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లులను వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈహెచ్‌ఎస్‌ను తాత్సారం చేయకుండా అమలు చేయాలని కోరారు. 2024 మార్చి నుంచి రిటైరైన ఉద్యోగులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించడం లేదన్నారు. హైదరాబాద్‌లో పెన్షనర్ల భవన్‌ను నిర్మించాలని అన్నారు. పీఎఫ్‌ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అన్ని రాష్ట్రాల్లో సీపీఎస్‌ రద్దవుతుందన్నారు. పెన్షనర్లను చర్చలకు పిలిచి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఎస్టీయూటీఎస్‌ ప్రధాన కార్యదర్శి జి సదానందంగౌడ్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రూ.398 టీచర్లకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇచ్చి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. ఎస్టీఎఫ్‌ఐ సీనియర్‌ నాయకులు ఎం సంయుక్త మాట్లాడుతూ ప్రభుత్వాలు హామీలు ఇవ్వడమే కాకుండా ఆచరణలో వాటిని అమలు చేయాలని చెప్పారు. సమస్యలు పరిష్కారం కావాలంటే ఐక్య పోరాటాలను నిర్మించాలన్నారు. అధ్యక్షవర్గంగా వ్యవహరించిన పాలకుర్తి కృష్ణమూర్తి, కె లక్ష్మయ్య మాట్లాడుతూ మంత్రులు, అధికారులను కలిసినా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పెన్షనర్ల తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతతామని పెన్షనర్ల నాయకులు ఉమాదేవి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ అధ్యక్షులు సునిల్‌, పెన్షనర్ల సమన్వయ కమిటీ నాయకులు ఎ శ్రీనివాసరావు, బి సత్యనారాయణ, నర్సయ్యగౌడ్‌, టీపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనిల్‌కుమార్‌, తిరుపతి, టీఎన్జీవో నాయకులు కస్తూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img