సమాజం వైజ్ఞానికంగా, ఆధునికంగా ముందుకు సాగుతున్నా కులం అనే మలినగోడ మాత్రం ఇంకా అడ్డుపడుతూనే ఉంది. భారత ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై మతోన్మాది బూటు విసిరిన ఘటనపై దేశంలో చర్చ నడుస్తుండగానే మరో వార్త మానవహృదయాల్ని కదిలించింది. హర్యానాలో ఐపిఎస్ అధికారి వై. పురాణ్‌కుమార్ ఆత్మహత్య పోలీసు వ్యవస్థలో దాగి ఉన్న కులాధిపత్యాన్ని బహిర్గత పరిచింది. ఒక పోలీస్ అధికారి తన ఫిర్యాదును, ఆవేదనను చట్టం ముందు పెట్టలేక తనువు చాలించడం నిజంగా దౌర్భగ్యం. ఆయన రాసిన తొమ్మిది పేజీల సూసైడ్‌నోట్ కేవలం వ్యక్తిగత బాధకాదు, కులం ఆధారిత వివక్ష, అధికారిక దౌర్జన్యం, మానసిక వేధింపులతో అల్లాడిన ఆత్మఘోష. అందరూ సమానమేనని రాజ్యాంగం చెబుతుంటే, కులం ముందు ఎవ్వరూ సమానం కాదని కుల వ్యవస్థ చాటుతోంది. ఒక ఐపీఎస్ అధికారి కూడా కులం బారినపడి ప్రాణాలు తీసుకోవాల్సి వస్తే ఇక సాధారణ పౌరునికి న్యాయం ఎక్కడన్నదే ప్రశ్న. మంగళవారం జరిగిన ఈ దారుణం వెనుక వాస్తవాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం పోలీస్‌శాఖలోని దుర్మార్గాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఇది వ్యక్తి మరణం కాదు, సామాజిక వివక్షతల హత్య.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పురాణ్‌కుమార్ 2001కి చెందిన ఐపీఎస్ అధికారి. ఛండీగఢ్‌లోని తన నివాసంలో ఈ నెల 7న సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయాడు. మొదట ఈ ఆత్మహత్యను వ్యక్తిగతంగానే అందరూ భావించినప్పటికీ సూసైడ్‌నోట్ దొరికిన తర్వాతే అసలు విషయం బయపడింది. తనను తక్కువ చేసిన వ్యవస్థ గురించి, కులం కారణంగా ఎదుర్కొన్న అవమానాలతో ఆయనపడ్డ ‘మరణ’వేదన అంతాఇంతా కాదు. సూసైడ్‌నోట్‌లో డీజీపీ శత్రుజీత్‌సింగ్ కపూర్, రోతక్ పోలీస్ అధికారి నరేంద్ర బిజర్నియా, మరో అధికారి పేర్లు ఉన్నా వాటిని పోలీసులు బయటకు వెల్లడించలేదు. అయితే పురాణ్ పేరుతో అతని వ్యక్తిగత సహాయకుడు లంచం తీసుకున్నాడన్న ఓ మద్యం కాంట్రాక్టర్ ఫిర్యాదుతో పురాణ్ పేరును ఉన్నతాధికారులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడంతో ఆయన తీవ్రంగా కలత చెందినట్టు లేఖ ద్వారా స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఐపీఎస్ అధికారి పేరును చేర్చడం అధికారుల కక్ష సాధింపును తెలియజేస్తోంది. డిపార్ట్‌మెంట్‌లో కులవివక్ష ఎక్కువైందని, గత కొన్నేండ్లుగా మానసికంగా వేధిస్తున్నారని కూడా నోట్‌లో ఉంది. అణగారిన కులాలకు చెందినవారు పైకి ఎదగడాన్ని పెత్తందారితనం ఒప్పుకోదు, సహించదు కదా..! అందుకే ప్రాధాన్యతలేని పోస్టుకు అతన్ని ట్రాన్స్‌ఫర్ చేశారని వస్తున్న ఆరోపణలు ఎంతమాత్రం సత్యదూరం కాదు.
2008లోనూ ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి వేధింపులపై పురాణ్ జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీన్నిబట్టి కులం వేర్లు అతన్ని ఏ విధంగా వెంబడించాయో అర్థం చేసుకోవచ్చు. పైగా అక్కడ జరిగే అవినీతి, అక్రమాలపై పురాణ్ ఉన్నతాధికారులను ప్రశ్నించేవాడని, అందుకే అతన్ని టార్గెట్ చేశారని జరుగుతున్న చర్చను అంత తేలిగ్గాకొట్టిపారేయలేం. భార్య అమనీత్‌కుమార్ కూడా ఓ ఐఏఎస్ అధికారిణి. తన భర్త మరణం సహజమైనది కాదని, కుల అవమానాలు, ఆధిపత్య వేధింపులే అతన్ని బలితీసుకున్నాయని విలపించిన తీరు దేశాన్ని కదిలించింది. ‘ఇద్దరు అధికారులు తన భర్తను ఏండ్లకొద్దీ టార్చర్ చేశారు. వారిని శిక్షించాలి’ అని వేడుకోవడం పోలీస్ వ్యవస్థలో మితిమీరిన వేధింపులకు అద్దం పడుతోంది. కులం ముప్పు నుంచి సాధారణ ప్రజలకే కాదు, న్యాయమూర్తులకు, పోలీసు అధికారులకూ మినహాయింపులు లేదనడానికి ఇంతకన్నా రుజువు ఏం కావాలి?
సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్ పై దాడి, ఐపీఎస్ అధికారి పురాణ్‌కుమార్ ఆత్మహత్య, ఘటనలు వేరు కావచ్చు కానీ, ఈ రెండింట్లో దాగి ఉన్న మూలం మాత్రం కులం. నేడు హిందూత్వ రాజకీయాలు ‘సనాతన’ ధర్మం అగ్రకుల దురహంకారానికి ఆజ్యం పోస్తూ..దళితులను అవమానిస్తూ వారిపై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. ”సామాజిక సమానత్వం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం ఒక చిత్తు కాగితమే” అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ఈ మాటలు ఇప్పుడు ఢిల్లీ అత్యున్నత న్యాయస్థానంలో, హర్యానా పోలీస్‌స్టేషన్ గోడలపై ప్రతిధ్వనిస్తున్నాయి. బీజేపీ పాలనలో కులం బలపడిన తీరును ఇవి ప్రతిబింబిస్తున్నాయి. పురాణ్ సూసైడ్ నోట్ ఆధారంగా చివరికి డీజీపీపై కేసు నమోదు చేశారు. కానీ విచారణ న్యాయంగా జరుగుతుందా? సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న అమనీత్ సంశయం కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. ఏమైనా కులానికి రక్షణ కవచంగా ఉండే అధికార యంత్రాంగం న్యాయాన్ని రక్షించలేకపోవడం సిగ్గుచేటు. అందుకే పురాణ్‌కుమార్ మృతదేహం ముందు ఈదేశపు పాలకగణం తలదించుకోవాలి.
కులం కింద నలిగిన చట్టం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES