– వామపక్షాలకు 90కి పైగా సీట్లు
– బీజేపీకి సున్నా : గోవిందన్ ధీమా
కొచ్చి : ఓట్ల లెక్కింపునకు నెల కంటే తక్కువ సమయం మిగిలి ఉండగా, కేరళంలో ఎల్డీఎఫ్ వరుసగా మూడవసారి అధికారాన్ని దక్కించుకుంటుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వీఎస్ గోవిందన్ తన నమ్మకాన్ని పునరుద్ఘాటించారు. యూడీఎఫ్ 100 సీట్ల మార్కును దాటుతుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటుండగా, గోవిందన్ కచ్చితంగా ఎల్డీఎఫ్ గెలవబోతుందని వివరించారు.ఎల్డీఎఫ్ ”90కి పైగా సీట్లు” గెలుచుకుంటుందని అన్నారు. బీజేపీ కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేక, ఖాతా తెరవడంలో విఫలమవుతుందని కూడా ఆయన గట్టిగా చెప్పారు.
ఆదివారం ఏకేజీ సెంటర్‌లో జరిగిన సీపీఐ(ఎం) కేరళం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎల్డీఎఫ్ శ్రేణులు నిర్వహించిన విస్తృత క్షేత్రస్థాయి ప్రచారమే తమ ధీమాకు కారణమని గోవిందన్ పేర్కొన్నారు. ”పోటీ తీవ్రంగానే ఉంది, కానీ ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం ఏమాత్రం లేదు,” అని ఆయన అన్నారు.
ఓటింగ్ శాతం పెరగడం అనేది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని, అది యూడీఎఫ్‌కు అనుకూలంగా మారుతుందని వస్తున్న వాదనలను ఆయన తిరస్కరించారు. అలాంటి అంచనాలు ”నిరాధారం” అని అభివర్ణించారు. ఓటర్ల జాబితాల ‘ప్రత్యేక విస్తృత సవరణ’ (సర్) ప్రక్రియ కారణంగా 94 నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య తగ్గిందని ఆయన గుర్తుచేశారు. ”తిరువనంతపురం నియోజకవర్గంలోనే అత్యధికంగా 47,647 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. 2021 ఎన్నికలతో పోలిస్తే, ఏకంగా 71 నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం తగ్గింది. 2021లో 2.09 కోట్ల మంది ఓటు వేయగా, ఇప్పుడు ఆ సంఖ్య స్వల్పంగా తగ్గి 2.08 కోట్లకు చేరింది,” అని ఆయన వివరించారు.
సర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై మైనారిటీ వర్గాల్లోని కొన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే ఆ అసంతృప్తి యూడీఎఫ్‌కు ఏమాత్రం ప్రయోజనకరంగా మారదని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ పనితీరును, అలాగే రాష్ట్రంలో ”మతతత్వ వ్యతిరేక వాతావరణం” బలపడటాన్ని ఉదహరిస్తూ… ప్రజలు పాలనలో కొనసాగింపునే కోరుకుంటున్నారని గోవిందన్ అభిప్రాయపడ్డారు. 2016 , 2021 అసెంబ్లీ ఎన్నికలు రెండింటిలోనూ ఎల్డీఎఫ్ 90కి పైగా సీట్లు గెలుచుకుందని గుర్తుచేసిన ఆయన, ఈసారి కూడా అదే ఘనతను పునరావృతం చేస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ”పోలింగ్ జరిగిన రోజే ప్రజలు తమ నిర్ణయాన్ని తీసుకున్నారు,” అని ఆయన వ్యాఖ్యానించారు. యూడీఎఫ్‌పై విమర్శలు గుప్పిస్తూ, గత ఎన్నికలలో ఫలితాలు వెలువడక ముందే ఊమెన్ చాందీ లేదా రమేష్ చెన్నితాల వంటి వారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీ నాయకత్వం ప్రణాళిక రచించిందని గోవిందన్ విమర్శించారు. ఈసారి యూడీఎఫ్ 100 సీట్లు దాటడంలో విఫలమైతే ”రాజకీయ వనవాసం” తీసుకుంటానన్న ప్రతిపక్ష నాయకుడు వి.డి. సతీసన్ గతంలో చేసిన వ్యాఖ్యను కూడా ఆయన చమత్కరించారు. ”ఆయన ఒక రాజకీయ నాయకుడు, ప్రజా జీవితంలో కొనసాగాలి. ప్రజలు అటువంటి వ్యాఖ్యలను క్షమిస్తారు,” అని గోవిందన్ అన్నారు.
ఎన్నికల నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఎన్నికల విధులకు కేటాయించిన ఎన్‌సీసీ, ఎస్‌పీసీ వాలంటీర్లతో సహా సుమారు 20,000 మంది సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని గోవిందన్ ఆరోపించారు. ”ఇలాంటి విషయమే ఇప్పుడు హైకోర్టులో ఉంది” అని ఆయన తెలిపారు.
బీజేపీ, యూడీఎఫ్ రెండూ ధనబలాన్ని మితిమీరి ఉపయోగిస్తున్నాయని ఆరోపిస్తూ, రాష్ట్రంలో నగదు పంపిణీ ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగాయని, ఇటువంటి పద్ధతులు సాధారణంగా ఉత్తర భారతదేశంలోని ఎన్నికలలో ఎక్కువగా కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.
కేరళంలో ఎల్డీఎఫ్ సర్కార్ 3.0
- Advertisement -
- Advertisement -



