Tuesday, February 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువామపక్షాలే దేశానికి భవిష్యత్తు

వామపక్షాలే దేశానికి భవిష్యత్తు

- Advertisement -

ప్రజాస్వామ్య వ్యవస్థకు బీజేపీ ముప్పు ‘సర్‌’ పేరుతో వ్యతిరేక ఓటర్ల తొలగింపు
ఐక్యతతోనే మతోన్మాదశక్తులను తిప్పికొట్టగలం
పార్లమెంట్‌ను అస్థిపంజరంగా మార్చిన కేంద్రం : ఖమ్మంలో సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపులో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

వామపక్షాలే దేశానికి భవిష్యత్తు అని, ఐక్యతతోనే మతోన్మాదశక్తులను తిప్పికొట్టగలమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. వామపక్షాలు ఐక్యంగా ఉంటే దేశంలో మూడో అతిపెద్దశక్తిగా ఎదగగలవని అభిప్రాయపడ్డారు. మతోన్మాద శక్తులను అడ్డుకోవడానికి, ప్రజల సమస్యలపై పోరాటానికి ఐక్యత అవసరం అని తెలిపారు. హిందుత్వ శక్తుల పెరుగుదల, మతతత్వ రాజకీయాలను ఎదుర్కోవటం కమ్యూనిస్టులకు ప్రధాన సవాల్‌గా మారిందన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపులో భాగంగా ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్‌లో మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ‘నేటి భారతదేశం- వామపక్షాల ముందున్న సవాళ్లు’ అంశంపై సెమినార్‌లో బేబీ ప్రసంగించారు. దేశానికి భవిష్యత్తు కమ్యూనిస్టులేనని.. దేశం ఎదుర్కొనే సవాళ్లకు దిశానిర్దేశం చేయగలిగేదీ వారు మాత్రమేనని స్పష్టంచేశారు.

సర్‌ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్ల తొలగింపు
దేశ వ్యాప్తంగా మైనార్టీలు, దళితులు, అణగారిన వర్గాలపై దాడులు జరుగుతున్నాయని బేబీ అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌్‌) ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బ తీస్తోందన్నారు. బీజేపీ, ఈసీ జట్టు కట్టి కుట్రపూరితంగా ‘సర్‌’ను అమలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికే ఓటర్ల జాబితా నుంచి బీజేపీ వ్యతిరేక వర్గాలను తొలగిస్తున్నారని తెలిపారు. బీహార్‌ సహా అనేక రాష్ట్రాల్లో లక్షలాది మంది ఓట్లను తొలగించారన్నారు. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) పేరుతో బీజేపీ తొలగింపు ప్రక్రియను చేపట్టిందని, కానీ అది స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రిమూవల్‌ ప్రక్రియగా మారిందని ఎద్దేవా చేశారు. నకిలీ ఓటర్లను జాబితాలో చేర్చకుండా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సర్‌పై ఎన్నికల కమిషన్‌తో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అమలు చేస్తున్న రాజకీయ ప్రణాళిక అని అన్నారు.

పార్లమెంట్‌ను అస్థిపంజరంగా మార్చిన బీజేపీ
నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌ను అస్థిపంజరంగా మార్చిందని బేబీ అన్నారు. పార్లమెంట్‌కు వెలుపలే నిర్ణయాలు జరుగుతున్నాయని చెప్పారు. రాజ్యాంగ విలువలను బీజేపీ తుంగలోతొక్కి ఫాసిస్టు విధానాలను అమలు చేస్తూ ఫాసిస్టు ఆర్‌ఎస్‌ఎస్‌గా మారిందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత దక్షిణ భారతదేశంలో మూడింట రెండొంతుల మెజార్టీ సాధించి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని బీజేపీ కలలుగంటోందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని లేకుండా చేయాలని కేంద్రం కుట్రపన్నుతోందని తెలిపారు. కార్పొరేట్ల కోసమే ఇటువంటి ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. వీబీ జీరామ్‌జీ పేరుతో కొత్త చట్టానికి రూపకల్పన చేసి గాంధీని మరిపించాలని చూస్తోంద న్నారు. అదే సమయంలో నిధుల కేటాయింపును తగ్గించేందుకు యత్ని స్తోందని తెలిపారు. రాష్ట్రాలు 40శాతం నిధులు ఈ చట్టానికి కేటాయించేలా కేంద్రం ఒత్తిడి తీసుకొస్తుందని తెలిపారు. మావోయిస్టు పార్టీల కార్యకర్తలను ఎన్‌కౌంటర్ల పేరుతో చంపటాన్ని నాగరిక సమాజం అంగీకరించదన్నారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలే తప్ప ఎన్‌కౌంటర్లు సరైన విధానం కాదన్నారు. ఇవి రాజ్యం చేస్తున్న హత్యలుగా పేర్కొన్నారు. భారత ప్రధాని దేశ ప్రయోజనాల కంటే అమెరికా, ఇజ్రాయిల్‌ లబ్ది కోసం ఎక్కువగా పనిచేస్తున్నారని విమర్శించారు. వామపక్షాలు మతోన్మాదానికి వ్యతిరేకం కానీ మతానికి కాదన్నారు. దీనిపై ఫాసిస్టు శక్తుల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వామపక్షాలు లేని దేశాన్ని ఊహించుకోలేమని, వామపక్షాలే దేశ భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొని సరికొత్త దిశగా దేశాన్ని అడుగులు వేయిస్తాయని అన్నారు.

వైరుధ్యాలు సృష్టిస్తున్న బీజేపీ
దేశంలో అసమానతలపై పోరాటాలు నిర్వహించాలని బేబీ సూచించారు. బీజేపీ భావజాల, రాజకీయ వైరుధ్యాలను సృష్టిస్తోందన్నారు. వెనిజులా, పాలస్తీనా పట్ల భారత విదేశాంగ విధానం సిగ్గుచేటని తెలిపారు. దేశ విదేశాంగ విధానాలు అమెరికా అహంకారం, వారి ఆధిపత్య ప్రయత్నాలకు అనుగుణంగా నిర్ణయించబడు తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి విషయంలో రాజీ పడుతోందని విమర్శించారు. పాలస్తీనాపై కొనసాగుతున్న దురాక్రమణను ఖండించారు. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌తో మోడీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు మన వ్యవసాయం, పరిశ్రమలను నాశనం చేస్తాయని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -