ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధాన్ని నిరసించాలి
ప్రజలను సమీకరించి ప్రతిఘటించాలి
మోడీ సర్కార్ అమెరికాకు లొంగి మన స్వతంత్రతకు నీళ్లొదిలింది :సీపీఐ(ఎం) సెమినార్‌లో ప్రకాశ్‌కరత్
అమరావతి :అమెరికా సామ్రాజ్యవాదానికి ఎదురొడ్డి మన దేశ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట వారసత్వాన్ని నిలబెట్టాలని సీపీఐ(ఎం) పూర్వ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కరత్ పిలుపునిచ్చారు. ఇరాన్‌పై అమెరికా – ఇజ్రాయిల్ దురాక్రమణ, నీతి బాహ్య, అనైతిక యుద్ధానికి నిరసనగా ప్రజలను సమీకరించాలని, వారి అభిప్రాయాన్ని కూడగట్టాలని అన్నారు. ఇరాన్‌పై అమెరికా – ఇజ్రాయిల్ సాగిస్తున్న దురహంకార దాడులను భారత ప్రభుత్వం ఖండించపోవడం అన్యాయం, అభ్యంతరకరమని తెలిపారు. అమెరికాకు సాగిల పడిన మోడీ ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరించి వారితో కలిసి ఎండగట్టాలని కోరారు. ’21వ శతాబ్దంలో సామ్రాజ్యవాదం – అంతర్జాతీయ పరిణామాలు’ అనే అంశంపై సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ శుక్రవారం ఎంబీ విజ్ఞాన కేంద్రంలో సెమినార్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సెమినార్‌ను ప్రకాశ్‌కరత్ ప్రారంభిస్తూ ‘ఇరాన్‌పై దాడి – అమెరికా, ఇజ్రాయిల్ సామాజ్యవాద దురహంకారం’ అనే అంశంపై ప్రసంగించారు.
ఆధిపత్యానికి సవాళ్లు
‘సోవియట్ రష్యా పతనమయ్యాక ఉదార ఆర్థికవాదం ఒక సిద్ధాంతం కింద ముందు కొచ్చింది. ఉదారవాద ఆర్థిక సంస్కరణలతో సామ్రాజ్యవాద దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఆ సంక్షోభంలో నుంచి బయట పడటానికి తిరిగి తృతీయ ప్రపంచ దేశాలను తమ మార్కెట్‌కు వలసలుగా మార్చుకొని దోపిడీకి ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో అమెరికా ప్రపంచ ఆధిపత్యంలోకొచ్చినా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనంలోకి చేరింది. మరో వైపు చైనా అన్ని రకాలుగా అభివృద్ధి చెంది అమెరికాను సవాల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకొనేందుకు వివిధ దేశాలపై సైనిక చర్యలకు, దురాక్రమణలకు పాల్పడుతోంది. ఇరాక్, లిబియా, సిరియాలలో జోక్యానికి ఒడిగట్టింది. వెనిజులా అధ్యక్షుడిని నేరుగా అరెస్ట్ చేసింది. పశ్చిమాసియాలో సామ్రాజ్యవాదాన్ని సవాల్ చేస్తున్న ఇరాన్‌ను అమెరికా టార్గెట్ చేసుకొని జాత్యహంకార ఇజ్రాయిల్‌తో కలిసి 28 రోజులుగా యుద్ధం చేస్తోంది.
ఈ దేశాలను ఇరాన్ గట్టిగా ప్రతిఘ టిస్తోంది. ఇరాన్ బలాన్ని అమెరికా ఊహిం చలేకపోయింది. హార్ముజ్ జలసంధి ద్వారా గల్ఫ్ దేశాల నుంచి చమురు రవాణాను ఇరాన్ అడు ్డకొనేసరికి ప్రపంచ దేశాలు చమురు కొరతతో అల్లాడు తున్నాయి. హార్ముజ్ జలసంధిని ఇరాన్ నుంచి విడిపించడానికి కలిసి రావాలన్న అమెరికా అభ్యర్థన పై నాటో, నాటో వెలుపల ఉన్న జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ముందుకు రాలేదు. చైనాకు చమురు కష్టాలు పెట్టాలనుకోగా ఆ దేశం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంది. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోంది. మరోవైపు రష్యా చమురు వ్యాపారం పెంచుకొని ఉక్రెయిన్ యుద్ధం వల్ల కలిగిన నష్టాలను పూడ్చుకుంటూ ఆర్థికంగా బలపడుతోంది. అమెరికా మాత్రం యుద్ధం వలన ఆర్థికంగా మరింత పతనమైంది.’ అని ప్రకాశ్‌కరత్ అన్నారు.
మోడీ ప్రభుత్వం లొంగుబాటు
‘యుద్ధం విషయంలో మన దేశం అవలంబిస్తున్న వైఖరి దారుణమైనది. ఇరాన్‌పై దాడి చేసి ఆ దేశ సుప్రీంలీడర్ ఖమేనీని హత్య చేస్తే కనీసం ఖండించలేదు. మనకు చిరకాల మిత్ర దేశంగా ఇరాన్ ఉన్నప్పటికీ, అమెరికాకు మోడీ సర్కారు కీలుబొమ్మగా వ్యవహరించింది. స్వతంత్ర విదేశాంగ విధానానికి తిలోదకాలిచ్చింది. దేశ స్వతంత్రతను కాపాడే విషయంలో అమెరికాకు లొంగుబాటును ప్రదర్శించింది. ప్రధాని మోడీ పర్యటనలో ఇజ్రాయిల్‌ను మిత్ర దేశంగా పేర్కొన్నారు. ఆ కొన్ని రోజులకే ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడులు మొదలయ్యాయి. మన దేశ చరిత్ర అంతా సామ్రాజ్యవాద వ్యతిరేకత కలిగినది. అమెరికా సామ్రాజ్యవాదంపై ప్రతిఘటనలో ఆ పోరాట స్ఫూర్తిని, వారసత్వాన్ని కొనసాగించాలి. ఆ వైపు ప్రజలను సమీకరించడమే ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం’ అని ప్రకాశ్ కరత్ చెప్పారు.
సెమినార్‌లో ‘సామ్రాజ్యవాదం – భారతదేశానికి ఎదురవుతున్న సవాళ్లు’ అనే అంశంపై నాగార్జున యూనివర్శిటీ ప్రొఫెసర్ అంజిరెడ్డి, ’21వ శతాబ్దంలో సోషలిజం’ అనే అంశంపై మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ‘భారత దేశంలో నయా ఫాసిస్టు ధోరణులు, ముంచు కొస్తున్న నిరంకుశ ప్రమాదం’ అనే అంశంపై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రసంగించారు. మార్కాపురం బస్సు ప్రమాదంలో మరణించిన వారికి సెమినార్ సంతాపం తెలిపింది. ‘అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ దాడులను ఖండిద్దాం, 7న క్యూబా సంఘీభావ దినం పాటిద్దాం’ అనే తీర్మానాన్ని ప్రజాశక్తి సంపా దకులు బి తులసీదాస్ ప్రతిపాదించగా సెమినార్ ఆమోదించింది. ప్రభాత్ పట్నాయక్ రాసిన ‘సామ్రాజ్యవాదం – ప్రపంచానికి ప్రమాదం’ అనే పుస్తకాన్ని సెమినార్‌లో ప్రకాశ్‌కరత్ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ప్రజాశక్తి ప్రచురించింది. కెఎస్ లక్ష్మణరావు పుస్తకాన్ని పరిచయం చేశారు. తొలుత ఆహ్వానితులకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి రాంభూపాల్ స్వాగతం పలికారు. ప్రజా నాట్యమండలి కళాకారులు గీతాలు ఆలపించారు.



