కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో తన మంద బలాన్ని ఉపయోగించి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎమ్.జి.ఎన్.ఆర్.జి.ఎ) స్థానంలో మరో బిల్లు తెచ్చింది. ఇప్పుడు ప్రతిపాదించిన ఈ బిల్లు ప్రస్తుతమున్న ఉపాధి హామీ చట్ట స్వభావాన్ని పూర్తిగా మార్చే స్తుంది. ఇదొక ‘హక్కుల చోరీ’ బిల్లు. ఈ బిల్లు నేరుగా గ్రామీణ పేద కార్మికుల హక్కులపై దాడిగా మాత్రమే గాక, రాజ్యాంగ చట్రంపై చేస్తున్న దాడిగా కూడా చూడాలి. ఆ కారణంగానే దీన్ని పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి తప్పనిసరిగా పంపాలి. రాజ్యాంగంలోని 41వ అధికరణం ఈ విధంగా చెబుతున్నది: ”రాజ్యం తనకున్న ఆర్థిక సామర్థ్యం, అభివృద్ధి పరిధిలో పని హక్కును పొందేందుకు కట్టుదిట్టమైన నిబంధనను ఏర్పాటు చేయాలి”.
ఆనాటి రాజ్యాంగ సభలో, ప్రాథమిక హక్కులలో పని హక్కును చేర్చాలని కోరుకునే సామ్యవాద ఆలోచనాపరులకు, దాన్ని వ్యతిరేకించే పెట్టుబడి దారుల లాబీకి మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు వచ్చాయి. చివరికి, పని హక్కును రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాల్లో కలిపారు. రాజ్యాంగంలో చెప్పిన ఆదేశిక సూత్రాలను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక ”నూతన లక్షణం”గా పేర్కొంటూ, ఈ ఆదేశికసూత్రాలు న్యాయస్థాన పరిధి కిందికి రావని చెబుతూ, వీటిని శాసనకర్తలైన పార్లమెంటు సభ్యులు ” ఆర్థిక ప్రజాస్వామ్యం కోసం ముఖ్యమైన సూచనలిచ్చే సాధనాలుగా” పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. సోషలిజానికి అనుకూలంగా ఉండే సభ్యుడు కె.టి.షా దీన్ని ఒక ”ధర్మబద్ధమైన కోరిక”గా వర్ణిం చారు. ఇన్ని సంవత్సరాల పెట్టుబడిదారీ పంధా ”అభివృద్ధి” తర్వాత కనపడు తున్న నిరుద్యోగం, ఉద్యోగ అవకాశాల నిరాకరణ ఆనాటి కె.టి.షా మాటలను ప్రతిధ్వనిస్తున్నాయి.
వామపక్షాల కీలకపాత్ర
ఐదున్నర దశాబ్దాల శ్రామిక వర్గ పోరాటం, దేశంలో జరిగిన నాటకీయ రాజకీయ పరిణామాలు విధానాలలో మార్పుకు కారణమైనాయి. ఆదేశిక సూత్రాలకు, ముఖ్యంగా పనిహక్కుకు చేరువ కావటా నికి ఏ మార్పు సహాయపడ్డది.2004లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ చేతిలో బీజేపీ ఓడిపోయింది. అయితే ప్రభుత్వం ఏర్పరచడానికి కావలసిన మెజారిటీ లేని యూపీఏకి రాలేదు. మొట్టమొదటిసారి వామపక్షాల మద్దతు మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన పరిస్థితి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపిఏకి ఏర్పడింది. ముఖ్యంగా గమనించా ల్సిందేమిటంటే సీపీఐ(ఎం) నాయకత్వంలో వామపక్షాలు తమ సొంత కార్యక్రమం, తమ సొంత బలం మీద ఆధారపడి ఎన్నికలలో స్వతంత్రంగా పోటీ చేశాయి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టం ఈ రాజకీయ లెక్కల వల్ల సాధ్యపడింది. 2005లో పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ చట్టానికి తుది రూపం ఇవ్వటంలో వామపక్షాలు కీలకపాత్ర పోషించాయి.
ఈ చట్టం పని హక్కును పాక్షికంగా గుర్తించింది. కనీస వేతనంతో, జాతీయ వనరులలో అధిక వాటాను పొందే నిబంధనను ఏర్పాటు చేయటం ప్రభుత్వ బాధ్యత అనని ఒప్పుకునేటట్టు చేసింది.అన్ని రాష్ట్రాలకు వర్తించే ఈ చట్టం గ్రామీణ ప్రాంత కుటుంబాలకు సంవత్సరంలో కనీసం వంద రోజులు పనిని గ్యారెంటీ చేసింది. స్వచ్ఛందంగా శారీరక శ్రమకు సిద్ధపడే వయోజనులందరికి (ఆడ, మగ) ఈ చట్టం పని చూపిస్తుంది. ముఖ్యంగా, ఇది వెసులు బాటు లేని చట్టంలాగా కాక, పని చూపించాలనే గ్రామీణ కుటుంబాలు డిమాండ్ మేరకు, పనిలో హెచ్చు తగ్గులకు అవకాశం వుంది. దీనిలో ఒక లోతైన ప్రజాస్వామిక సారాంశం వుంది.
గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పనిని కల్పించాలనే హక్కును కలిగివుంటూనే, ఈ చట్టం అంత కంటే మెరుగైన ఉపాధి దొరికితే గ్రామీణ కుటుంబం ఆ పనినే ఎంచుకోవచ్చు. పురుష, మహిళా శ్రామికులందరికి సమాన వేతనాన్ని ఈ చట్టం ఖాయం చేసింది. మొత్తం వేతనాలను కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ చట్టం కింద, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు పదిశాతం ఆర్థిక బాధ్యతను నెరవేరుస్తాయి. రాష్ట్ర అవసరాలను బట్టి ఏ పధకంలో ఏయే పనులు చేపట్టాలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించి, అమలు చేస్తాయి. తమ పరిధి కింద ఉన్న ప్రాంత అవసరాలకు అనుగుణంగా పథకాలను గుర్తించే హక్కు, బాధ్యత రెండూ గ్రామపంచాయతీలకు ఉంటుంది. పెట్టుబడిదారీ ప్రపంచంలో పనిని హక్కుగా డిమాండ్ చేస్తూ దేశమంతటా వర్తించే చట్టం బహుశా ఇదే మొదటిదేమో.
ప్రాధమిక లక్షణాలను మాయం చేయటం
నరేంద్ర మోడీ ప్రభుత్వం, తన పక్క వాద్యగాళ్లయిన, తెలుగుదేశం, జెడి(యు)లతో కలిసి పార్లమెంటులో ప్రవేశపెట్టిన ముసాయిదా బిల్లులో ఈ ప్రాధమిక లక్షణాలాన్నిటిని రద్దు చేసింది. పని ఇక ఏ మాత్రమూ డిమాండుగా అడిగేది కాదు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ”సాధారణ ఆర్థిక కేటాయిం పులు” బట్టి అది నిర్ణయమవుతుంది. ఇప్పుడు ఈ కొత్త బిల్లు కింద నిర్ణయించిన ఆర్ధిక కేటాయింపులు పరిమితి దాటితే, కేంద్ర ప్రభుత్వానికి ఆ పెరిగిన మొత్తం చెల్లించాల్సిన చట్టబద్ధమైన బాధ్యతేమీ ఉండదు. కేంద్ర పన్ను ఆదాయాలలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన వాటాను కేంద్రం అన్యాయంగా నిరాకరించడంతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాలకు, కొత్త బిల్లులో నలభై శాతం వాటా అంటే మరింత భారమే అవుతుంది. ఈ బిల్లుతో పథకం మొత్తం కేంద్రం చేతిలో కేంద్రీకృత మవుతుంది. ప్రాజెక్టును నిర్ణయించటం నుంచి డిజిటల్‌గా తనిఖీ చేయటం దాకా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోనే అంతా ఉంటుంది. ఈ కొత్త బిల్లు రాజ్యాంగంలోని సమాఖ్య స్వభావంపై సూటిగా దాడి చేస్తుంది.
గ్రామంలోని జమీందారుల పట్ల ఈ బిల్లు నిస్సిగ్గుగా తన వర్గ పక్షపాతాన్ని ప్రదర్శించింది. వ్యవసాయపనులు ముమ్మరంగా జరుగు తున్న సమయంలో పనులు చేపట్టటాన్ని ఈ కొత్త బిల్లు నిషేధించింది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగి, పని దినాలు దారుణంగా పడి పోయాయి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టం కింద, వ్యవసాయక పనులు లేనప్పుడు, లేక వ్యవసాయక పనులలో ఇచ్చే జీతం గ్రామీణ ఉపాధి చట్టం కింద చెల్లించే వేతనం కన్నా తక్కువగా ఉన్నప్పుడు కార్మికులు వ్యవసాయ ముమ్మర సమయంలో సైతం ఉపాధి హామీ చట్టాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. వ్యవసాయక పనుల కాలంలో ఉపాధి ప్రాజెక్టుల నిషేధం వలన గ్రామీణ కార్మికులు ప్రత్యామ్నాయంగా ఉపాధి హామీ చట్టం లేకపోవడంతో గత్యంతరం లేక భూస్వాముల షరతులకు అంగీకరించి పనిచేయాల్సి వస్తుంది.
దీనివలన వ్యవసాయ రంగంలో మహిళా కార్మి కులు పురుష కార్మికుల కన్నా తక్కువ వేతనాన్ని పొందుతారు. పనికి అర్హత, వేతనం కోసం ఆధార్ కార్డును అనుసంధానం చేయడం, పనికి హాజరైనట్టు ఆన్లైన్లో హాజరువేయటం చట్టబద్ధం చేశారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా ఉండని ఇటువంటి నిబంధనలతో కార్మికులు బాధితులుగా ఉన్నట్టు అనేక ఆధారాలు ఉన్నప్పటికీ దీనిని అమలు పరుస్తున్నారు. వికసిత్ భారత్ జి రామ్ జి బిల్లు-2025 అనే పొడుగు పేరుతో ఉన్న ఈ చట్టాన్ని సంక్షిప్తంగా జి రామ్ జి అని పిలవటం, మతం పట్ల విశ్వాసం గల వారిని మోసంచేయటానికి వేసిన నీచమైన ఎత్తుగడ. ఈ చట్టానికి వ్యతిరేకంగా కోట్లాదిమంది ప్రజలు ‘జి రామ్ జి ముర్దాబాద్’ అని నినదీస్తే, మతాభిమానుల మనోభావాలు దెబ్బతిని, అవి తిరిగి ప్రభుత్వానికే ఎదురుదెబ్బ కొట్టవచ్చు.
కష్టానికి ప్రతిరూపం
ఉపాధి చట్టం కింద పనిచేసే కార్మికులు ఎంత కష్టంతో కూడిన పనిని చేస్తుంటారో వారికోసం ఉద్యమించే మాలాంటి వారికి తెలుసు. కొందరి విషయంలో అయితే, మహిళలు ఉత్పత్తి నిబంధనలను చేరుకోవటానికి రోజుకి మూడు వేల కిలోగ్రాముల బురద (అడుసు)ను ఎత్తిపో యాల్సి ఉంటుంది. చాలా రాష్ట్రాలలో యాభైశాతానికి పైగా ఉపాధి హామీ చట్టం కింద పని చేయ టానికి సిద్ధపడు తున్నారంటే, అది నిస్సం దేహంగా తీవ్ర వ్యవసాయ సంక్షోభానికి, ఇంతకుమించి మెరుగైన ప్రత్యామ్నాయ ఉపాధి లేకపోవ టానికి ప్రతిరూపమే. దేశ జనాభాలో 8.6 శాతం దాకా ఆదివాసీలు ఉన్నారు. కానీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం కింద పని చేసే కార్మికులలో గతేడాది లెక్కల ప్రకారం పద్దెనిమది శాతం మంది, షెడ్యూల్ కులాల వారు పంతొమ్మిది శాతం మంది వున్నారు. అంటే, సామాజిక తరగతికి చెందిన కార్మికులలో మూడోంతుల మందిని రాజ్యాంగం ఆదరిస్తున్నది. అందుచేత ఈ హక్కు మీద ఎటువంటి దాడి జరిగినా అది రాజ్యాంగంపై దాడి కిందే లెక్క. చట్టం అమలులో వచ్చే సమస్య పరిష్కార/ సలహా సంఘాలలోనూ ఈ తరగతి ప్రాతినిధ్యాన్ని కొత్త ముసాయిదా చట్టం పూర్తిగా తొలగించింది.
2014 నుంచి నరేంద్రమోడీ ప్రభుత్వం మహాత్మాగాంధీ ఉపాధి చట్టాన్ని తక్కువచేస్తూ, నిధులకు కోత పెట్టింది. మరో వైపున కార్పొరేట్ కంపెనీలకు మాత్రం భారీ పన్ను మినహాయిపులు, రుణ మాఫీలు అందచేసింది. ఈ చట్టం ప్రారంభ దినాలలో రెండు కోట్ల ఇరవై లక్షల మంది కార్మికులు ఉంటే, ఇప్పుడు 7 కోట్ల 70 లక్షల మంది కార్మికులు ఉన్నారు. కానీ, దీనిపై పెట్టే ఖర్చును స్తంభింప చేయటమో లేక తగ్గించటామో చేశారు. అది ఎప్పుడూ జీడీపీలో 0.2 శాతానికి మించి లేదు. 2024-25లో ఎనిమిది కోట్ల తొంభై లక్షల మంది కార్మికులు ఈ చట్టం కింద పని ఇవ్వాలని డిమాండ్ చేస్తే, కేవలం 7 కోట్ల 90 లక్షల మందికే పని చూపారు.
99 లక్షల కార్మికులను వెనక్కి పంపారు. వేతన బకాయిలు కొండలా పెరుగుతున్నాయి- కొన్నిసార్లు ఎనిమిది వేల కోట్ల రూపాయలు దాకా బకాయిలు వున్నాయి. వంద రోజులు పని దినాలకు బదులు సగటున యాభైరోజులే పనిచూపారు. ఇప్పుడు చెపుతున్న ముసాయిదాలో 125 పని దినాలకు హామీ ఇవ్వటం అంటే అప హాస్యం చేయటమే. అయినప్పటికీ ఉపాధి హామీ పనులు జరిగే స్థలాలకు కార్మికులు ఇంకా వస్తూ వున్నారంటే కారణం ప్రత్యమ్నాయం లేకనే, గ్రామీణ పేదలు జీవితాలు అంతటి నిరాశ, అనిశ్చిత పరిస్థితులలో వున్నాయి. బతుకు తెరువుకు బలం చేకూర్చటం పోయి, దాన్ని కత్తి వేటుకు బలి చేస్తున్నారు నేటి పాలకులు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను నేలమట్టం చేస్తున్నారు. ఇలా చేస్తున్నందుకు ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి.
అనువాదం: కర్లపాలెం
(‘ది హిందూ’ ఇంగ్లీష్ దినపత్రిక సౌజన్యంతో )
బృందాకారత్



