1959లో విప్లవం విజయవంతమైన నాలుగు నెలల తర్వాత క్యూబాలో వ్యవసాయ సంస్కరణలు ప్రారంభమయ్యాయి. అప్పటి జనాభా కోటి లోపే. అమెరికా సామ్రాజ్యవాదుల మద్దతుతో క్యూబాలోని నియంతలు ఇక్కడి భూమిని కబ్జా చేసి, పంచదార పండించడంతోపాటు పశు పోషణకు ఉపయోగించేవారు. విప్లవం నాటికి దేశంలో 1.5 శాతంగా ఉన్న క్యూబా భూస్వాములు, ధనిక రైతుల వద్ద అక్కడి 46 శాతం సాగుకు అనుకూలమైన భూమి ఉండేది. లక్షా 50 వేల వ్యవసాయ కుటుంబాలు కౌలు రైతులుగా పనిచేసేవారు. రెండు లక్షల గ్రామీణ కుటుంబాలు భూమి లేకపోవడంతో రోజు కూలీలుగా పనిచేసేవారు. అత్యంత దారుణమైన పేదరికంలో వారు ఉండేవారు. క్యూబా సోషలిస్టు ప్రభుత్వం భూసంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అమెరికా దన్నుతో భూస్వాములు, ప్రభువులు దీనిని వ్యతిరేకించారు. మొదటి దశలో ఒక వ్యక్తికి 402 హెక్టార్లకు మించి ఉండకూడదని పరిమితి విధించారు. ఈ చర్యతో వేలాదిమంది కౌలుదారులు తాము వ్యవసాయం చేసుకుంటున్న భూమికి యజమానులయ్యారు. 1963లో మరో భూసంస్కరణను అమలు చేశారు. పట్టణ ప్రాంతానికి దూరంగా ఉన్న నీటిసౌకర్యం లేని, కనీసంగా 25 హెక్టార్ల భూమి, ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి ఇచ్చారు. ఆ భూమి ప్రభుత్వానిదా, ప్రైవేటుదా అనే అంశంతో సంబంధం లేకుండా పంచేశారు. తాము సాగు చేస్తున్న భూమి నుంచి తరిమివేయబడిన కౌలుదారులంతా యజమానులుగా మారిపోయారు. భూమిలేని నిరుపేద వ్యవసాయ కుటుంబాలకు తమ గ్రామానికి దగ్గరగానే భూమిలిచ్చారు. ప్రత్యేకంగా కోరుకుంటే వారికి మరోచోట ఇచ్చారు. విప్లవంలో భాగస్వాములైన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. భూమిని నష్టపోయిన వారికి బాండ్ల రూపంలో చెల్లించారు. సహకార సంస్థలుగా ఏర్పడి వ్యవసాయం చేసుకునే వారికి ప్రభుత్వం సహకారాన్ని అందించింది. వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు, సామగ్రి అన్నీ పేదలకు ఉచితంగా ఇచ్చారు. ఈ వ్యవసాయ సంస్కరణలకు తోడ్పడేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రేరియన్ రిఫార్మ్స్ అనే జాతీయ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
సమిష్టి వ్యవసాయం ఎలా చేస్తారు?
ఇక్కడ వ్యవసాయం సమిష్టిగా చేస్తారు. భూసారం, సాగు నీటి లభ్యతను బట్టి పంటలు పండిస్తారు. ఎక్కడ ఏ పంట వెయ్యాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వందల ఎకరాల భూఖండాల్లో ఒకే పంట సాగు చేస్తున్నారు. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు సరఫరా చేస్తారు. పనిముట్లు సొసైటీవే. రైతులు ఆ క్షేత్రాల్లో పని చేసినందుకు వేతనం పొందుతారు. పంట అమ్మాక డివిడెండ్ లభిస్తుంది. పనిని బట్టి స్త్రీ పురుషులందరికీ సమాన వేతనం ఇస్తారు. రోజుకు ఎనిమిది గంటల పని, ఆదివారం సెలవు.
సేంద్రియ సాగు దిశగా…
సోషలిస్ట్ దేశమైన క్యూబా ఆర్థిక వ్యవస్థ చక్కెర, పొగాకు, కాఫీ ఎగుమతిపై ఆధారపడి అభివృద్ధి చెందింది. ప్రసిద్ధ హవానా సిగార్లు పొగాకు వ్యవసాయానికి పునాది. చక్కెర, ఇథనాల్, రమ్ తయారీకి చెరకు పంట పునాది. 1990లలో సోవియట్ యూనియన్ పతనం తర్వాత తీవ్రమైన ఎరువుల కొరత ఏర్పడింది. ఈ పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచంలోనే అతిపెద్ద ‘అర్బన్ ఆర్గానిక్ ఫార్మింగ్’ (సేంద్రియ వ్యవసాయం) ప్రయోగాన్ని విజయవంతంగా అమలు చేసి ప్రపంచానికి ఒక నమూనాగా నిలిచింది. దీనిని ‘ఆర్గానోపోనికోస్’ (Organopnicos) అని పిలుస్తారు. క్యూబా వ్యవసాయరంగ ప్రగతిని మూడు ముఖ్య దశలుగా విభజించవచ్చు:
1. పారిశ్రామిక దశ (1959 – 1990) : విప్లవం తర్వాత, క్యూబా తన వ్యవసాయాన్ని సోవియట్ యూనియన్ సాయంతో ఆధునీకరించింది. దేశంలో ఎక్కువ విస్తీర్ణంలో చెరకు (ూబస్త్రaతీషaఅవ) మాత్రమే పండించేవారు. దీనిని సోవియట్ దేశాలకు ఎగుమతి చేసి, ప్రతిగా ఆహారం, చమురు, ఎరువులను దిగుమతి చేసుకునేవారు. ఈ కాలంలో రసాయన ఎరువులు, ట్రాక్టర్లు, భారీ యంత్రాల వాడకం ఎక్కువగా ఉండేది.
2. సేంద్రియ విప్లవం (1990 – 2010) : సోవియట్ యూనియన్ పతనం తరువాత నెలకొన్న ఆహార సంక్షోభం నుంచి బయటపడ్డానికి క్యూబా ‘హరిత విప్లవం’ వైపు మళ్లింది: నగరాల్లోని ఖాళీ స్థలాలను, పాత భవనాల శిథిలాలను సాగు భూమిగా మార్చారు. రసాయనాలు లేకుండా కేవలం కంపోస్ట్ ఉపయోగించి కూరగాయలు పండించడం ప్రారంభించారు. హవానా నగరానికి అవసరమైన 90% తాజా కూరగాయలు ఈ పట్టణ తోటల నుండే ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నమూనా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందడంతోపాటు సమర్ధిస్తూ… సినిమాలు సైతం వచ్చాయి. ట్రాక్టర్లకు డీజిల్ లేకపోవడంతో, రైతులు తిరిగి సాంప్రదాయ పద్ధతుల్లో ఎద్దులతో పొలం దున్నడం ప్రారంభించారు. పురుగుమందులకు బదులుగా మిత్ర పురుగులు, ప్రకృతి సిద్ధమైన ద్రావణాలను వినియోగించారు.
3. ప్రస్తుత సవాళ్లు, సంస్కరణలు (2011 – 2026) : ప్రస్తుతం క్యూబా తన వ్యవసాయ విధానాల్లో మరింత స్వేచ్ఛను ఇస్తోంది: ప్రభుత్వ భూములను కౌలుకు రైతులకు ఇస్తోంది. రైతులు తమ కోటాను ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత, మిగిలిన పంటను మార్కెట్లో అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. ఇక్కడ చెరకుతోపాటు కూరగాయలు, దుంపలు, పొగాకు అధికంగా పండిస్తారు. ఇతర దేశాల నుంచి దిగుమతులను ‘ఆహార సార్వభౌమాధికారం’ (Food
Sovereignty) చట్టాలను తెచ్చారు.
అమెరికా ఆంక్షల వల్ల యంత్రాలు, డీజిల్ దొరక్కపోవడం క్యూబాకు నష్టం చేసినప్పటికీ, అది వారిని ప్రపంచంలోనే అత్యంత స్థిరమైన వ్యవసాయం చేసేలా పురికొల్పింది. నేడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు క్యూబాలోని ఆగ్రో-ఎకోలజీ (Agro-ecology) పద్ధతులను అధ్యయనం చేస్తున్నారు.
– పి.త్రిమూర్తులు



