– 15 రోజుల కిందే రాశా..
– కార్యకర్తల అభిప్రాయాలే చెప్పాను
– సొంత ఎజెండా ఏమీ లేదు
– కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దయ్యాలు
– పార్టీలో కోవర్టులు ఉన్నారు
– లేఖ బహిర్గతం వెనుక ఎవరున్నారో తెలియాలి : ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ-శంషాబాద్
పార్టీలో నెలకొన్న పరిణామాలు, వరంగల్‌లో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభలో పాజిటివ్, నెగటివ్ అంశాలపై మాజీ సీఎం కేసీఆర్‌కు తనే లేఖ రాసినట్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. 15రోజుల కిందటే ఆ లేఖ రాసినట్టు చెప్పారు. అయితే ఆ లేఖ బహిర్గతం కావడం పట్ల కుట్ర దాగి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ రెండ్రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. అయితే ఇటీవల కవిత అమెరికాకు వెళ్లారు. తిరిగి ఆమె శుక్రవారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి, కేసీఆర్‌కు రాసిన లేఖపై కవిత స్పష్టత ఇచ్చారు. తను రాసిన లేఖపై తీవ్రంగా చర్చ జరుగుతుందని.. అయితే ఆ లేఖ తానే రాసినట్టు ఒప్పుకున్నారు. ఇటీవల తాను సగం తెలంగాణ తిరిగినట్టు చెప్పారు. ఆయా సందర్భాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు చెప్పిన విషయాలనే లేఖలో పొందుపరిచినట్టు తెలిపారు. ఈ లేఖలో తన సొంత ఎజెండా ఏమీ లేదని, ప్రతి మీటింగ్ జరిగినప్పుడు కేసీఆర్‌కు లేఖ రాస్తానని చెప్పారు. అందులో భాగంగానే ఈసారి కూడా రాసినట్టు తెలిపారు. ఈ లేఖలో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. అయితే ఎప్పుడూ లేనిది.. ఈసారి లేఖ బహిర్గతం అయింద న్నారు. కేసీఆర్ కూతురినైనా తాను అంతర్గతంగా రాసిన లేఖ బయటకు వస్తే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో ఆలోచించాలన్నారు. దీనిపై పార్టీలో కూడా చర్చ జరగాలని తెలిపారు. పార్టీలో తనపై కుట్ర జరగుతోందని ఇటీవల ప్రెస్‌మీట్‌లో కూడా చెప్పినట్టు గుర్తు చేశారు. పార్టీలో కోవర్టులు ఉన్నారని చెప్పారు. కేసీఆర్ దేవుడని, కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. లేఖ బహిర్గతం వెనుక ఎవరున్నారో తెలియాలన్నారు. వారి వల్ల పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతోందన్నారు. వారిని పక్కన పెట్టి, పార్టీలో ఉన్న చిన్న చిన్న లోపాలను సవరించుకుంటే.. పార్టీ పది కాలాల పాటు చల్లగా ఉంటుందని తెలిపారు. తమ నాయకుడు కేసీఆరేనని, ఆయన నాయకత్వంలోనే తెలంగాణ బాగుంటుందన్నారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపై ద్వేషం కానీ ప్రేమ కానీ లేదన్నారు. తమ కుటుంబంలో, పార్టీలో ఎలాంటి విభేధాలు లేవని చెప్పారు. లేఖ బహిర్గతం కావడం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు సంబురపడుతున్నాయని, బీఆర్‌ఎస్ ఆగమైనట్టు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదని, అవి పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. ఇదిలా ఉంటే కవిత అమెరికా నుంచి వస్తోందన్న విషయం తెలుసుకున్న జాగృతి నేతలు, బీసీ నాయకులు పెద్దసంఖ్యలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కవితకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు.
లేఖ నిజమే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES