Saturday, January 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంశ్రామిక మహిళల్లో నాయకత్వ స్థాయి పెరగాలి

శ్రామిక మహిళల్లో నాయకత్వ స్థాయి పెరగాలి

- Advertisement -

అందుకు ఐద్వా కీలకపాత్ర పోషించాలి : ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర
సమస్యలపై పోరాడకుండా మహిళలపై సమ్మోహాస్త్రంగా సోషల్‌మీడియా
నిద్రావస్థలోని మహిళలను వెన్నుతట్టి చైతన్యపర్చాలి : కాళోజి అవార్డు గ్రహీత నెల్లుట్ల రమాదేవి
మహిళా హక్కుల సాధనలో ఐద్వా కృషి.. జాతీయ మహాసభలను జయప్రదం చేయండి : మల్లు లక్ష్మి
ఐద్వా, తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో ఎస్వీకేలో కవి సమ్మేళనం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
శ్రామిక మహిళల్లో నాయకత్వ స్థాయి పెరగాలనీ, ఆ స్థానానికి ఎదిగేలా చైతన్యం కల్పించడంలో ఐద్వా కీలక పాత్ర పోషించాలని ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర ఆకాక్షించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితీ, ఐద్వా ఆధ్వర్యంలో మహిళా సాధికారత అనే అంశంపై కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్‌కే. సలీమా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జూపాక సుభద్ర మాట్లాడుతూ…దేశంలో అతి పెద్ద మహిళా సంఘం ఐద్వా అని చెప్పారు. మొట్టమొదటి మహిళా సభలో అచ్చమాంబ, సూర్యావతి, మోటూరు ఉదయం కీలక పాత్ర పోషించారని తెలిపారు.

కష్టజీవుల గుండెకాయ కమ్యూనిస్టు పార్టీలన్నారు. తాము ఇండ్లలో నుంచి బయటకు రావడానికి కమ్యూనిస్టు పార్టీ ఎంతో కృషి చేసిందని ఆనాటి మహిళలు చెప్పేవారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అణగారిన వర్గాల మహిళలు ఎంతో మంది పాల్గొన్నారనీ, వారి చరిత్రను మరింత వెలికి తీయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. మహిళలు చట్టసభల్లో అడుగు పెట్టడానికి ఐద్వా చేసిన కృషి చేసిందనీ, మల్లుస్వరాజ్యం, మానుకొండ సూర్యావతి, తదితరులు ఎమ్మెల్యేలుగా ఎన్నియ్యారని గుర్తుచేశారు. అట్టడుగు, వెనుకబడిన సామాజిక తరగతుల వాళ్లు నాయకత్వ స్థాయికి ఎదగడానికీ, చట్టసభల్లోకి పంపడానికి ఐద్వా కృషి మరింత పెరగాలని ఆకాంక్షించారు. ఏ మహిళకు అన్యాయం జరిగినా అండగా ఉంటామనే భరోసాను ఐద్వా ఇస్తోందన్నారు. ఐద్వా జాతీయ ఉపాధ్యక్షులు పుణ్యవతి మాట్లాడుతూ..కవి, ప్రవక్త కాలం కంటే ముందుంటారని చెప్పారు. మహిళా పోరాటాలకు కవుల సహకారం కావాలని కోరారు.

కాళోజి అవార్డు గ్రహీత నెల్లుట్ల రమాదేవి మాట్లాడుతూ..మహిళలు తమ సమస్యలపై పోరాడకుండా సోషల్‌మీడియా సమ్మోహాస్త్రంగా పనిచేస్తున్నదనీ, ఆ మత్తులోకి మహిళలు కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 80 నుంచి 90 శాతం మంది మహిళలు నిద్రావస్థలో ఉన్నారనీ, వారిని వెన్నుతట్టి లేపి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఐద్వాపై ఉందని చెప్పారు. గృహహింస బాధితుల పక్షాన నిలబడి మరింత పోరాడాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తుల మీద ఆధారపడి బతికే పరిస్థితి లేదనీ, భూములన్నీ రియల్టర్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో వలసలు పెరుగుతున్నాయని వివరించారు. వ్యవసాయాన్ని నడిపిస్తున్నది మహిళలే అని చెప్పారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లా డుతూ.. తమ సంఘం జాతీయ మహాసభలను జయ ప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, సమాన త్వం, స్త్రీ విముక్తి కోసం తమ సంఘం పనిచేస్తున్నదని తెలిపారు. స్త్రీలకు ఓటు హక్కు, సమానపనికి సమాన వేతనం, బాల్యవివాహాల నిషేధ చట్టం కోసం ఐద్వా చేసిన పోరాటాలను ప్రస్తావించారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు కావాలనీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రత్యేక సీట్లు కావాలనేనే అంశాలపై అసెంబ్లీ వేదికగా మల్లు స్వరాజ్యం ప్రస్తావించి విజయం సాధించిందని గుర్తుచేశారు. తండ్రి ఆస్తిలో ఆడబిడ్డలకు వాటా, సారా వ్యతిరేక ఉద్యమాల్లో ఐద్వా కృషిని వివరించారు.

ప్రముఖ రచయిత్రి గోగు శ్యామల మాట్లాడుతూ.. దేశాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద దరిద్రం కులం, మహిళా వివక్ష అని చెప్పారు. మహిళలు ఓపెన్‌ మైండ్‌తో ఆలోచించి పనిచేస్తే ఏడెనిమిది ఏండ్లలో మెరుగైన రాజకీయ అవకాశాలను దక్కించుకోవచ్చునని తెలిపారు. మైండ్‌ గేమ్‌ రాజకీయాలు నడుస్తున్న కాలంలో అంతే చైతన్యంతో మహిళలు మందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహిళల పక్షాన ఐద్వా నికరంగా పోరాడుతున్నదన్నారు. అనంతరం నస్రీన్‌ఖాన్‌ అధ్యక్షతన కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. 30 మందికిపైగా కవులు, కవయిత్రిలు మహిళా సాధికారతపై కవితలు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.అరుణజ్యోతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బుగ్గవీటి సరళ, ప్రముఖ కవి, ఆలిండియా రేడియో వ్యాఖ్యాత ఐనంపూడి శ్రీలక్ష్మి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత మెర్సి మార్గరెట్‌, ప్రముఖ కవులు షెహనాజ్‌ బేగం, విశ్వైక, రేఖ, నస్రీన్‌ఖాన్‌, రూపారుక్మిణి తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి ఆనందాచారి, కోశాధికారి మోహన్‌కృష్ణ, నగర సహాయ కార్యదర్శి శరత్‌ సుదర్శి, అజయ్, హరిప్రియ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -