Monday, November 3, 2025
E-PAPER
Homeదర్వాజవెలుగునీడల జీవన ప్రస్థానం

వెలుగునీడల జీవన ప్రస్థానం

- Advertisement -

అనేక ఉద్యమాలను ప్రభావితం చేసినది, అనేక ఉద్యమాలతో ప్రభావితమైనది తెలుగు కవిత్వం. కాలంతో పాటు నలిగిన దారుల్లో నడిచే కవులు కొందరైతే,కొత్త దారులను తీర్చి కవిత్వాన్ని కవి సమాజాన్ని మలుపు తిప్పే వారు కొందరు. ప్రధానంగా అది ప్రక్రియ, అభివ్యక్తి, రూప వైవిధ్యంతో కూడి ఉంటుంది. కొన్ని ప్రక్రియలు సాహిత్యంలో ఉద్యమ శీలతను పొంది కవిత్వం గాఢతను పెంచాయి. ప్రక్రియ ఏదైనా వస్తువు ప్రధానం. ఆ వస్తువుకు ఆధారం సమాజం. పాదు కవి హృదయం. అభివ్యక్తి,రూపం మాత్రమే కవి ప్రతిభ చేత నిర్మాణమవుతుంది. అలా అభివ్యక్తి, రూప ప్రక్రియల చేత వర్తమాన కాలంలో కవి సమాజాన్ని పాఠకులను అమితంగా ప్రభావితం చేసిన, చేస్తున్న కవి ఆచార్య ఎన్‌.గోపి గారు. వారి నుండి రెండు దశాబ్దాల క్రితం పురుడు పోసుకున్నది ‘నానీ’ ప్రక్రియ.ఈ ప్రక్రియలో ఇప్పటికి సుమారు ఐదు వందల కవితా సంపుటాలు వెలువడి,పాత కొత్త తరాలతో కవిత్వం రాయిస్తూ ఒక ఉద్యమంగా సాగుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఈ ఉద్యమంలో మరో సరికొత్త కెరటం ‘కంచనపల్లి రవికాంత్‌’ ‘నానీ కిరణాలు’.

కవితాత్మతతో కూడిన అభిభాషణం రవికాంత్‌ ప్రత్యేకత. ఈ లక్షణం అతనిలో విద్యార్థి దశ నుండే ఉంది. మూడు దశాబ్దాలు గడిచినా అతనిలోని కవితాశక్తి నానీ కిరణాలు ”సంపుటితో” కస్తూరి భరిణ ”ను ఒక్కసారిగా తెరిస్తే పరిసరాలను ముంచెత్తిన పరిమళాన్ని గుర్తుకు తెస్తుంది. ఇందులో విద్య, రాజకీయం, వ్యవసాయం, సాంకేతిక, తాత్వికత….ఇలా అనేక అంశాలు దర్శనమిస్తాయి. ఆలోచింపచేస్తాయి. ఉపాధ్యాయుడైన రవికాంత్‌ బోధన సమయంలో మాత్రమే ఉపాధ్యాయుడు. ఆటపాటల సమయంలో విద్యార్థుల్లో ఒకడు. వారితో అంత సామీప్యంగా, సాన్నిహిత్యంగా ఉండడం చేత వారి ప్రతి కదలికకు అనుభూతి చెందుతాడు. కవిగా స్పందిస్తాడు. దానికి ఉదాహరణ ఈ నాని.

”ఇంద్రధనస్సులు/ ఎక్కడో లేవు/ బడి పిల్లల/ నవ్వుల్లో చూడండి” (పు :11) ఇలా తన విద్యార్థుల్లోని ఆనంద క్షణాలను కవితా కిరణాలుగా ఒడిసి పట్టుకుని వారి నవ్వుల్లో ఇంద్రధనస్సులను దర్శించి, కవిగానే కాక ఉపాధ్యాయుడిగా ఎంతో ఔన్నత్యాన్ని ప్రదర్శించారు. వందల ఏళ్లుగా భారత సమాజం కుల విభజనతో అనైక్యతకులోనై విద్యాభివద్ధి కారణంగా ఆ ఆన వాళ్లను వదిలించుకుంటున్న తరుణంలో, నేటి విద్యావ్యవస్థలో కుల, మత ప్రాతిపదికన వెలసిన గురుకులాల పట్ల, సమాజం పట్ల బాధ్యతగల కవిగా, ఉపాధ్యాయుడిగా కలవరపాటు చెందుతాడు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ…

”పాఠశాల విద్య/ కులాలవారిగా/ గురు ‘కులాలు’ నేర్పేది ఇదేనా?” (పు :24) అంటూ ప్రశ్నిస్తాడు.ఎవరిని అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమాజం వదిలించుకుంటున్న అమానవీయ సంకెళ్లను ఇలాంటి గురుకులాల ద్వారా తగిలించడం పట్ల ఆవేదన చెందుతున్నాడు. అక్కడ కుల వివక్ష నేర్పుతున్నారని కాదు కవి భావన. మేము ఫలానా, మిగతా సమాజంలో మేము వేరు అన్న భావం లేత మనసుల్లో నాటుకుంటుంది కదా! అన్నది కవి బాధ, ఆలోచన. గురుకులాల ఉద్దేశం ఉన్నతమైనదయినా నిర్మాణం పట్ల తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పాడు.
భారతదేశంలో రాజకీయం,డబ్బు విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉండడం అందరికీ తెలిసిందే.డబ్బున్నవాడే రాజకీయాలలో రాణించి పదవులు పొందడం,పదవులు అనుభవిస్తున్న కొద్ది వాటిని స్థిరపరచుకునే ఉద్దేశంతో డబ్బును అక్రమార్గాలలో పోగేసుకోవడం,ఎక్కడ పదవి,అవకాశం ఉంటే అక్కడికే గెంతడం మన కొంతమంది నాయకులు ఒంటబట్టించుకున్నారు .ఇలాంటి వారికి…..
”ఊసరవెల్లి జాతి/ అంతరించిపోతుంది/ రాజకీయులను/ తట్టుకోలేక” (పు :34) అంటూ వ్యంగంగా చురకలంటించాడు.

ప్రజలను పాలించే ప్రజా ప్రతినిధుల ఇళ్లల్లో కరెన్సీ కట్టలుంటే ప్రజా హదయాలను పాలించే కవుల ఇళ్లల్లో మాత్రం కవిత్వం కట్టలుంటాయని చెప్పారు. డబ్బు ఒక కుటుంబానికి పరిమితం. కవిత్వం సమాజపు ఉమ్మడి ఆస్తి.ఇలా కవితా శక్తిని సమాజ పరం చేస్తూ ఉన్నతీకరించాడు రవికాంత్‌. ఎప్పటికైనా కరెన్సీ కన్నా పుస్తకాలే గొప్పవని మరో సందర్భంలో… ”కరెన్సీ కూడా/ ఔట్‌ డేటెడ్‌/ కాలపరిమితి లేనివి/ పుస్తకాలే” (పు :44) అంటూ తీర్మానిస్తాడు. సాంకేతికంగా ఎంత అభివద్ధి చెందిన పుస్తకాల స్థానాన్ని మరేవి పూరించలేవు. కరెన్సీ స్థానాన్ని మాత్రం ఆన్లైన్‌ బదిలీలు ఆక్రమించడం చూస్తున్నాం. అంతర్జాలంలో ఎంత సమాచారం దొరికినా పి.డి.ఎఫ్‌ లు దొరికినా,ఆడియో బుక్కులు విన్నా పుస్తకం చదివిన అనుభూతికి మరేదీ సాటిరాదన్న సత్యాన్ని కవి కాంత్‌ వ్యక్తం చేశాడు.

స్త్రీని ఎవరు ఎంతలా ఎన్ని వేదికల మీద కీర్తించినా ఆమె స్థానాన్ని పరిధిని కుంచింప చేస్తూనే ఉంది ఆదిపత్య పురుషలోకం.నేటికీ ఆమె పట్ల వివక్ష వివిధ రూపాలలో కొనసాగుతూనే ఉంది. అదే విషయాన్ని…. ”ఆకాశంలో సగం/ ఆమె/ నిజానికి/ రెండు సగాలు అతడే.” (పు:25) అన్న నానీ ద్వారా ఏ కోణంలోనైనా స్త్రీల సమస్యలను విశ్లేషించడానికి అవసరమైన విస్తతిని అందించడం కవి రవి శక్తికి నిదర్శనం. కవిలోని అసలైన ప్రతిభ, ఔన్నత్యం భౌతిక విషయాలను వర్ణించినప్పుడు కాక తాత్విక విషయాలను కవిత్వీకరించినప్పుడు బహిర్గతమవుతుంది. తత్వం ఎత్తైనది విశాలమైనది. లోతైనది గంభీరమైనది.అట్లాంటి విషయానికి తగిన అభివ్యక్తి జరిగినప్పుడు పాఠకుడిలో మానవ స్వభావ పరిణతిని పెంచుతుంది. ”ఉమ్మనీరు/ సృష్టి జలం/ తులసి నీరు/ చిట్టచివరి సలిలం” (పు :13) ఉమ్మనీటిలో బిందురూపంగా చైతన్యం పొందిన జీవి ఊపిరి వదిలి నిస్తేజంగా మారే ప్రస్థానంలోని వెలుగునీడల కిరణాలను ఎన్నింటినో దర్శింపజేసిన మరో నానీల కవి రవికాంత్‌ నానీలు మళ్లీ మళ్లీ చదువు తగ్గవి.

  • డా|| దాసోజు జ్ఞానేశ్వర్‌, 9912138152
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -