ముగ్గురు కథక మిత్రుల ఉమ్మడి సొత్తు ‘మూడు పాయలు’ కథా సంకలనం. ‘సిద్ధిపేట’ కు చెందిన పర్కపెల్లి యాదగిరి, వంగర నరసింహారెడ్డి కొండి మల్లారెడ్డి గార్లు వెలువరించిన కథాసంకలనమిది. ఇందులో ఒక్కో కథకునివి నాలుగు కథల చొప్పున మొత్తం పన్నెండు కథలున్నాయి . ముగ్గురు మూడు ఉపనదుల వంటి వారన్న ఆలోచనతో వారీ శీర్షికను ఎంచుకోవడం ద్వారా తమ లోకజ్ఞాతను పాఠకులకు ఎత్తి చూపినట్టుగా వుంది.
కథకులే తమను తాము స్థిరీకరించుకున్న వరుస క్రమంలో మొదటి కథకుడైన యాదగిరి గారి నాలుగు కథల్లో మొదటి కథ పేరు ”బల్లిపాతర”.
‘బల్లిపాతర’ అంటే!? ఓ ‘పచ్చనాకు’ కు పట్టిన బూజు అని అర్ధమట! ఆ బూజు పట్టిన ఆకు ఎట్టి పరిస్థితిలోనూ తిరిగి కోలుకోవడముండదు. అదేవిధంగా మనిషనే పచ్చనాకుకు తాగుడనే బూజుపడితే అతను అర్ధాంతరంగా తనువు చాలించడమే తప్ప, మనిషిగా కోలుకోవడం జరుగదన్న గొప్ప సందేశాత్మకమైన శీర్షికను ఈ కథకు వుంచడం ద్వారా కథకుడు యాదగిరి సగం విజయాన్ని తన ఖాతాలో జమచేసుకున్నట్టయ్యింది.
ఈ కథలోని ప్రధాన పాత్ర యాదవ్వ. ఆవిడ పాఠశాలకు వెళ్ళి మంచిగా చదువుకుంటున్న ఇద్దరు ఆడపిల్లల తల్లి. యాదవ్వ తన రెక్కల కష్టంతోనే ఆ పిల్లలను చదివిస్తుంటుంది. భర్త నాగరాజు మార్కెట్లో హమాలీ పని చేస్తుంటాడు. సహజంగా హమాలీలు సాయంత్రం అవుతూనే పని మీద నుండి దిగి, నేరుగా కళ్ళు లేదా బ్రాందీ దుకాణం దగ్గరికెళ్లి ఇంత తాగి, ఇంటికెళ్ళి వేడి నీళ్లతో స్నానంచేసి, ఇల్లాలు పెట్టిందేదో తిని మెదలకుండా పడుకుంటారు. కానీ కొంతమంది మెలమెల్లగా ఆ తాగుడికి బానిసలైపోతారు. తాగొద్దని భార్యాబిడ్డలు ఎన్నివిధాలుగా చెప్పినా అతనా తాగుడు మానలేక పోతుంటాడు. ఈ కథలో యాదవ్వ భర్త నాగరాజు పరిస్థితి కూడా అటువంటిదే.
ఒంటి మీద, ఇంటి మీద ధ్యాస వదిలేసిన నాగరాజు కారణంగా శక్తికి మించి శ్రమించడంవల్ల, కడుపుకు సరైన తిండిలేక యాదవ్వకు టి.బి. సంక్రమిస్తుంది. ఆ విషయం తెలిసిన రోజున నాగరాజు ‘తను ఎట్టి పరిస్థితిలోనూ రేపటి నుండి తాగ’నని పిల్లల మీద ప్రమాణం చేసి కూడా తాగుతాడు. కానీ, పిల్లల కిచ్చిన మాట తప్పానన్న నేరభావంతో చెట్టుకు ఉరివేసుకుని చచ్చిపోతాడు.
ఈ కథ ద్వారా కథకుడు ఇప్పటి సమాజానికి అవసరమైన ఓ సందేశాన్ని, తెలంగాణా ముఖ్యంగా సిద్ధిపేట ప్రాంతపు మాండలీకానికి, తన జీవిత పరిశీలనను జోడించి తనదైన బాణీలో అద్భుతంగా చెప్పుకొచ్చారు.
జానకమ్మ కున్న ఇద్దరు బిడ్డలకు పెండ్లిల్లు అయిపోయి అత్తవారిండ్లకు వెళ్ళిపోతారు. కొన్నాళ్ళకు జానకమ్మ అనారోగ్యం పాలై ఇంట్లోనే వుండిపోతుంది. ఐతే, ఇంటి అవసరాలకోసం సిరామిక్ కంపెనీ యజమాని శేఖరయ్యతో మాట్లాడి సక్కును వాళ్ళ ఆఫీస్ ఊడ్చి, మంచినీళ్లు పెట్టే పనిలో పెడుతుంది.
కొన్నాళ్ళ తరువాత శేఖరయ్య ఒకరోజు ఆ అమ్మాయి నడవడిక బాగాలేదని, దాని వల్ల తమ కంపెనీకి చెడ్డపేరొస్తుందని చెప్పి సక్కును కంపెనీలో పనికి రానివ్వడు.పాత బాకీ కింద చూసుకొని, చేసిన నెల జీతం ఇవ్వకుండా వెళ్లగొడతాడు. ఆ తర్వాత ఆమె పడ్డ కష్టాలు, తన కళ్లముందే శేఖరయ్య చనిపోవడంతో అన్నీ కథాపరంగా నడిపిస్తారు.
ధన, మద, సామాజిక, ఆర్ధిక, రాజకీయ అహంకారంతో విర్రవీగిన వ్యక్తి అంతిమ సంస్కారంలో కూడా పాత్ర వహించినట్టుగా భావించిన కథకుడు పాంచభౌతిక దేహ విచ్ఛిత్తి తరువాత ఏ మూలకం దానిలో వినీలమై పోతుందన్న దానికి ప్రతీకగా కథకుడు యాదగిరి ఈ కథకు ‘ఐదు దోసిల్ల మన్ను’ అనే సామెతను ఊతంగా చేసుకొని ఒక తాత్వికమైన భావనతో బిగువైన కథను అందించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.
సంకలనంలో మరో కథకుడు కొండి మల్లారెడ్డి గారు. వీరి కలం నుండి ఇప్పటి వరకు పలు కవితా సంకలనాలతో పాటు పన్నెండు కథలు వివిధ పత్రికలలో ప్రచురింప బడ్డాయి.
సంకలనంలో వారి కథలు నాలుగూ నాలుగు విభిన్నమైన కథలే కావడం విశేషంగా చెప్పుకోవాలి. వీరి కథల్లో తను ఎంచుకున్న కథా వస్తువు పేరాలు, పేరాలుగా పాఠకులను చిరుగాలి తరగల మాదిరిగా స్పర్శిస్తూ.. వారిని కథావరణంలోకి లాక్కుపోతుంది. వారిని నిశ్శబ్ద వీక్షకులుగా నిలబెట్టి, జరుగుతున్న సంఘటనలను చూడమంటాయి. అది మల్లా రెడ్డి గారి విలక్షణ కథన శైలిగా చెప్పాల్సివుంటుంది.
ఈ సంకలనంలోని రెండో కథ ‘కొమ్ముల బర్రె’. పద్య కవిత్వ భాషలో చెప్పే నారికేళ పాకం లాంటి కథన శైలిలో కథా వస్తువు సాగిపోతుంటుంది.
కథా వస్తువు విషయానికొస్తే తమకున్న ఒకే ఒక పాడి గేదె మీద కుటుంబ జీవనాన్ని నిర్మించుకున్న ఓ సన్నకారు రైతు కుంటుంబానికి చెందిన కొమ్ముల గేదె మూడు రోజుల పాటు తప్పిపోయి నాలుగవ రోజు చీకటితో ఎట్లా తప్పిపోయిందో, అట్లాగే ఇంటి ముందుకొస్తుంది.
ఈ మూడు రోజుల వ్యవధిలో గేదెను వెతకడంలో జరిగిన అనేకానేక సంఘటలను కథకుడు మల్లారెడ్డి హద్యంగా చిత్రించడం, రైతు కుటుంబాల నేపధ్యం నుండి వచ్చి యాభై ఏండ్లు పైబడిన వయస్సున్న వాళ్ళకు తెలిసొస్తుంది. గేదె తనంతట తాను తిరిగి రావడాన్ని కుటుంబ సభ్యుల ఆనందంతోపాటు మూగజీవులైన తల్లీ పిల్లల మాధ్యమంగా రచయిత ఎలా చెప్పాడో చూడండీ!
”వెనుక కాళ్ళు నిర్రదొక్కి తోకమట్టపైకెత్తిన దూడ తన శక్తినంతా కూడదీసుకుంటూ మూతితో పొదుగును గుద్దుకుంటూ పాలు కుడుస్తూ ఉంటే , అంత అజమున్న బర్రె కూడా ఇంతెత్తు ఎగురుతూ.. సేపులొచ్చి, అల్లనేరేడు పండ్ల లాంటి కండ్లను చక్రాల్లా గుండ్రంగా తిప్పుతూ .. మూతిని మూరెడంత ముంగటికి చాపి, తన్మయత్వంలో మునిగిపోతు నాలుకతో దుడ్డే పెయ్యంతా నాకుతుంది కొమ్ముల బర్రె.
ఒక రచయితకు వ్యవసాయంతోను, పాడి పశువులతోనూ అనుబంధం వుంటే తప్ప ఇటువంటి దశ్యాలను అంత కళాత్మకంగా చెప్పడం చేతగాదు. ఆ అనుబంధం వుంది కాబట్టే మల్లా రెడ్డిగారు ఈ కథను అంత గొప్పగా రాయగలిగారు.
వీరిదే మరొకథను గురించి చెప్పుకోవాలంటే ”మట్టి దిబ్బ” ఓ అద్భుతమైన కథ. కాకతీయుల కాలంలో గొలుసు కట్టు చెరువులు, కుంటల ద్వారా ఎక్కువ భూమి నీట మునగకుండ, తక్కువ నీటితోనే ఎక్కువ ఫలసాయాన్ని తీయవచ్చు నన్న నీటి యాజమాన్య పద్ధతుల్ని ప్రపంచానికి, చేసి చూపించిన మన తెలంగాణ నేల మీద దానికి భిన్నంగా నేటి ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టులను కట్టి, సారవంతమైన భూముల్ని, తరాలుగా జీవితాలను పెనవేసుకున్న అనేక గ్రామాలను ఏవిధంగా నీట ముంచివేసి, ఎన్ని కుటుంబాల విచ్ఛిత్తికి కారణమౌతున్నాయో!? కరుణ రసార్ద్రంగా చెప్పిన మల్లారెడ్డి కథకుడుగా ముందు ముందు ఇటువంటి మంచి కథల్ని వ్రాస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.
ఇక మూడవ కథకుడు వంగర నరసింహారెడ్డి గారి కథల్లో నన్ను విపరీతంగా ఆకట్టుకున్న, ఆహ్లాదంగా నవ్వించిన కథ ”దిగులు” ఇది ఇటీవల కాలంలో ప్రపంచ మానవాళిని ప్రాణభయంతో గడగడ లాడించిన కరోనా మహమ్మారి నేపధ్యంతో వ్రాసిన కథ. అంత సీరియస్ అంశాన్ని అంతకు మించిన హాస్యంతో రాయడం అద్బుతంగా అన్పిస్తుంది.
వారిదే మరో మంచికథ ‘ఉంగరం’. ఇందులో మిత్రులతో కలిసి ఓ ఉపాధ్యాయుడు ఉదయపు నడకకు వెళుతుంటే ఖర్మకాలి మట్టి కొట్టుకుపోయిన ఓ ఉంగరం దొరుకుతుంది. ఆ తరువాత ఆ పంతులుగారు పడిన మనోవేదనను, డబ్బు నష్టాన్ని , చివరికి ఆ వుంగరం అసలైన స్వంతదారులకు ఇచ్చివేసి చేతులు దులుపుకోవడంతో కథ కంచికి పాఠకులు నవ్వుల పాలపుంతలోకి వెళ్లిపోతారు.
నరసింహారెడ్డి గారి కలం నుండి మిగతా అన్ని విధాల కథల కన్నా హాస్య కథలు అద్భుతంగా పండుతాయన్న గొప్ప భరోసా పాఠకులకు తప్పకుండా లభిస్తుంది.
అనేక విధాల ప్రసిద్దికెక్కిన సిద్ధిపేట గడ్డమీది నుండి వచ్చిన ఈ ముగ్గురు కథకులు ముందు ముందు మంచి పేరు ప్రతిష్టలను గడిస్తారని నమ్మకమిచ్చిన ఓ మంచి కథాసంకలనం ఈ ‘మూడుపాయలు’.
– శిరంశెట్టి కాంతారావు,
9849890322
కథల జీవనది ‘మూడుపాయలు’
- Advertisement -
- Advertisement -