– దుర్భరంగా బైండ్ల కళాకారుల జీవనం
– ఆలయాల్లో అర్చకులుగా అవకాశం ఇవ్వాలని వేడుకోలు
నవతెలంగాణ – మిరుదొడ్డి
శివుని చిన్న బిడ్డవమ్మ ఎల్లమ్మా. నీవు శివులెల్లి మాతవమ్మ ఎల్లమ్మా.. పుట్టలోన పుట్టినావు ఎల్లమ్మ.. నీవు పుడమిపై బడ్డవమ్మా ఎల్లమ్మా.. నాగవన్నె చీరలమ్మ ఎల్లమ్మ.. నీకు నెమలికండ్ల రవికలమ్మ ఎల్లమ్మా.. రావె రావె ఎల్లమ్మా. నిన్ను రాజులు కొలిచేరెల్లమ్మా.
హా హా హా ఒంటి నిండా రంగు.. గంభీరమైన ఆకారంతో.. ఇలాంటి పాటలు పాడుతూ గ్రామ దేవతలకు పూజలు చేసే కళాకారులే బైండ్ల కళాకారులు. జమిడిక తంత్రిని మునివేళ్లతో మీటుతూ రకరకాల శబ్దాలను పలికిస్తారు. ఒకప్పుడు రాజులకు వినోదాన్ని పంచిన ఈ కళ ప్రజలందరికీ చేరువలో ఉండేది. వంశపారంపర్యంగా వచ్చిన కళను కాపాడుతూ జీవం పోస్తున్నారు. గ్రామాల్లో పోతరాజులు బైండ్ల పంబల వేషాలతో నిదర్శనమిస్తూ ఉంటారు గ్రామదేవతలకు పూజలు చేసే వళ్ళు వీరే
నేడు జమిడిక నాదం మూగబోయే స్థితికి
అలాంటి జమిడిక నాదం ప్రస్తుతం మూగబోయే పరిస్థితి కనిపిస్తోంది. పల్లెలు, పట్టణాల్లో డీజేల హోరు పెరగడంతో భవిష్యత్తులో బైండ్ల కళా ప్రదర్శన కనుమరుగయ్యే దుస్థితి నెలకొందని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైండ్ల కళాకారులను భవానీలు అని కూడా పిలుస్తారు. వీళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లోనూ ఉన్నారు. వీరి పూజా విధానం కాస్త కష్టంగా ని ఉన్నా. ప్రజలను ఉర్రూతలూగిస్తుంది.
గ్రామ దేవతలకు పూజలు చేస్తూ
తెలుగు చరిత్రలో బైండ్ల కులస్తులకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కళాకారులు మాదిగ కులస్తులకు పూజారులుగా, శక్తి ఆరాధకులుగా పేరొందారు. పూర్వం మాదిగ కులస్తులు జరుపుకొనే శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టడమే కాకుండా పెళ్లితంతు జరిపేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. పెళ్లిళ్లు, పండుగలు ఇతర కులాల వారితో చేయించడం వల్ల వారి ఉపాధి దెబ్బ తింది. ప్రస్తుతం వారు వంశానుక్రమంగా సంక్రమించిన గ్రామాలకు వెళ్లి ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ కథలు చెప్పి దేవతలను కొలిచే పూజారులుగా, కళాకారులుగానే మిగిలారు.
జమిడిక” విన్యాసాలు“
బైండ్ల కళాకారులు ఉపయోగించే వాయిద్యాన్ని ‘జమిడిక’ అంటారు. దీన్ని ఇత్తడితో తయారు చేస్తారు. జమిడికతో అనేక రకాల సంగీత ధ్వనులు పలికిస్తారు. పాట వరుసను అనుసరించి లయ మారుస్తుంటారు. కథకుడు కథాగానం చేస్తుంటే.. పక్కనున్న కళాకారులు వంత పాడుతూ జమిడిక వాయిస్తుంటారు. పల్లెల్లో ఎక్కువగా చేసుకునే రేణుకా ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, పోలేరమ్మ పండుగలప్పుడు పసుపు, కుంకుమలతో పట్నాలు వేసి దేవతలను కొలుస్తారు. దేవుళ్లకు బోనాలు సమర్పించిన రాత్రంతా గుడి దగ్గరే ఉంటారు. తెల్లవారుజాము వరకు ఆటపాటలతో దేవతల చరిత్ర చెబుతారు. పరశురాముడు, మాందాత, పోతరాజు, ఎల్లమ్మతో పాటు పలు రకాల వేషధారణలతో ఆకట్టుకుంటారు.
నేడు ఉపాధి కరువై..
ప్రస్తుతం తెలంగాణలో కథాగానం చేసే బైండ్ల కళాకారులు స్వల్ప సంఖ్యలో ఉన్నారు. ఆయా గ్రామాల్లో పండుగలు జరిగినప్పుడే వీరికి ఉపాధి దొరుకుతోంది. ఏటా కేవలం ఆషాఢం, శ్రావణ మాసాల్లోనే వీరికి ఉపాధి దొరుకుతోంది. మిగతా రోజులు కూలీ పనులు, వేరే వృత్తులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు. కొత్త తరం ఈ కళారూపాన్ని నేర్చుకోవడానికి ముందుకు రావడం లేదు. అక్కడక్కడా కళాకారులు తమ వారసత్వ కళా సంస్కృతిని కొనసాగించాలనే పట్టుదలతో తమ పిల్లలను చదివిస్తూనే సందర్భాన్ని బట్టి వారికి కథలను నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రభుత్వ చేయూత కోసం ఎదురుచూపు
శక్తి దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ వంటి దేవతల కథలు చెప్పే సంస్కృతి బైండ్ల కళాకారుల నుంచి అనాదిగా వస్తోంది. ఈ ఆలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ధూపదీప నైవేద్య పథకం కింద బైండ్ల కళాకారులను చేర్చి అర్చకులుగా అవకాశమివ్వాలని కోరుతున్నారు. దాంతో పాటు కళనే నమ్ముకుని వయోభారంతో ఇబ్బంది పడుతున్న వారికి. ప్రభుత్వం ప్రత్యేక పథకాలు వర్తింపజేయాలని, కళాకారుల అందించాలని కోరుతున్నారు. భావితరాలకు ఈ కళను పరిచయం చేసేందుకు డాక్యుమెంటేషన్ చేయాలని కళాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు.