పరీక్షలకు ర్యాపిడోల్లో ప్రయాణం.. పిల్లలతో వెట్టి చాకిరీ
తక్షణమే ప్రయివేట్ ఏజెన్సీని తొలగించి ప్రభుత్వమే నిర్వహించాలి
హైదరాబాద్ డీఆర్వో, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌కు తల్లిదండ్రుల విజ్ఞప్తి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రతిష్టాత్మక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్(రామంతపూర్, బేగంపేట)లో హాస్టల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ప్రయివేట్ ఏజెన్సీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీ కారణంగా విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి వెళ్తున్నాయని గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఆల్‌ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ కోశాధికారి డాక్టర్ భట్టు వెంకన్న ఆధ్వర్యంలో 33 జిల్లాల నుంచి విద్యార్థులు తల్లిదండ్రులు కేదారి దుర్గయ్య, శంకర్ నాయక్, నందు నాయక్, సంతోష్ నాయక్, గణేష్, దయాకర్, భూక్య వెంకన్న, యానయ్య, వినోద్, యాదగిరి, తిరుపతయ్య, అంజయ్య నాయక్, చందులాల్ నాయక్, రాంబాబు తదితరులు కలిసి ప్రజావాణి కార్యక్రమంలో హైదరాబాద్ డీఆర్వో వెంకటాచారికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం తెలంగాణ స్టేట్ కమీషన్ ఫర్ ప్రోటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి ఆఫీసుల్లోనూ వినతిపత్రాలు అందజేశారు.
ప్రాణాలతో చెలగాటం.. ర్యాపిడోలపై ప్రయాణం
పిల్లలను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లడానికి సురక్షితమైన వాహనాలు ఏర్పాటు చేయకుండా, ర్యాపిడో బైక్‌లపై పంపిస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు తీవ్ర ఆం దోళన వ్యక్తం చేశారు. స్కూల్ బస్సు ఎక్కే సమ యంలో పిల్లలను పట్టించుకోకపోవడంతో కొందరిని అక్కడే వదిలేసి వెళ్లిన సందర్భాలు ఉన్నాయన్నారు.
ఆకలి కేకలు.. బెదిరింపులు!
మధ్యాహ్నం 2 గంటల వరకు, రాత్రి 9 గంటల వరకు పిల్లలకు భోజనం పెట్టకుండా ఆకలి తో అలమటించేలా చేస్తున్నారని తెలిపారు. అనా రోగ్యానికి గురైతే పట్టించుకునే నాథుడే లేడన్నారు. ఈ అన్యాయాలపై ప్రశ్నించిన తల్లిదం డ్రులను ‘మీ పిల్లలను స్కూల్ నుంచి తీసేస్తాం, మీపై కేసులు పెడతాం’ అని ప్రయివేటు ఏజెన్సీ నిర్వాహకులు భయభ్రాంతులకు గురిచే స్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వమే నిర్వహించాలి
తక్షణమే ప్రయివేటు ఏజెన్సీని రద్దు చేసి, హాస్టల్ నిర్వహణను ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవాలని బాధితులు తెలిపారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు శాశ్వత హాస్టల్ భవనాలు నిర్మించి భావితరాలకు మేలు చేయాలని సంబం ధిత శాఖ మంత్రుల కార్యాలయాల్లో అధికారులను కలిసి కోరారు.
దిగజారిన ప్రమాణాలు..పేరెంట్స్ కన్నీటి గాథ
హాస్టల్‌లో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రయివేటు ఏజెన్సీ పూర్తిగా విఫలమైందని వారు విమర్శించారు. కేర్ టేకర్లు, వాచ్‌మెన్లు, వంట మనుషులు, బట్టలు ఉతికేవారు, ట్యూటర్లు ఎవరూ లేకపోవడంతో హాస్టల్ వాతావరణం అధ్వానంగా తయారైందన్నారు. విద్యార్థులతోనే బట్టలు ఉతికించడం, వంటలు చేయించడం, బాత్రూంలు కడిగించడం వంటి పనులు చేయిస్తూ వారిని హింసిస్తున్నారని వాపోయారు.



