రెండు విడతల్లో నిర్వహణ
మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
ఆ తర్వాత మూడు విడతల్లో సర్పంచి ఎన్నికలు
అక్టోబర్ 9 నుంచి తొలివిడత నామినేషన్ల స్వీకరణ
నవంబర్ ఎనిమిదో తేదీతో ముగియనున్న ఎన్నికల ప్రక్రియ
తెలంగాణలో రూరల్ ఓటర్ల సంఖ్య 1,67,03,168
సుప్రీం కోర్టు ఆదేశాలతో 14 ఎంపీటీసీలకు, 27 జీపీలకు ఎన్నికల్లేవు
రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. తొలుత రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని ప్రకటించారు. ఆ తర్వాత వెంటనే మూడు దశల్లో సర్పంచి ఎన్నికలు నిర్వహి స్తామని వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు స్థానిక ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. సోమవారం నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి తొలి విడత ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ తొమ్మిదో తేదీన ప్రారంభమై నవంబర్ 11వ తేదీన ముగుస్తుందనీ, రెండో విడత ఎన్నికల ప్రక్రియ 13.10.25న ప్రారంభమై 11.11.25న పూర్తవు తుందని వివరించారు. గ్రామపంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. తొలివిడత ఎన్నికల ప్రక్రియ 17.10.25న ప్రారంభమై 31.10.25న పూర్తవుతుందనీ, రెండో విడత ఎన్నికల ప్రక్రియ 21.10.25న మొదలై 04.11.25న పూర్తవుతుందనీ, మూడో విడత ప్రక్రియ 25.10.25న ప్రారంభమై 08.11.25న ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. జీపీ ఎన్నికలకు 15,522 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 15,302 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఒక్కో దశ ఎన్నికల ప్రక్రియ 15 రోజుల్లో ముగిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో డీజీపీ జితేందర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన, తదితర అధికారులు పాల్గొన్నారు. జిల్లాల ఎన్నికల అధికారులు రిజర్వేషన్లకు సంబంధించిన డేటా తమకు అందజేశారని తెలిపారు. దానికి సంబంధించిన గెజిట్‌లు కూడా విడుదల చేశారని చెప్పారు. ఈసీఐ నుంచి ఎలక్ట్రోరల్ జాబితాను తెప్పించుకుని పంచాయతీలు, ఎంపీటీసీ స్థానాల వారీగా ఓటర్ల జాబితాను ఈ నెల పదో తేదీ నాటికి ఫైనల్ చేశామని తెలిపారు. జులై 15 వరకు సవరించిన ఓటర్ల జాబితా డేటా ఆధారంగా మండలాల వారీగా ఎంపీడీఓలు, డీపీఓల ద్వారా ముసా యిదా డ్రాప్టులు విడుదల చేశారని తెలిపారు. వర్షాల సమయంలోనూ ఓటర్ల జాబితా రూపొందిం చేందుకు ఎన్నికల అధికారులు కష్టపడ్డారని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఓటర్లు, పోటీచేసే అభ్యర్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మీడియా సహకరించాలనీ, ఎన్నికల సమాచారాన్ని ఎప్పటిక ప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

బ్యాలెట్ పద్ధతిలోనే
బ్యాలెట్ పద్ధతిలోనే స్థానిక ఎన్నిలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించనున్నది. ఒకేసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచి ఎన్నికలు నిర్వహిస్తున్న తరుణంలో అవసరాల రీత్యా బ్యాలెట్ బాక్సులను గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా తెప్పిస్తున్నది.
తొలి విడతలో 1998 పంచాయతీలకు, రెండో విడతలో 5414 పంచాయతీలకు, మూడో విడతలో 5321 పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. సర్పంచి, వార్డు మెంబర్ల నామినేషన్ల స్వీకరణకు ప్రతి విడతలోనూ రెండు రోజుల సమయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఆ రెండు రోజుల పాటు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు. నామినేషన్లు తిరస్కరణకు గురి అయితే అప్పీల్ చేయడానికి ఒకరోజు, పరిష్కరించడానికి ఒకరోజు సమయాన్ని ఎన్నికల సంఘం వెచ్చించనున్నది. ప్రతి విడతలోనూ గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. తదనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అదే రోజు ఫలితాన్ని డిక్లేర్ చేస్తారు. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో ఫలితం తేలకుంటే మరుసటిరోజు ప్రకటిస్తారు.
ఇక్కడ స్థానిక ఎన్నికల్లేవ్..
సుప్రీం కోర్టు తీర్పు ఆదేశాల మేరకు 14 ఎంపీటీసీ, 27 గ్రామ పంచాయతీ, 246 వార్డులకు ఎన్నికల నిర్వహించట్లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ములుగు జిల్లా మంగపేటలోని అన్ని పంచాయతీలు, ఎంపీటీసీ, వార్డు స్థానాలు అందులో ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలోని వి.సైదాపూర్ మండలంలోని కుర్మపల్లి, రామచంద్రాపురం పంచాయతీలకు కూడా సర్పంచి, వార్డు మెంబర్ ఎన్నికలు ఉండవు.
14 ఎంపీటీసీ స్థానాలివే..: ఎన్నికలు జరగని ఎంపీటీసీ స్థానాల జాబితాలో మంగపేట మండలంలోని కమలాపురం-1, కమలాపురం-2, కమలాపురం-3, మంగపేట, నర్సాపూర్‌బోరె, కోమటిపల్లి, చెరుపల్లి, తిమ్మమంపేట, మల్లూరు, నర్సింహాసాగర్, రమణక్కపేట, రాజుపేట, కత్తిగూడెం, దొమ్మెడ ఉన్నాయి.
27 గ్రామపంచాయతీలివే : ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం, మంగపేట, నర్సాపూర్‌బోరె, కోమటిపల్లి, కొత్తూరుమోట్లగూడెం, చెరుపల్లి, బాలన్నగూడెం, నర్సాయిగూడెం, బుచ్చంపేట, తిమ్మమంపేట, మల్లూరు, కొత్త మల్లూరు, నర్సింహాసాగర్, కూరేడెపల్లి, రమణక్కపేట, చెంచుపల్లి, వాడగూడెం, రాజుపేట, రామచంద్రునిపేట, ఒగ్గుఒడ్డుగూడెం, కత్తిగూడెం, బ్రహ్మణపల్లి, అంకినపల్లిమల్లారం, దోమెడ, నిమ్మగూడెం, కరీంనగర్ జిల్లా వి.సైదాపూర్ మండలంలోని కుర్మపల్లి, రామచంద్రాపురం గ్రామపంచాయతీల్లో స్థానిక ఎన్నికల పోరు ఉండదు.

