ఒంటరితనం, భయంతో బలవన్మరణాలు
ఆపన్నహస్తం కోసం అలమటించినా ఫలితం శూన్యం
పట్టించుకోని పెద్దలు, సమాజం
న్యూఢిల్లీ : మన దేశంలో 15-29 సంవత్సరాల మధ్య వయసున్న యువతలో చోటుచేసుకుంటున్న మరణాలకు ప్రధాన కారణం ఆత్మహత్యలే. ఒంటరితనం, భయం, బాసట ఇచ్చేవారు లేకపోవడం వంటి కారణాలతో యువత ఎక్కువగా ఆత్మహత్య లకు పాల్పడుతోంది. వీటి నుంచి యువతీ యువకులను రక్షించాలంటే ముందుగా వారి మానసిక పరిస్థితులను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అధ్యాపకులు, పెద్దలు వారిని నిశితంగా పరిశీలిస్తూ ఏం జరుగుతోందో తెలుసుకోవాలి. ఒకవేళ వారు బెదిరింపులకో లేదా వేధింపులకో గురవుతుంటే తక్షణమే జోక్యం చేసుకుని బాధితుల పక్షాన నిలబడాలి. యువత ఇబ్బందులలో ఉన్నదని తెలిసినప్పుడు ఆపన్న హస్తం అందించాలి. కానీ దురదృష్టవశాత్తూ ఇవేవీ జరగడం లేదు.
మద్దతు కోసం ఎదురు చూపులు
తమ గోడును ఎవరూ వినడం లేదని, ఒకవేళ విన్నప్పటికీ తేలికగా తీసుకుంటు న్నారని యువతీ యువకులు వాపోతున్నారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులకు కొండంత మనోధైర్యాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. అలాంటప్పుడు వారితో స్నేహపూర్వకంగా మెలగుతూ వారిలో ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని నింపాలని నిపుణులు సూచించారు. మానసికంగా ఇబ్బంది పడే యువత తరచూ చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే… ‘ఇంటిలో ఎవరూ నన్ను నమ్మడం లేదు’, ‘ఒత్తిడి నుంచి బయటపడాలని చెప్పి ఊరుకుంటారు’, ‘నేను సాయం కోసం అడుగుతూనే ఉన్నాను. కానీ ఎవరూ ముందుకు రావడం లేదు’, ‘ఒకవేళ ఎవరైనా కౌన్సిలర్ వద్దకు వెళదామంటే అది చాలా ఖర్చుతో కూడిన పని’….ఇలాంటి మాటలే వారి నోటి నుంచి వినిపిస్తూ ఉంటాయి. ఇవేవో ఒంటరి విద్యార్థుల మాటలు కావు. నిశ్శబ్దాన్ని, భయాన్ని పారద్రోలి వారికి మౌలికమైన మద్దతు ఇచ్చే వారు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం.
కానరాని లోతైన విశ్లేషణ
ఈ పరిణామాలన్నీ జాతీయ సంక్షోభాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఆత్మహత్యలను నివారించే వారు, ఆ వ్యవస్థలు నిద్రావస్థలో ఉండడం, చేష్టలుడిగి చూస్తుండడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది. ఈ వ్యక్తులు, వ్యవస్థలు సంక్షోభ పరిష్కారం పైనే దృష్టి సారిస్తున్నాయి తప్ప అసలు దానిని నివారించే ప్రయత్నం చేయడం లేదు. సంవత్సరంన్నర కాలంగా వేధింపులకు గురవుతున్న ఓ తొమ్మిది సంవత్సరాల బాలిక ఆత్మహత్య చేసుకుంటే ఏదో ఘోరం జరిగిపోయిందని అనుకుంటాం. కానీ ఆమె ఆత్మహత్య చేసుకున్న రోజున ఐదుసార్లు ఆ వేధింపులపై ఫిర్యాదు చేసిన విషయాన్ని మరచి పోతాం. విద్యా సంస్థలో రెయిలింగులు లేవని, సీసీటీవీ కెమేరాలు పని చేయడం లేదని… ఇలాంటి అర్థం పర్థం లేని కారణాలు చెప్పి విచారణను ముగిస్తారు. అంతే తప్ప ఆత్మహత్యకు దారితీసిన కారణాన్ని ఎవరూ లోతుగా విశ్లేషించరు. పదే పదే సాయం కోరినా ఎవరూ పట్టించుకోని వైనాన్ని విస్మరిస్తారు. ముఖ్యంగా పెద్దల నిష్క్రియాపరత్వాన్ని ఎత్తిచూపే సాహసం చేయరు.
వ్యవస్థ వైఫల్యమే
యువత ఎక్కువగా చెబుతున్న సమస్యలేమిటంటే ఒంటరితనం, నిస్సహాయత. వీరి భయాలను, సమస్యలను పెద్దలు సరిగా అర్థం చేసుకోవడం లేదు. బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలీక తమలో తామే కుమిలిపోతూ చిత్రవధను అనుభవిస్తున్న యువత మనకు ఎక్కువగానే కన్పిస్తుంది. ఇలాంటి సందర్భాలలో కుటుంబం, సమాజం, సంస్థలు జోక్యం చేసుకోని పక్షంలో వారికి ఆత్మహత్యలే శరణ్యమవుతాయి. విద్యా సంబంధమైన ఒత్తిడులు, వేగవంతంగా జరుగుతున్న సామాజిక మార్పులు, లింగ-లైంగిక వివక్ష, సంబంధాలకు ప్రతిబంధకంగా నిలుస్తున్న కుల మతాల అడ్డుగోడలు, వివాహాల నిరాకరణ, కులపరమైన వేధింపులు, లైంగిక అవమానాలు…ఇవన్నీ యువతను పట్టి పీడిస్తున్న సమస్యలే. సాయం కోసం పదే పదే వేడుకొని అది అందక యువతి లేదా యువకుడు ఆత్మహత్య చేసుకున్న ప్రతి సందర్భం కేవలం విషాదం మాత్రమే కాదు. అలాంటి వారిని కాపాడలేకపోతున్న వ్యవస్థ వైఫల్యానికి అది సాక్షీభూతంగా నిలుస్తోంది.
కారణమవుతున్న అవమానాలు… వేధింపులు
పదహారు సంవత్సరాల కుర్రవాడు ఉపాధ్యాయుల వేధింపులను గురించి అనేక సందర్భాలలో ఫిర్యాదు చేసినా, పాఠశాలను మార్చేయమని ప్రాధేయపడినా పెద్దలు పట్టించుకోకపోవడంతో చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతనికి మద్దతు ఇవ్వాల్సిన సమాజం దానికి బదులుగా బెదిరింపులకు పాల్పడింది. మరో ఘటనలో 19 సంవత్సరాల విద్యార్థి వేరే భాష మాట్లాడాడన్న కోపంతో అధ్యాపకులు తీవ్రంగా హింసించడంతో అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవేవో ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన ఉదంతాలు మాత్రమే కావు. కార్పొరేట్ విద్యా సంస్థలలోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయినా విద్యార్థుల భద్రత, శ్రేయస్సు, గౌరవం గురించి పట్టించుకునే నాథుడే ఉండదు. విద్యార్థుల ఆవేదనను వ్యక్తిగత కౌన్సిలింగ్ ద్వారా లేదా హెల్ప్‌లైన్ ద్వారా తొలగించే అవకాశం ఉన్నప్పటికీ ఆ పని జరగడం లేదనే చెప్పాలి. సమస్య మూలాలలోకి వెళ్లి విశ్లేషించి నివారణ మార్గాలను సూచించే వారు కరువయ్యారు.



