”వదిలేయండి, ఊరికే అనవసరపు ప్రశ్నలు వద్దు”
మీడియా ఎదుట అభ్యంతరకర పదం
సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారం
ఇండోర్ : తన నియోజకవర్గమైన ఇండోర్‌లోని భగీరధపురా ఏరియాలో డయేరియాతో 10మంది చనిపోయిన నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ సహనం కోల్పోయిన మధ్యప్రదేశ్ పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి కైలాశ్ విజయ్ వర్గియా మాట తూలారు. కోపంతో కెమెరా ఎదుట అభ్యంతరకరమైన మాట వాడారు. దాంతో పెద్ద వివాదం చెలరేగింది. పరిస్థితి గమనించిన మంత్రి వెంటనే విచారాన్ని వెలిబుచ్చారు. కాగా బీజేపీ నేతలు అహంకారంతో వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ తక్షణమే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. బుధవారం రాత్రి మంత్రి మీడియాతో తొలుత ప్రశాంతంగానే మాట్లాడారు.
అయితే భగీరధపురా ఏరియాలో అనేకమంది రోగులు డయేరియాతో బాధపడుతూ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకున్నారని, ఆ బిల్లుల రీఫండ్ ఎందుకు రాలేదని ఒక జర్నలిస్టు ప్రశ్నించారు. ఆ ప్రాంత ప్రజలకు ఎందుకు సరైన తాగునీరు సదుపాయాలు కల్పించలేకపోతున్నారని మరో ప్రశ్న వేయడంతో ఒక్కసారిగా మంత్రి విరుచుకుపడ్డారు. ”వదిలేయండి, ఊరికే అనవసరపు ప్రశ్నలు వద్దు” అని వ్యాఖ్యానించారు. దానితో ఈ ప్రశ్నలు వేసిన జర్నలిస్టుకు, మంత్రికి మధ్య వాదన రేగింది. ఆ సందర్భంగా మంత్రి అభ్యంతరకరమైన మాట ఉపయోగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విజయ్ వర్గియా వెంటనే విచారం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
”గత రెండు రోజులుగా నేను, నా బృందం నిద్ర కూడా లేకుండా బాధిత ప్రాంతంలో పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కలుషితమైన నీరుతో నా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా నా మాటలు తప్పుగా దొర్లాయి. అందుకు విచారిస్తున్నాను.” అంటూ ప్రకటన చేశారు. కాగా ముఖ్యమంత్రి యాదవ్ ఈ ఘటనపై స్పందిస్తూ, భగీరధపురా ఏరియాలో నీరు కలుషితమై డయేరియా తలెత్తిందని, ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు 10మంది మరణించగా, 212మంది ఆస్పత్రి పాలయ్యారు. ఇందుకు సంబంధించి ఒక అధికారిని డిస్మిస్ చేశారు. మరో ఇద్దరిని సస్పెండ్ చేశారు. దర్యాప్తు కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
మాట తూలిన మధ్యప్రదేశ్ మంత్రి
- Advertisement -
- Advertisement -



