– జర్నలిస్టులు తస్మాత్ జాగ్రత్త
– గతంలో డబ్బులిచ్చి నష్టపోయిన పలువురు
నవతెలంగాణ – కామారెడ్డి
గత అక్రిడేషన్ ప్రక్రియల సమయంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొంతమంది స్టాఫ్ రిపోర్టర్ల పేరుతో వ్యవహరించిన వ్యక్తులు అమాయక జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇస్తామని నమ్మబలికి ఆర్థికంగా నష్టపరిచిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తమ పత్రిక ద్వారా అక్రిడేషన్ కార్డులు ఇప్పిస్తామని చెప్పి 15 వేల నుండి 20 వేల వరకు డబ్బులు వసూలు చేసినప్పటికీ, అక్రిడేషన్ సమయం ముగిసిన తర్వాత కార్డులు రాలేదని బాధితులు చెబుతున్నారు.
డబ్బులు చెల్లించినప్పటికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ.. ఇప్పటివరకు డబ్బులు తిరిగి చెల్లించలేదని బాధిత రిపోర్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ఈ వ్యవహారానికి సంబంధించి కొందరు వ్యక్తులు ఇప్పటికే నాలుగు పత్రికలు మారినట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రిడేషన్లు జారీ చేస్తామని ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో మళ్లీ ఇదే తరహా మోసాలకు అవకాశం ఉండొచ్చని జర్నలిస్టు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే తమ సంస్థ నుండి పదివేలకే అక్కడేషన్ కార్డు ఇప్పిస్తామని చెప్తున్నట్లు సమాచారం. కామారెడ్డిలో అక్రిడేషన్ కార్డులు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకునే వారిని అజాగ్రత్తగా నమ్మకూడదని సూచిస్తున్నారు.
అక్రిడేషన్ కార్డు ఇస్తామని చెప్పే వ్యక్తి నిజంగా ఆ పత్రికకు సంబంధించినవాడా? ఆ పత్రికకు ఎన్ని అక్రిడేషన్ కార్డులు మంజూరు అవుతాయి? ఇప్పటికే ఆ పత్రికలో ఎంత మంది రిపోర్టర్లు ఉన్నారు? తాము చెల్లించే డబ్బుతో నిజంగా అక్రిడేషన్ వస్తుందా లేదా? వంటి విషయాలను అన్ని విధాలుగా పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు. అధికారిక విధానాల ద్వారా మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని, మధ్యవర్తుల మాటలు నమ్మి డబ్బులు చెల్లించవద్దని హెచ్చరిస్తున్నారు. ఈసారి జర్నలిస్టులు మరింత అప్రమత్తంగా ఉండి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఎవరైనా “మా పేపర్లో రిపోర్టర్లు తక్కువగా ఉన్నారు. మీకు అక్రిడేషన్ కార్డు ఇస్తాం” అంటూ ప్రలోభపెడితే, ఆ పత్రిక విశ్వసనీయత, యాజమాన్యం, గత చరిత్ర వంటి అంశాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సీనియర్ జర్నలిస్టులు సూచిస్తున్నారు.



