Sunday, February 8, 2026
E-PAPER
Homeజాతీయంఅంకెల మాయాజాలం !

అంకెల మాయాజాలం !

- Advertisement -

బడ్జెట్‌లో కీలక రంగాలకు వాస్తవ కేటాయింపులు నామమాత్రమే
అగ్రరాజ్యంతో రాజీ ధోరణి

న్యూఢిల్లీ : 2026-27 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పరిశీలిస్తే అది అమెరికా కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి విధానాలకు అనుగుణంగా ఉన్నట్లు కన్పిస్తోంది. దేశాన్ని పరిపాలిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలలో తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో రాజీ పడినట్లు స్పష్టమవుతోంది. అమెరికాలోని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం మన దేశంపై ఏకపక్షంగా వాణిజ్య దాడిని ప్రారంభించినప్పుడు మోడీ ప్రభుత్వం అధికారికంగా ఒక్క మౌఖిక ప్రతిస్పందనను కూడా తెలియజేయలేకపోయింది.

ఫలితంగా అమెరికా డాలరుతో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ పడిపోయింది. రష్యా, ఇరాన్‌ దేశాలతో గతంలో మనకు మంచి వాణిజ్య సంబంధాలు ఉండేవి. కానీ అమెరికా ఆదేశాలకు కేంద్రం తలవంచడంతో అవి దెబ్బతిన్నాయి. అమెరికాతో ప్రతి విషయంలోనూ రాజీపడిన కారణంగానే వాణిజ్య ఒప్పందం కుదిరిందనేది కఠోర సత్యం. అయినప్పటికీ వాణిజ్య పరమైన దాడికి ముందున్న పరిస్థితిని అమెరికా ఇంకా పునరుద్ధరించలేదు. అదే సమయంలో మన ప్రభుత్వం అమెరికా గుత్తాధిపత్య పెట్టుబడులను భారత ఆర్థిక వ్యవస్థలోని మరిన్ని రంగాలలోకి చొచ్చుకొని పోయేందుకు అనుమతించింది.

ఉన్నత విద్యపై చిన్నచూపు
విద్యా రంగం విషయానికి వస్తే గత బడ్జెట్‌తో పోలిస్తే కేటాయింపులు నామమాత్రంగా 14.2 శాతం (రూ.122,000 కోట్ల నుంచి 139,000 కోట్లకు) పెరిగాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ పెరుగుదల 12.5 శాతం మాత్రమే. 2025-26 బడ్జెట్‌ అంచనాల కంటే సవరించిన అంచనాలు బాగా తగ్గాయి. కాబట్టి కేటాయింపులను చూసి సంతోషపడాల్సిన అవసరం లేదు. ఉన్నత విద్య కోసం బడ్జెట్‌ కేటాయింపు కూడా నామమాత్రంగానే 8.5 శాతం పెరిగింది. అయితే వాస్తవ పెరుగుదల 6.8 శాతం మాత్రమే. కేంద్ర విశ్వవిద్యాలయాలకు ఇచ్చే గ్రాంటు సైతం 0.2 శాతం తగ్గింది.

యూజీసీకి కేటాయింపులు 5.2 శాతమే పెరగ్గా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి కేటాయింపులు 3.1 శాతం పెరిగాయి. విద్యా రంగానికి కేటాయింపుల్లో ప్రకటించిన పెరుగుదల నామమాత్రంగానే ఉన్నదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. పైగా సవరించిన అంచనాలు బడ్జెట్‌ అంచనాల కంటే తక్కువగానే ఉంటాయి. కేంద్ర విశ్వవిద్యాలయాలు, యూజీసీ వంటి ముఖ్యమైన సంస్థలకు జరిపిన కేటాయింపులను గమనిస్తే ఆయా సంస్థల అభివృద్ధికి అవి ఏ మూలకూ సరిపోవని అర్థమవుతుంది. ప్రభుత్వం ఉన్నత విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని చెప్పడానికి ఈ గణాంకాలు సరిపోతాయి. విద్య వ్యాపారీకరణకు ప్రభుత్వం తలుపులు తెరుస్తోందనే విషయం స్పష్టంగా కన్పిస్తోంది.

తిరోగమన పన్నుల విధానం
వ్యూహాత్మక పిరికితనం, రాజీ ధోరణి అనే వైఖరులు కేంద్ర బడ్జెట్‌లో ప్రతిబింబిస్తున్నాయి. ఖర్చుల్ని తగ్గించుకోవడం, తిరోగమన పన్నుల విధానం అందులో కన్పిస్తున్నాయి. అమెరికా కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి వ్యవస్థ పరిధిలో పనిచేయడానికి ఇవి కీలక సూచనలు. తిరోగమన పన్నుల విధానం తీవ్రతరం కావడమంటే కార్పొరేట్‌ పన్నుల వాటా తగ్గడం..ఆదాయపన్ను, పరోక్ష పన్నుల వాటా పెరగడం. ఈ విధానం ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. డిమాండ్‌ను తగ్గిస్తుంది. శ్రామికులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, రైతుల సంక్షేమం, ఉపాధి హామీ వంటి రంగాలలో కూడా ప్రభుత్వ వ్యయం పడిపోతుంది. బడ్జెట్‌లో చూపిన స్థూల పన్ను రాబడిలో కార్పొరేట్‌ పన్నుల వాటా 28 శాతం కాగా ఆదాయపన్ను వాటా 33 శాతం, జీఎస్టీ, కస్టమ్స్‌ సుంకాల వాటా 29 శాతంగా ఉంది. 2024-25 బడ్జెట్‌ కాలం నుంచి స్థూల పన్ను రాబడిలో కార్పొరేట్‌ పన్నుల వాటా తగ్గుతూ వస్తోంది.

రాష్ట్రాలపై పెరగనున్న ‘ఉపాధి’ భారం
కేంద్రప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం స్థానంలో వీబీ-జీ రాంజీని తీసుకొచ్చి పనిదినాల సంఖ్యను 125కు పెంచామని చెబుతోంది. మహాత్మాగాంధీ పేరిట ఉన్న ఉపాధి పథకం డిమాండ్‌ ఆధారిత పథకం కాగా వీబీ-జీ రాంజీ సరఫరా ద్వారా నిర్ణయించే పథకం. పాత పథకంలో కేంద్ర, రాష్ట్రాల వాటా 90:10గా ఉంటే ఈ పథకంలో 60:40గా ఉంది. ఉపాధి పథకానికి బడ్జెట్‌ అంచనాల ప్రకారం రాష్ట్రాలు రూ.38,400 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది. ఈ విషయంలో రాష్ట్రాలు విఫలమైతే కేంద్రం కూడా తన వాటాను కుదించే అవకాశం ఉంది.

ఈ రంగాలదీ అదే పరిస్థితి
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ రంగాలకు జరిపిన కేటాయింపుల్లో కూడా ఇలాంటి ప్రతికూల ధోరణులే కన్పిస్తున్నాయి. ఈ రంగాలకు కూడా కేటాయింపులను నామమాత్రంగానే 10 శాతం పెంచారు. అయితే గత సంవత్సరపు సవరించిన బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే ఈ పెరుగుదల 0.3 శాతం ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేసింది. రెండు బడ్జెట్లలో వేసిన అంచనాల మధ్య వాస్తవ పెరుగుదల చాలా స్వల్పంగానే ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -