29 కార్పొరేషన్లలో 25 అధికార కూటమికే
2869 వార్డులకు గానూ 1700కు పైగా కైవసం
కాంగ్రెస్‌కు 318 వార్డులు.. శివసేన(యూబీటీ)కి 161 వార్డులు
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
ముంబయి : మహారాష్ట్ర మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో అక్కడి అధికార మహాయుతి కూటమి సత్తా చాటింది. రాష్ట్రంలోని మొత్తం 29 మునిసిపల్ కార్పొరేషన్లకు గానూ 25 కార్పొరేషన్లను బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కైవసం చేసుకున్నది. 2869 వార్డులకు గానూ 1700కు పైగా వార్డులను గెలుచుకున్నది. ఇందులో బీజేపీకి అత్యధికంగా 1422 సీట్లు దక్కాయి. ఇక శివసేన (షిండే) 366 వార్డులను గెలుచుకున్నది. కాంగ్రెస్ పార్టీ 318 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్నో అంచనాలు, ఆశలతో బరిలో నిలిచిన శివసేన (యూబీటీ) 161 వార్డులకే పరిమితమైంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(అజిత్ పవార్) పార్టీ 159 వార్డుల్లో విజయం సాధించింది. రాజ్‌థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) 17 స్థానాల్లో విజయం సాధించింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్ పార్టీ సైతం 94 సీట్లలో గెలిచే దిశగా ఆధిక్యంలో దూసుకు పోతుండటం గమనార్హం.
ముంబయి కూడా మహాయుతిదే..!
థాక్రే కుటుంబానికి కంచుకోట లాంటి ముంబయి నగరాన్నీ మహాయుతి కైవసం చేసుకోవడం గమనార్హం. దేశంలోనే సంపన్న ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)లోని 227 వార్డులకు గానూ 84 చోట్ల బీజేపీ, 26 చోట్ల శివసేన (షిండే) గెలిచాయి. శివసేన (ఉద్ధవ్) 74 సీట్లకు పరిమిత మైంది. మ్యాజిక్ ఫిగర్ 114కు కేవలం 4 సీట్ల దూరంలో (110 వద్ద) మహాయుతి ఉన్నట్టు తెలు స్తున్నది. మునిసిపల్ ఫలితాలపై ఎన్సీపీ స్పందిం చింది. ప్రధాన ప్రతిపక్ష కూటమిగా కొనసాగిన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఏకతాటిపై ఉంటే ఫలితాలు మరోలా ఉండేవనీ, మహాయుతికి ఇంతటి విజయం దక్కకపోయేదని తెలిపింది. మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నట్టు ఆ పార్టీ అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో వివరించారు.



