Tuesday, February 3, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు'మహా' పోరాటం స్ఫూర్తిదాయకం

‘మహా’ పోరాటం స్ఫూర్తిదాయకం

- Advertisement -

అటవీ హక్కుల చట్టం అమలు, పోర్టుల రద్దు కోసం పోరాటం
వాద్వాన్‌, ముర్బే పోర్టులతో ఉపాధి కోల్పోనున్న మత్స్యకారులు
స్మార్ట్‌ మీటర్లతో వేలల్లో కరెంటు బిల్లులు
రాష్ట్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌ హామీ
విత్తనంపై కార్పొరేట్లకు హక్కు కల్పించడం దారుణం
విద్యుత్‌ ప్రయివేటీకరణ దేశాభివృద్ధికి నష్టదాయకం
12న దేశవ్యాప్త సమ్మెలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలి : నవతెలంగాణతో ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి విజ్ఞూకృష్ణన్‌


ములాఖాత్‌

‘మహారాష్ట్రలో పాల్ఘర్‌ జిల్లాలో చరోట నుంచి జిల్లా కలెక్టరేట్‌ వరకు రైతులు చేపట్టిన 55 కిలోమీటర్ల పాదయాత్ర స్ఫూర్తిదాయకం. నేనూ ఆ రైతులతో కలిసి నడిచా. లోకల్‌ డిమాండ్ల పరిష్కారానికి కలెక్టర్‌ రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. అటవీ హక్కుల చట్టం కింద గిరిజన రైతులకు పట్టాలిచ్చేందుకు స్థానిక సీపీఐ(ఎం) నేతలు, అధికారులతో కలిపి కమిటీ వేశారు. స్మార్ట్‌ మీటర్లతో అధిక బిల్లులు వచ్చిన రైతులకు రద్దు చేస్తామనే భరోసానిచ్చారు. ఉపాధి హామీ పెండింగ్‌ బిల్లులను క్లియర్‌ చేస్తామని హామీనిచ్చారు. ఇది ముమ్మాటికీ రైతుల పోరాట విజయం. నాసిక్‌ నుంచి ముంబయి వరకు వేలాది మందితో చేపట్టిన లాంగ్‌మార్చ్‌ కూడా సక్సెస్‌ అయింది. ఒక పోరాటం మరో పోరాటానికి నాంది. లేబర్‌కోడ్‌ల రద్దు, స్మార్ట్‌ మీటర్ల ఉపసంహరణ, విత్తన ముసాయి చట్టం రద్దు, తదితర డిమాండ్లతో ఈ నెల 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలందరూ జయప్రదం చేయాలని కోరుతున్నాం’ అని అఖిల భారత కిసాన్‌ సభ(ఏఐకేఎస్‌) ప్రధాన కార్యదర్శి విజ్ఞూకృష్ణన్‌ చెప్పారు.

హైదరాబాద్‌కు వచ్చిన ఆయన నవతెలంగాణ ప్రతినిధి అచ్చిన ప్రశాంత్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అటవీ హక్కుల చట్టం ద్వారా గిరిజనులకు పట్టాలిస్తామన్న గత హామీని మహారాష్ట్ర సర్కారు విస్మరించింది. కొందరికే ఎకరా, అరెకరాకు పట్టాలిచ్చి చేతులు దులుపుకున్నది. దశాబ్దాలుగా దేవాలయాల భూములను కౌలుకు తీసుకుని రైతులు సాగు చేస్తున్నారు. ఆ భూములను తమ పేరిట పట్టా చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. వాద్వాన్‌, ముర్బే పోర్టులతో పాల్ఘర్‌ జిల్లాలోని మత్స్యకారుల జీవనోపాధి పోనున్నది. ఆ పోర్టులతో నష్టపోతున్న వారికి పునరావాసం కూడా సరిగా ఇవ్వడం లేదు. వ్యవసాయంలో స్మార్ట్‌ మీటర్లు ఉపయోగించడం వల్ల రూ.50 వేల కరెంటు బిల్లు వచ్చిందని ఆధారాలతో సహా ఓ రైతు చూపెట్టారు. ఈ మూడు ప్రధాన డిమాండ్లతో పాటు ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలనీ, లేబర్‌ కోడ్‌లను అమలు చేయవద్దని కోరుతూ వారు పోరుబాటు పట్టారు. కొంతమేర విజయం సాధించారు.

విద్యుత్‌ రంగంపై ప్రయివేటు గుత్తాధిపత్యం ప్రమాదకరం
విద్యుత్‌ సంస్థలను ప్రయివేటు పరం చేయడం, వ్యవసాయానికి స్మార్ట్‌ మీటర్లు బిగించడం విద్యుత్‌ సవరణ చట్టం ఉద్దేశ్యం. చండీఘర్‌లోని పబ్లిక్‌ సెక్టార్‌లోని పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఏటా రూ. 250 కోట్ల వరకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నది. దాని ఆస్తుల విలువ రూ.22 వేల కోట్లు. అలాంటి కంపెనీని ప్రాథమిక బిడ్‌ రూ.174 కోట్లుగా బీజేపీ సర్కారు నిర్ణయించింది. రూ.871 కోట్లకు గోయెంకా కంపెనీకి కట్టబెట్టింది. ఇది అవినీతి కాదా?. అక్కడ పెద్ద ఎత్తున పోరాటం జరిగితే ఎస్మా ప్రయోగించి అణిచివేశారు. ఉత్తరప్రదేశ్‌లో లాభాల్లోని రెండు ప్రభుత్వ విద్యుత్‌ కంపెనీలను కూడా అక్కడి బీజేపీ ప్రభుత్వం ప్రయివేటుపరం చేయబోతున్నది. అమెరికాలోని కాలిఫోర్నియాలో పవర్‌ కంట్రోల్‌ మొత్తం ఒక ప్రయివేటు సంస్థ చేతిలో ఉండటం అక్కడ సంక్షోభం తలెత్తింది. భారత్‌లోనూ అదానీ, టొరంటో, టాటా, వాళ్ల చేతుల్లోకి పవర్‌ కంట్రోల్‌ వెళ్లిపోతే అదే జరుగుతుంది. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత తీవ్రం కాకుండా మొదట కేంద్రపాలిత ప్రాంతాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. పాండిచ్చేరిలో మాత్రం ప్రజా పోరా టంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. విద్యుత్‌ రంగంపై ప్రయివేటు గుత్తాధిపత్యం అత్యంత ప్రమాదకరం.

స్మార్ట్‌ మీటర్లతో వ్యవసాయం కష్టమే..
ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చాలా మేరకు వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌మీటర్లను బిగిస్తున్నారు. దేశమంతటికీ 20 కోట్ల ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు కావాలి. ఒక్కో దాని ఖర్చు రూ.10 వేల నుంచి రూ.15వేలు. ఇది రైతులపై భారమే కదా ! ఇది కార్పొరేట్ల కంపెనీల వ్యాపారం పెంచడా నికే కదా! ప్రజలు ఆలో చించాలి. ఇప్పటిదాకా వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు ఉన్న క్రాస్‌ సబ్సిడీలు పోతాయి. విజయనగరంలో ఒక రైతును అడిగితే త్రీ హెచ్‌పీ మోటారుకు రూ.15 వేల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చిందని చెప్పింది. అలాగైతే వ్యవసాయం ఎలా చేస్తారు?

వంద శాతం పంట కొనుగోలు చేయాలి
కిసాన్‌ కపాస్‌ యాప్‌ వల్ల రైతులకు నష్టమే జరిగింది. పంటను వందశాతం ప్రభుత్వమే కొనాలి. తాజాగా కేంద్రం ఒత్తిళ్లతో కొన్ని రాష్ట్రాలు ఎరువుల అమ్మకం కోసం కూడా యాప్‌లను తీసుకొస్తున్నాయి. ఇది సరిగాదు. యాప్‌లను వాడకంపై రైతులకు అవగాహన ఉండదు. జీరో బడ్జెట్‌ న్యాచురల్‌ ఫామింగ్‌లో కూడా ఖర్చు ఉంటుంది. ఓవైపు పంట ఉత్పత్తి ఖర్చు పెరుగుతున్నదిగానీ రైతుల పంటకు మద్దతు ధరలు మాత్రం దక్కడం లేదు. ఎమ్‌ఎస్‌పీ గురించి బీజేపీ వాళ్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వాస్తవంలో 50 శాతం పంటలను కూడా కొనట్లేదు. కనీస మద్దతు ధరల చట్టం కోసం పోరాటం తీవ్రం చేస్తాం.

పోరాటాలను ఉధృతం చేస్తాం…
ఢిల్లీలో రైతాంగ పోరాటం ద్వారా మూడు నల్ల చట్టాలు వాపస్‌ అయ్యాయి. శత్రువు గుండెల్లో భయం నాటి గెలిచిన విజయం అది. లేబర్‌ కోడ్‌లో తాత్కాలికంగా అప్పుడు నోటిఫై చేయలేదు. ఎలక్ట్రిసిటీ యాక్టు అమలు చేయబోమని మోడీ సర్కారు రాతపూర్వక హామీ ఇచ్చింది. దాన్ని ఉల్లంఘించి అమలు చేయాలని చూస్తోంది. మేం ఊరుకోబోం. పోరాటాలను ఉధృతం చేస్తాం.

ఉపాధి నిర్వీర్యంతో వలసలు పెరిగే ప్రమాదం…
వీబీజీఆర్‌ఏఎమ్‌జీ ద్వారా 125 రోజుల పని ఇస్తామని పేదలను మోడీ సర్కారు మోసం చేస్తున్నది. అందుకు రూ.3.45 లక్షల కోట్లు కావాలి. ఇప్పుడు లక్ష కోట్ల రూపాయలు కూడా కేటాయించలేదు. పైగా, రాష్ట్రాలపై 40 శాతం భారం మోపనున్నది. రూ.93 వేల కోట్లతో 125 రోజుల పని ఎలా సాధ్యం? ఆ చట్టం పేరులో నుంచి మహాత్మాగాంధీ పేరు తొలగించడం ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండా. కార్పొరేట్లకు, కంపెనీలకు, భూస్వాములకు తక్కువ వేతనంతో కూలీలు దొరికేలా ఈ చట్టం మార్చినట్టు ఉంది.

కేరళ ప్రత్యామ్నాయ అభివృద్ధి దేశానికి అవసరం
కేరళలో 16 కూరగాయల పంటలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. క్వింటా ధాన్యానికి రూ.3 వేల చొప్పున 85 శాతం పంటను కొన్నది. నా సొంతూరు కరివెల్లూరులో హెక్టారుకు రూ.30 వేలు గ్రామపంచాయతీ సబ్సిడీ ఇస్తున్నది. ఏ రాష్ట్రంలోనైనా ఇలా సబ్సిడీ అందుతున్నదా? ప్రతి గ్రామానికీ వ్యవసాయ ప్రణాళిక ఉంటుంది. వాణిజ్య పంటలు పండించే రైతులకు కోఆపరేటివ్‌ సంస్థలతో మేలు చేస్తున్నాం. ఇది కదా రైతులకు కావాల్సింది. కేరళ లో ఐదేండ్లలో ఐదు లక్షల మంది పేదలకు ఇండ్లు కట్టిచ్చాం. రెండు లక్షల ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. నాలుగు లక్షల మంది పేదలకు భూమి పట్టాలిచ్చాం. విద్యా, వైద్య సౌకర్యాలతో పాటు ప్రతి గ్రామంలోనూ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. పేదరికాన్ని నిర్మూలించే దిశగా అడుగులు వేస్తున్నాం. అందుకే కేరళ ప్రతామ్నాయ అభివృద్ధి దేశానికి అవసరమని చెబుతున్నాం.

ప్రభుత్వ ఆధీనంలోనే విత్తనముండాలి..
విత్తనమనేది ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలి. కార్పొరేట్లకు గుత్తాధిపత్యం సరిగాదు. కేవలం నాలుగు కంపెనీలే ప్రపంచంలోని 60 శాతం విత్తన వ్యాపారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాయి. మోడీ సర్కారు ద్వారాలు తెరవడంతో మన దేశంలో అవి తిష్టవేస్తాయి. అవి సిండికేట్‌ అయి ఇష్టానుసారంగా ధరలను నిర్ణయిస్తాయి. ఇప్పటికే ఆయా బ్రాండ్ల పేరుతో కల్తీ విత్తనాల రాకతో జెర్మినేషన్‌ తక్కువగా ఉంటున్నది. ఎక్కడో విదేశాల్లో పండించే విత్తనాలను సెల్ఫ్‌ డిక్లరేషన్‌ సర్టిఫికేషన్‌తో ఇక్కడ అమ్ముకునే వెసులుబాటు కల్పించడం దారుణం. మన దేశంలో భిన్న వాతావరణ పరిస్థితులున్నాయి. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విత్తనాలుండాలని మేం కోరుతున్నాం. నాటిన తర్వాత మొలకెత్తకుంటే, పంట దిగుబడి రాకుంటే కంపెనీలే బాధ్యత వహించేలా చూడాలి. రైతులకు సరైన విత్తనాలను ఇవ్వని కంపెనీలను బ్లాక్‌ లిస్టులో పెట్టాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -