Thursday, October 23, 2025
E-PAPER
Homeజాతీయంమహాగట్‌బంధన్‌ విజయం సాధిస్తుంది

మహాగట్‌బంధన్‌ విజయం సాధిస్తుంది

- Advertisement -

ఆ గెలుపు దేశ రాజకీయాల్ని మార్చేస్తుంది
కూటమికి బీహార్‌ ప్రజల నుంచి బలమైన మద్దతు : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా


న్యూఢిల్లీ : రాబోయే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగట్‌బంధన్‌ కూటమి గెలుస్తుంని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఫలితం దేశ రాజకీయ గమనంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. బీహార్‌ ప్రజలు మహాగట్‌బంధన్‌ కూటమికి బలమైన మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ప్రధాని మోడీతో సహా ప్రతి చోటా బీజేపీ, జేడీ(యూ) ఆందోళన చెందుతున్నాయని ఆయన అన్నారు. ”మహాగట్‌బంధన్‌ బీహార్‌ ఎన్నికల్లో విజయం సాధించబోతోంది. ఇది జాతీయ రాజకీయ పరిస్థితిపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఇది దేశ రాజకీయ గమనాన్ని ప్రభావితం చేస్తుంది” అని రాజా తెలిపారు.

మహాగట్‌బంధన్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌)లతో పాటు ఇతర చిన్నపార్టీలు కూడా ఉన్నాయి. సీపీఐ నినాదం ‘బద్‌లో సర్కార్‌, బచావో బీహార్‌ (ప్రభుత్వాన్ని మార్చండి, బీహార్‌ను కాపాడండి)’ ఓటర్లను ఆకట్టుకున్నదని ఆయన చెప్పారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న మహాగట్‌బంధన్‌కు ప్రజల మద్దతు ఉన్నదని అన్నారు. బీజేపీ, జేడీ(యూ) నాయకులు తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారనీ, ఇది వారి ఆందోళనకు గురవుతున్న విషయాన్ని సూచిస్తున్నని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక తమ కూటమికి అస్సలు సమస్య కాదన్నారు. బీహార్‌ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్‌.. మహాగట్‌బంధన్‌ కీలక నేతల్లో ఒకరని చెప్పారు.

కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలకు బీహార్‌ ఎన్నికలు నాంది పలుకుతాయనీ, 2029 లోక్‌సభ ఎన్నికల వరకు ఇది ఉంటుందని డి రాజా చెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంలను కాపాడటానికి, సామాజిక న్యాయం, సమాఖ్యవాదం ఆలోచనను రక్షించటానికి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించాలన్నదే తమ పార్టీ వైఖరి అని ఆయన తెలిపారు. బీజేపీ-ఆరెస్సెస్‌ను ఓడించి, అధికార పీఠం నుంచి దించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. బీహార్‌ అసెంబ్లీకి నవంబర్‌ 6, 11 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 243 నియోజకవర్గాలకు జరిగే ఈ ఎన్నికల ఫలితాలు అదే నెల 14న విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ, మహాగట్‌బంధన్‌ల మధ్య బలమైన పోటీ నెలకొన్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -