Monday, December 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి లాభాలు

మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి లాభాలు

- Advertisement -

మహిళల ప్రయాణానికి ‘ప్రత్యేక కార్డు’లు
పీఎం ఈ-డ్రైవ్‌ కింద 2800 ఎలక్ట్రిక్‌ బస్సులు
నిజామాబాద్‌, వరంగల్‌ పట్టణాలకు 100 బస్సులు
వచ్చే విద్యాసంవత్సరానికి ముందుగానే బుక్స్‌, యూనిఫామ్స్‌, బూట్లు
రజక, నాయి బ్రాహ్మణ కులవృత్తుల ఉచిత విద్యుత్‌ బిల్లుల విడుదల :ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మహలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సెంట్రల్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెస్‌ సహకారంతో మహిళల ప్రయాణానికి ‘ప్రత్యేక కార్డు’లు ఇస్తామని చెప్పారు. మహిళా సంఘాల నుంచి రుణాలు తీసుకోవడంతోపాటు ప్రభుత్వం అందించిన సహకారంతో సంస్థకు కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. బస్‌ డిపోల ఏర్పాటు, బస్‌ స్టేషన్ల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతోపాటుగా సంస్థ స్వతహాగా నూతనంగా ఆదాయ మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో మహలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు 255 కోట్ల విలువైన ఉచిత ప్రయాణాలు జరిగాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో పీఎఫ్‌ బకాయిలు రూ.1400 కోట్లు ఉండగా, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేండ్లలో రూ. 660 కోట్లకు తగ్గించినట్టు వివరించారు. సీసీఎస్‌ బకాయిలు గతంలో రూ.600 కోట్లు ఉంటే, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.373 కోట్లకు తగ్గించినట్టు తెలిపారు.

ముందుగానే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్‌,బూట్లు
వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే యూనిఫామ్స్‌, బుక్స్‌, బూట్లు పంపిణీ చేయనన్నుట్టు భట్టి వెల్లడించారు. అందుకు సంబంధించిన నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్థిక ముఖ్యకార్యదర్శి సందీప్‌ సుల్తానియాను ఆదేశంచారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ హాస్టళ్లలోని నిరుపేద విద్యార్థులకు కాస్మోటిక్‌, మెస్‌ఛార్జీలను 200 శాతం పెంచామని తెలిపారు. గతంలో ఎమ్‌జేపీిలో 327 గురుకులాలకు కేవలం 26 గురుకులాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వం వంద ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలను కార్పొరేట్‌ విద్యా సంస్థల తరహాలో నూతన భవనాలను నిర్మిస్తోందన్నారు. గురుకులాల అద్దె కోసం మెస్‌చార్జీలు, కాస్మొటిక్‌ ఛార్జీల కోసం రూ.152 కోట్లు విడుదల చేశారని చెప్పారు. నాయి బ్రాహ్మణ, రజక సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్తుకు సంబంధించిన బకాయిలను నెలల వారీగా ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆదేశించారు. గీత వృత్తిదారుల రక్షణ కోసం ఇప్పటివరకు 30వేల కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేసినట్టు తెలిపారు.

పీఎం ఈ-డ్రైవ్‌ కింద 2800 ఎలక్ట్రిక్‌ బస్సులు
పీఎం ఈ-డ్రైవ్‌ కింద హైదరాబాద్‌కు 2800 ఎలక్ట్రిక్‌ బస్సులు వస్తున్నాయని భట్టి చెప్పారు. వీటికి చార్జింగ్‌ స్టేషన్ల కోసం మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. వీటితోపాటు నిజామాబాద్‌, వరంగల్‌ పట్టణాలకు 100 ఎలక్ట్రిక్‌ బస్సులు రానున్నాయని పేర్కొన్నారు. మార్చి 2026 వరకు 3233 కండక్టర్‌ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరముందని తెలిపారు. అందులో కొన్ని తాత్కాలికంగా, 50శాతం పర్మినెంట్‌ నియామకాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. రవాణా శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి కొత్త వాహనాలు, టాక్స్‌ కలెక్షన్‌ కోసం ట్యాబ్‌లు, అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ పోస్టుల నియామకాల కోసం అనుమతి ఇవ్వాలని కోరారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌, ఆర్టీసీ ఎమ్‌డీ నాగిరెడ్డి, అదనపు రవాణా అధికారులు, ఎమ్‌జేపీ కార్యదర్శి సైదులు, బీసీ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -