Wednesday, January 28, 2026
E-PAPER
Homeజాతీయంమున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ

- Advertisement -

కనీసం అభ్యర్థులు కూడా దొరకని దుస్థితిలో బీఆర్‌ఎస్‌
– కేటీఆర్‌ ది సోషల్‌ మీడియా రాజకీయం
– సజన్‌ రెడ్డిని అడ్డంపెట్టుకుని బీఆర్‌ఎస్‌ మనీలాండరింగ్‌..
– మీనాక్షి నటరాజన్‌ మార్పు ప్రచారంలో నిజం లేదు : ఢిల్లీలో మీడియాతో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చిట్‌ చాట్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

త్వరలో జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు నల్లేరుపై నడకేనని పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. అత్యధిక మున్సిపాలిటీల్లో అసలు పోటీయే ఉండదని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ – బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అన్నారు. పదేండ్లు పవర్‌లో ఉన్నా బీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ప్రస్తుతం అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోందని తెలిపారు. మరీ ముఖ్యంగా నిజామాబాద్‌లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారని, కనీసం డిపాజిట్లు కూడా రావేమోనని ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ బుధవారం తెలంగాణ భవన్‌లోని శబరీ బ్లాక్‌లో మీడియాతో చిట్‌ చాట్‌ చేశారు. పదేండ్లు అధికారంలో ఉండి బీఆర్‌ఎస్‌ నేతలు ఏ స్థాయిలో దోచుకున్నారో ప్రజలు మర్చిపోలేదన్నారు. కేటీఆర్‌ సోషల్‌ మీడియాను నమ్ముకుని రాజకీయం చేస్తున్నారన్నారు. అది ఆయన రాజకీయ పరిపక్వతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ప్రజలు పనిని కొలమానంగా చేసుకుని ఓట్లు వేస్తారని, అంతే తప్ప సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలను చూసి ఓట్లు వేయరని చురకలంటించారు. గత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తిరుగులేని విజయాన్ని అందుకుందనీ, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అలాగే జైత్రయాత్ర సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

70 స్థానాల్లో బీజేపికి అభ్యర్థులే లేరు…
బీజేపీ ఎంత ప్రయత్నించినా తెలంగాణలో అధికారంలోకి రావడం అసాధ్యమని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. కర్ణాటక పరిస్థితులు, తెలంగాణ పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవని తెలిపారు. తెలంగాణలో దాదాపు 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి సరైన అభ్యర్థులే లేరని చెప్పారు. తెలంగాణ భౌతిక, సామాజిక పరిస్థితులు బీజేపీకి అనుకూలం కాదన్నారు. కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీని ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టు తెలిసిందన్నారు. అయితే కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా స్వాగతిస్తామన్నారు. కవిత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఆమె వ్యక్తిగత విషయమని చెప్పారు.

సృజన్‌రెడ్డిని అడ్డుపెట్టుకొని బీఆర్‌ఎస్‌ మనీ లాండరింగ్‌
బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి అల్లుడే సృజన్‌రెడ్డి అని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో సజన్‌ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఆ పార్టీ పెద్దఎత్తున మనీ లాండరింగ్‌ కు పాల్పడిందని ఆరోపించారు. సింగరేణి కుంభకోణానికి… స్టోరీ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ అన్నీ బీఆర్‌ఎస్సేనని అన్నారు. పదేండ్ల పాలనలో ఆ పార్టీ ఏ స్థాయిలో అవినీతికి పాల్పడిందో… కేసీఆర్‌ కుమార్తె కవితేే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. అయితే నైనీ బొగ్గు టెండర్ల వివాదం పూర్తిగా మీడియా సష్టేనని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై అధిష్టానంతో ఎటువంటి చర్చలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు.

ఉద్దేశపూర్వకంగా అసత్యాలు
పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, మంత్రుల విషయంలో ఉద్దేశపూర్వకంగానే కొందరు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని పీసీసీ చీఫ్‌ అన్నారు. ఈ ప్రచారాల్లో వాస్తవం లేదన్నారు. మంత్రుల మధ్య మంచి సమన్వయం ఉందని, ఈ అవాస్తవాలను నమ్మవద్దని అన్నారు. జోడెద్దులుగా… ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్యయంతో ముందుకు వెళ్తోందని చెప్పారు. అందుకే తాజాగా సర్పంచ్‌ ఎన్నికల్లో సత్ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాజకీయాలను అతి తక్కువ టైంలోనే మీనాక్షి నటరాజన్‌ పూర్తిగా అర్థం చేసుకున్నారన్నారు. తనకు, సీఎం రేవంత్‌ రెడ్డి, మీనాక్షి నటరాజన్‌కు మంచి సమన్వయం ఉందన్నారు.

కాంగ్రెస్‌ బలోపేతానికి పటిష్ట ప్రణాళికలతో ముందుకు
తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసేలా పటిష్ట ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్టు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ చెప్పారు. రాష్ట్రంలో రెండు డీసీసీ చీఫ్‌ల నియామకం పెండింగ్‌లో ఉందని, త్వరలోనే ఆ ప్రాంతాల్లో ఏఐసీసీ అబ్జర్వర్లు మరోసారి పర్యటిస్తారని చెప్పారు. ఆ రిపోర్ట్‌ల ఆధారంగా జిల్లా అధ్యక్షుల ప్రకటన ఉంటుందని తెలిపారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు, బీసీ సహా ఇతర కమ్యూనిటీ అధ్యక్షుల నియామకం, పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్‌ పోస్టులు, ఇతర అన్నీ పోస్ట్‌లను మున్సిపల్‌ ఎన్నికల తర్వాత భర్తీ చేయనున్నట్టు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -