సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎండీ సలీం
కార్పొరేట్ – కమ్యూనల్ పాలనకు వ్యతిరేకంగా వర్గ పోరాటం : ఏఐఏడబ్ల్యూయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి. వెంకట్
ఏఐఏడబ్ల్యూయూ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మహాసభ ప్రారంభం
భారీ ర్యాలీ, బహిరంగ సభ
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
ప్రజలను విభజించడమే బీజేపీ పాలన ప్రధాన లక్షణమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, పచ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ. సలీం అన్నారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) పశ్చిమబెంగాల్ రాష్ట్ర మహాసభ ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పానగార్‌లో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది వ్యవసాయ కార్మికులు, గ్రామీణ కూలీలు, పేద ప్రజలు పాల్గొని ప్రజా వ్యతిరేక విధానాలపై నినదించారు. ఈ సందర్భంగా ఎండీ సలీం మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలు దేశాన్ని తీవ్రమైన సామాజిక, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టుతున్నాయన్నారు. ప్రయివేటీకరణ పేరుతో ప్రజా రంగాన్ని ధ్వంసం చేయడం, ఉపాధి హామీ వంటి పేదల జీవనాధార పథకాలను నిర్వీర్యం చేయడం, కార్మికులపై దాడి చేసే నాలుగు లేబర్‌కోడ్‌లను బలవంతంగా అమలు చేయడం, ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో ప్రజాస్వామ్యానికి, సమాఖ్య వ్యవస్థకు ప్రమాదకరమైన చట్టాలను ఆమోదించడం బీజేపీ ప్రభుత్వ అసలైన స్వరూపాన్ని బహిర్గతం చేస్తున్నాయన్నారు.
దేశంలో లౌకికతపై తీవ్రమైన దాడి జరుగుతోందని, మతాన్ని రాజకీయ ఆయుధంగా మార్చి ప్రజలను విభజించడం బీజేపీ పాలన ప్రధాన లక్షణమని సలీం స్పష్టం చేశారు. అలాగే రాజ్యాంగం కల్పించిన సమానత్వం, సామాజిక న్యాయం, మౌలిక హక్కులను వ్యవస్థాగతంగా బలహీనపరుస్తూ రాజ్యాంగ విలువలను ఖాళీ చేసే ప్రయత్నం జరుగుతోందని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ స్వాతంత్య్ర పోరాటాల పరంపర, కార్మిక – రైతు ఉద్యమాల చరిత్ర, వామపక్ష రాజకీయ సంప్రదాయం దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని గుర్తుచేస్తూ, ఆ పరంపరను కొనసాగించడమే నేటి బాధ్యత అని అన్నారు. అదే సమయంలో మమతా బెనర్జీ ప్రభుత్వ పాలనలో కూడా ప్రజల సమస్యలకు పరిష్కారం లేకుండా అరాచకం, అవినీతి పెరుగుతున్నాయని విమర్శించారు. ఏఐఏడబ్ల్యూయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ మాట్లాడుతూ ”వికసిత్ భారత్” అనే నినాదంతో మోడీ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.
2005లో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ చట్టం, నేటి దాని దుస్థితి మధ్య ఉన్న వ్యత్యాసమే మోడీ ప్రభుత్వ అభివృద్ధి వాదనల అసలైన ముఖచిత్రమని వెల్లడించారు. అభివృద్ధి పేరుతో పేదల భూములను కార్పొరేట్లకు దోచిపెట్టడం, గ్రామీణ పేదరికాన్ని పెంచడం, అసమానతలను తీవ్రతరం చేయడం మోడీ ప్రభుత్వ విధానాల ప్రత్యక్ష ఫలితమని తెలిపారు. కేరళ మోడల్ పేదల సంక్షేమానికి, అత్యంత పేదరిక నిర్మూలనలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆయన వెల్లడించారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల ఐక్యతను బలోపేతం చేస్తూ, కార్పొరేట్-కమ్యూనల్ పాలనకు వ్యతిరేకంగా వర్గ పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. సభలో ఏఐఏడబ్ల్యూయూ అఖిల జాతీయ నాయకులు విక్రమ్ సింగ్, అమ్యాపాత్ర, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు తుసర్ గోష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరాపద్ మోండా తదితర నాయకులు పాల్గొన్నారు.
ప్రజలను విభజించడమే బీజేపీ పాలన ప్రధాన లక్షణం
- Advertisement -
- Advertisement -



