Saturday, March 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యుత్‌ బస్సుల నిర్వహణ ఆర్టీసీకే ఇవ్వాలి

విద్యుత్‌ బస్సుల నిర్వహణ ఆర్టీసీకే ఇవ్వాలి

- Advertisement -

మహాలక్ష్మికి బడ్జెట్‌లో రూ. 9800 కోట్లు కేటాయించాలి : రవాణా శాఖమంత్రికి ఎస్‌డబ్ల్యూఎఫ్‌ లేఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

టీజీఎస్‌ఆర్టీసీ పరిధిలోని విద్యుత్‌ బస్సుల నిర్వహణ ఆర్టీసీకే ఇవ్వాలని స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌- సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర కమిటీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు లేఖ రాసింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాకు లేఖ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలలో భాగంగా టీజీఎస్‌ ఆర్టీసీలో డిజీల్‌ బస్సుల స్థానంలో విద్యుత్‌ బస్‌లు తెస్తామనీ, 2027 చివరి నాటికి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పరిధిలోని డిజీల్‌ బస్సులను రూరల్‌ డిపోలకు తరలిస్తామనీ, కార్మికులను కూడా వివిధ జిల్లాలకు బదిలీ చేస్తామని ప్రభుత్వం విధాన ప్రకటన చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నిర్ణయం కార్మికులకే కాక, మొత్తం ఆర్టీసీనే ప్రయివేటు విద్యుత్‌ బస్‌ల కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోయేలా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకని ఆర్టీసీలకే విద్యుత్‌ బస్సుల కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్‌ బాధ్యతలు అప్పగించేలా విధానమార్పు చేయాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు సైతం ఆర్టీసీలకే ఇవ్వాలనీ, అందుకనుగుణంగా 2026-27 బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ మంత్రికి విజ్ఞప్తి చేసింది. అలాగే మహాలక్ష్మి పథకం డబ్బులు పూర్తిగా ఆర్టీసీకే చెల్లించేలా, విద్యార్థులు, ఆర్టీసీ అప్పులను ప్రభుత్వ ఈక్విటీగా మార్చి వడ్డీ భారం తగ్గించాలనీ, ఆర్టీసీ కార్మికులకు రావలిసిన ఆర్థిక సమస్యలను పరిష్కారం చేసేందుకు వీలుగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ లో నిధులు కేటాయించాలని కోరింది. ఈ అంశాలపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి భట్టి విక్రమార్క రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఆర్టీసీ ఎండీ, వైస్‌ చైర్మెన్‌ నాగిరెడ్డికి పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినట్టు ఈ లేఖ ద్వారా మంత్రికి గుర్తు చేశారు. మహాలక్ష్మి ద్వారా 46 లక్షలుగా వున్న ప్రయాణీకుల సంఖ్య, ప్రస్తుతం 64 లక్షల వరకు పెరిగినా ప్రజల అవసరాల మేరకు బస్సుల సంఖ్యను పెంచలేదని పేర్కొన్నారు. అలాగే 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 42 వేలమందిగా ఉన్న ఆర్టీసీ కార్మికులు, 2025 డిసెంబర్‌ నాటికి 39 వేల మందికి తగ్గారని గుర్తుచేశారు. అయినప్పటికి ఆనాడు రోజుకి 32 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిరిగితే, ఇప్పుడు 36 లక్షల కిలోమీటర్లు తిప్పుతున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో కార్మికుల సంఖ్య తగ్గినా, రోజుకి నాలుగు లక్షల కిలోమీటర మేర పనిభారం పెరిగిందన్నారు. అవసరమైన సిబ్బందిలేక కార్మికులపైన పని భారం, వేధింపులు పెరిగాయనీ, ఒక్క రోజు కూడా సెలవు దొరకడంలేదన్నారు. మహాలక్ష్మి పథకం అమలుతో రోజుకి సగటున రూ. 13 కోట్లు, నెలకు రూ. 390 కోట్లు ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రీ-ఎంబర్స్‌ కావలసి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్‌ బస్సుల విధానంలోనే అంటే గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌ (జీసీసీ) పద్ధతిలోనే ఇక్కడ తీసుకుంటున్నారని చెప్పారు. దీంతో ఆర్టీసీలో ప్రస్తుతం పని చేస్తున్న 39 వేల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరో 2000 బస్సులను తక్షణమే ప్రవేశపెట్టేందుకు వీలుగా రూ. 800 కోట్లను బడ్జెట్లో కేటాయించేలా చూడాలని కోరారు. మహాలక్ష్మి పథకం నిర్వహణ కోసం రూ. 9800 కోట్లు సమకూర్చాలని ప్రభుత్వానికి లేఖలో విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -